ఆత్మే అంతర్యామి

ABN , First Publish Date - 2021-12-24T05:30:00+05:30 IST

మహా చైతన్య పదార్థమైన ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు మొత్తం ఆత్మచైతన్యం ద్వారానే ముందుకు నడుస్తోంది....

ఆత్మే అంతర్యామి

మహా చైతన్య పదార్థమైన ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు మొత్తం ఆత్మచైతన్యం ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు, సర్వ శారీరక సుఖాలు.. ఇవన్నీ ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినా, ఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూ, స్వప్నావస్థలోనూ జాగృతంగా ఉండి... జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి, తిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి... హృదయకుహరంలో స్థితమై ఉన్న ఆత్మ. అది చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ దాటుకొని ముందుకు వెళుతుంది. చలించే వస్తువులన్నిటికన్నా దాని వేగం చాలా ఎక్కువ.


ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా అతీతమైనది. ఇంద్రియాలద్వారా మనం ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవం. ప్రతి ఉపకరణం నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. సూక్ష్మదర్శిని ద్వారా దగ్గరలో ఉన్న వస్తువులను మాత్రమే మనం చూడగలం. దూరదర్శన యంత్రాన్ని ఉపయోగించి... దూరంగా ఉన్న వస్తువులను చూడగలం. అదే విధంగా, ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకోగలవు. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు. 


ఆత్మ భూత, భవిష్యత్తులకు అధిపతి. ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ ‘‘బొటనవేలి పరిమాణం కలిగి, భూ, భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషుడు. ఏ కాలంలోనూ పొగబారని నిర్మలుడు. తేజోమయమైన జ్యోతివంటివాడు’’ అంటుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదు, మరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జనించిన ప్రతి వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. అంటే సూక్ష్మ రూపం (పుట్టుక), స్థూల రూపం (పెరుగుదల) మరింతగా పెరగడం (బలపడడం), రూపంలో మార్పు రావడం, క్షీణ దశ, నాశనం. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ. అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండం కన్నా పెద్దది. ఆత్మను శరీరంగా భావించి ‘నేను చంపుతున్నాను’ అని ఎవరైనా భావించినా, దేహాన్ని దేనితోనైనా కొట్టినప్పుడు ‘ఆత్మకు గాయమయింది’ అని అనుకున్నా... వారికి ఆత్మతత్త్వంపై అవగాహన ఏమాత్రం లేదని భావించాలి. 


ఆత్మ స్వరూపాన్ని ఎంతో ఘనంగా, విశదంగా పాండవ మధ్యముడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ, ‘‘అర్జునా! మానవుడు జీర్ణ వస్త్రాలను త్యజించి, నూతన వస్త్రాలను ధరించినట్టే, జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి, నూతన శరీరాన్ని పొందుతుంది. ఈ ఆత్మను శక్తిమంతమైన ఏ అస్త్రాలు, శస్త్రాలు ఛేదించలేవు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. వాయువు ఆరిపోయేలా చెయ్యలేదు. ఆత్మ నాశనరహితమైనదీ, నిత్యమైనదీ, సత్యమైనదీ అని, ఆత్మకు జనన మరణాలు లేవనీ, మార్పు అసలే లేదని తెలుసుకో’’ అని చెప్పాడు. 

ఆత్మ ఇంద్రియగోచరం కానిది. అంతేకాదు, అచింత్యమైనది. అంటే... మన మనసులోని ఆలోచనలకు అందనిది. ప్రతి ఒక్క చలనానికి... అంటే కదలికకు... అచంచలమైనదొకటి ఆధారంగా ఉండాలి. రైలు పరుగెత్తాలంటే కదలకుండా ఉండే పట్టాలు అవసరం. చలనచిత్రం చూడాలంటే... దానికి స్థిరమైన తెర ఆధారంగా ఉండి తీరాలి. లోకంలో సంభవించే చలనాలన్నిటికీ కారణభూతమైనది ప్రాణం. చలించే ప్రాణం పనిచేయడానికి ఆధారంగా నిలిచేది చలించని ఆత్మ. దృగ్గోచరంకాని ఆత్మను వర్ణిస్తూ ‘‘చేరి కానరానివాడు... చింతింపరానివాడు, భారపు వికారాల పాయనివాడీ ఆత్మ’’ అంటారు అన్నమాచార్య. ఆత్మతత్త్వం వర్ణించడం సాధ్యంకానంత అనంతత్వంతో భాసిస్తుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది. మహాచైతన్య పదార్థమైన ఆత్మనే... హృదయాంతరికలోకాన వసించే అంతర్యామిగా మనం భావన చెయ్యాలి.


                                                                                              వెంకట్‌ గరికపాటి

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST