జగన్ పిలుపుతో పులకించిన చిరంజీవి

ABN , First Publish Date - 2022-01-13T21:48:34+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి గన్నవరం ఎయిర్‌ఫోర్టు నుంచి నేరుగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.

జగన్ పిలుపుతో పులకించిన చిరంజీవి

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. చిరంజీవికి జగన్ ఎదురెల్లి స్వాగతం పలికారు. చిరంజీవిని చూడగానే ‘రండి ఆచార్య.. ఎల్‌కమ్ ఆచార్యా’ అంటూ జగన్ ఘన స్వాగతం పలికారు. దీంతో చిరంజీవి పులకించిపోయారు. చిరంజీవికి జగన్ లంచ్ ఏర్పాటు చేశారు. భోజనం చేస్తూ సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. ఇద్దరూ గంటకు పైగా చర్చించారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు. పండగ పూట విందుకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారని, అలాగే జగన్ సతీమణి భారతి దగ్గరుండి వడ్డించడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. తిరిగి అపాయింట్‌మెంట్ ఎప్పుడు అని అడగ్గా.. ‘ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా’ అని జగన్ అన్నారని చిరంజీవి తెలిపారు. జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృప్తికరంగా జరిగిందని తెలిపారు. జగన్ తనకు సోదర సమానుడని, సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


టికెట్ల వ్యవహారంపై చాలా రోజులుగా చిరంజీవి, జగన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు చిరంజీవి సీఎంతో భేటీ అయ్యారు. ‘‘సినిమావాళ్లకు బలుపు ఎక్కువ’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ రగిలిపోయింది. పరిశ్రమలోని పెద్దలంతా తీవ్రస్వరం వినిపించారు. ‘‘చీప్‌గా దొరికామని నోరు జారొద్దు’’ అంటూ ప్రసన్నకుమార్‌రెడ్డికి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, జగన్‌తో భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2022-01-13T21:48:34+05:30 IST