Jun 22 2021 @ 00:16AM

చిరంజీవి కుమార్తె చిత్రంలో నాయికగా...

‘జాను’ చిత్రంలో సమంత కథానాయిక. అయితే, జాను చిన్నప్పటి సన్నివేశాల్లో (యంగ్‌ సమంతగా) నటించిన గౌరీ జి కృష్ణ గుర్తున్నారా? ‘జాను’ మాతృక, తమిళ చిత్రం ‘96’లోనూ అదే పాత్ర చేశారు. త్వరలో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారామె. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మించనున్న తొలి చిత్రంలో నాయిక అవకాశం గౌరీ జి కృష్ణకు దక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘జాను’లో టీనేజ్‌ అమ్మాయిగా పరిచయమైన ఆమె, ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానున్నారన్నమాట. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుష్మిత ఓ చిత్రం నిర్మించనున్నారు. తమిళ సినిమా ‘8 తొట్టకల్‌’కు రీమేక్‌ అట. తమిళ సినిమా దర్శకుడు శ్రీ గణేశ్‌, తెలుగు వెర్షన్‌కు సైతం దర్శకత్వం వహించనున్నారని టాక్‌. త్వరలో సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.