‘చిరు’ కోటీశ్వరులు!

ABN , First Publish Date - 2021-07-23T07:24:06+05:30 IST

యూపీ కాన్పూర్‌లోని ఆదాయపన్ను విభాగం అధికారుల పరిశీలనలో దిగ్భ్రమ పరిచే వాస్తవాలు

‘చిరు’ కోటీశ్వరులు!

  • కాన్పూర్‌లో కోట్లకు పడగలెత్తిన 
  • 256 మంది చిరు వ్యాపారులు
  • నగరంలో ఖరీదైన చోట్ల ఆస్తులు.. 
  • గ్రామాల్లో 260 ఎకరాల కొనుగోలు
  • రెండేళ్లలో రూ.10 కోట్ల ఆస్తులు 
  • కొన్న ముగ్గురు పారిశుధ్య కార్మికులు
  • చెత్త ఏరుకునే వారికీ 3-4 కార్లు
  • ‘ఐటీ’ పరిశోధనలో విస్తుగొలిపే నిజాలు


న్యూఢిల్లీ, జూలై 22: యూపీ కాన్పూర్‌లోని ఆదాయపన్ను విభాగం అధికారుల పరిశీలనలో దిగ్భ్రమ పరిచే వాస్తవాలు బయటపడ్డాయి. నగరంలో రోడ్ల పక్కన పండ్లు అమ్మేవారు, పాన్‌షాపు, చిన్న కిరాణాషాపు నిర్వాహకులు, రోడ్ల మీద తిరుగుతూ సమోసాలు, ఖారా పొట్లాలు వంటి చిరుతిళ్లు అమ్మేవారు.. చెత్త ఏరుకునేవారిలో 256 మంది కోటీశ్వరులున్నట్లు గుర్తించారు. చెత్త ఏరుకునేవారిలో కొందరికి మూడు కన్నా ఎక్కువగా కార్లు ఉన్నట్లు తేల్చారు. వీరంతా గత ఐదేళ్లుగా రూపాయి పన్ను కూడా కట్టడం లేదని గుర్తించారు. అయితే ఈ 256 మంది కూడా గత ఐదేళ్లలో రూ.375 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు తేల్చారు.


 కాన్పూర్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇక వీరిలో కొందరు గ్రామీణ ప్రాంతాలైన బిథూర్‌, నరమావు, కాన్పూర్‌ నగర్‌ మంధన, కక్వాన్‌, బిల్హార్‌, సర్సాల్‌ ఫరూఖాబాద్‌ ప్రాంతాల్లో 260 ఎకరాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బెకాన్‌గంజ్‌కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు, లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన మరో కార్మికుడు గత రెండేళ్లలో 10 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 


Updated Date - 2021-07-23T07:24:06+05:30 IST