Abn logo
Sep 26 2021 @ 23:40PM

కబ్జాలో చిత్రావతి..!?

పొట్టిపాడు వద్ద చిత్రావతి నది భూముల్లో మామిడి తోట పెంపకం

ఆక్రమణలో నదీ పొరంబోకు భూములు

ఇప్పటికే 350 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం

మామిడి, సపోటా పండ్ల తోటల పెంపకం

కుంచించుకుపోతున్న నది 

అధికార పార్టీ కీలక నాయకుల అండదండలు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

అడ్డుకోబోయిన రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం!


జిల్లాలో భూమాఫియా పేట్రేగిపోతోంది. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా నదులు, కొండలను ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకోబోతే.. అధికార పార్టీ కీలక నాయకుల నుంచి ఫోన్లు వస్తుండడంతో ఏమీ చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన చిత్రావతి నదిని కూడా ఆక్రమణదారులు వదలలేదు. కొద్దికొద్దిగా దర్జాగా కబ్జా చేసేశారు. విద్యుత కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని మామిడి, సపోటా వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. పదో ఇరవై ఎకరాలు అనుకుంటే పొరబడ్డట్టే. దాదాపుగా 350 ఎకరాలు చిత్రావతి నది ఆక్రమణకు గురైనట్టు సమాచారం. తాజాగా నదిలో ఆక్రమణలను అడ్డుకోబోయిన రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొండాపురం మండలం పొట్టిపాడులో చిత్రావతి నది ఆక్రమణ తీరుపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): చిత్రావతి నది అనంతపురం, కడప జిల్లాల్లో ప్రవహిస్తోంది. జిల్లాలో కొండాపురం మండలం ఎనమలచింతల, పొట్టిపాడు, ఏటూరు గ్రామాల మీదుగా ప్రవహించి గండికోట జలాశయంలో, పెన్నానదిలో కలుస్తుంది. పాతికేళ్ల కిత్రం వర్షాకాలంలో చిత్రావతి వరద పరవళ్లతో కళకళలాడేది. లింగాల మండలం పార్నపల్లి సమీపంలో 10 టీఎంసీల సామర్థ్యంతో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నిర్మాణం తర్వాత వరద ప్రవాహం భారీగా తగ్గిపోయింది. అక్రమార్కులకు ఇది వరంగా మారింది. కొంచెం కొంచెంగా నదిని ఆక్రమిస్తూ.. నది ఆనవాళ్లే లేకుండా చేస్తున్నారు. కొండాపురం మండలంలోని పొట్టిపాడు రెవెన్యూ గ్రామం పరిఽధిలో సర్వే నంబరు 730లో 504 ఎకరాల నది పొరంబోకు భూములు ఉన్నాయి. కొంత నదీగర్భంలో ఉంటే.. కొంత ఒడ్డున ఉంది. వరద తగ్గడంతో రెవెన్యూ, అటవీ శాఖాధికారులు తాటి, అగ్గిపుల్ల వనాల పెంపకం చేపట్టారు. అయితే.. ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. అధికార పార్టీ అండదండలు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని కబ్జాకు తెర తీశారు. 


350 ఎకరాలకు పైగా ఆక్రమణ

ఒకేసారి అక్రమించుకుంటే అధికారుల ఉంచి అడ్డంకులు వస్తాయని పక్కా ప్రణాళికతో కొంచెం కొంచెంగా ఈ భూమిని కబ్జా చేస్తూ వస్తున్నారు. నదిలోని తాటి చెట్టు, అగ్గిపుల్ల వనాలను యంత్రాలతో పెకిలించి కాల్చేసి తరువాత ట్రాక్టర్లతో దున్నకాలు చేస్తున్నారు. పగలు పనులు చేస్తే ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తారనో.. మరే ఇతర కారణమో వారికే తెలియాలి. రాత్రికి రాత్రి అక్రమించుకోవడం, గుంతలు తవ్వి మామిడి, సపోటా మొక్కలు నాటి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. పదో ఇరవై ఎకరాలో కాదు.. రెండు మూడేళ్లలో ఏకంగా 350 ఎకరాలకుపైగా కబ్జా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నదులను కాపాడాల్సిన రెవెన్యూ, జలవనరుల శాఖాధికారులు ఫిర్యాదులు లేవు.. మాకెందుకు అంటూ కళ్లకు గంతలు కట్టుకోవడంతో పొట్టిపాడు కేంద్రంగా భూదందాకు అడ్డుకట్ట వేసేదెవరనే..? ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ గ్రామం పరిధిలో పట్టా భూములు ఎకరా రూ.6-8 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన కబ్జాకు గురైన చిత్రావతి నది భూముల విలువ సుమారుగా రూ.15 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. చిత్రావతి నది ఆక్రమణకు గురైనమాట నిజమే.. వందల ఎకరాలు అక్రమణకు గురి కాలేదని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. నదీతీరాన్ని సమగ్ర సర్వే చేయిస్తే ఆక్రమణ ఎంతో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం

పొట్టిపాడులో నదిలో అక్రమంగా పైపులైను వేసి పొరంబోకు భూముల కబ్జాకు పాల్పడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొండాపురం తహసీల్దార్‌, ఆర్‌ఐ, మండల సర్వేయర్‌, స్థానిక వీఆర్‌ఓతో పాటు 15 మందికిపైగా వీఆర్‌ఏలు వెళ్లి పరిశీలిస్తే.. అక్రమంగా నదిలో పైపులైను ఏర్పాటు కోసం గోతులు తవ్వినట్లు గుర్తించి వాటిని పూడ్చి వేశారు. అక్కడ వేసిన కొన్ని పైపులను ధ్వంసం చేసినట్లు తెలిసింది. తిరిగి వస్తుండగా కొందరు కబ్జాదారులు అధికారులను అడ్డగించి దుర్భాషలాడినట్లు సమాచారం. అధికార పార్టీ కీలక నాయకుడి నుంచి ఫోన రావడంతో అధికారులు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకడుగు వేసినట్లు సమాచారం. 20వ తేదీ ఈ ఘటన జరిగితే 21వ తేదీ ఓ వీఆర్‌ఏ ద్వారా ఫిర్యాదు చేయించినట్లు తెలుస్తోంది. 


అక్రమంగా విద్యుత కనెక్షన్లు

ప్రభుత్వ పొరంబోకు, వంకలు, నదుల ఆక్రమణ భూముల్లో వ్యవసాయ విద్యుత కనెక్షన్లు ఇవ్వరాదు. దీంతో పట్టా భూముల్లో విద్యుత కనెక్షన కోసం దరఖాస్తు చేసుకుంటారు. అక్కడే విద్యుత మోటార్‌, కనెక్షన, ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్‌ తీసుకుంటారు. ఆ తరువాత అదే ట్రాన్సఫార్మర్లు, విద్యుత కనెక్షన్లను అక్రమించిన నది భూముల్లో ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. చిత్రావతి నది ఒక్కటే కాదు.. జిల్లాలో పెన్నా, కుందూ, పాపాఘ్ని, చెయ్యేరు నదులు కూడా ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణల నుంచి నదులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 


చిత్రావతిలో ఆక్రమణలు తొలగించాం 

- శోభనబాబు, తహసీల్దారు, కొండాపురం మండలం

పొట్టిపాడు గ్రామం పరిధిలో చిత్రావతి నది ఆక్రమణకు గురైందని ఫిర్యాదు రావడంతో కలెక్టరు ఆదేశాల మేరకు  పరిశీలించాం. నదిలో అక్రమంగా పైపులైన కోసం తీసిన గోతులు పూడ్చి వేసి ఆక్రమణను అడ్డుకున్నాం. మాపై ఎవరూ దౌర్జన్యం చేయలేదు. అది ఒట్టి ప్రచారం మాత్రమే. నది ఆక్రమణలపై కలెక్టరు నివేదిక పంపుతాం.

నదిలో గోతులు తీసి పైపులు పాతిన దృశ్యం