ఇక పాలు పితికినట్టే!

ABN , First Publish Date - 2020-09-24T14:03:04+05:30 IST

జిల్లాలోని పాడి రైతులు ప్రభుత్వంపై పెట్టుకున్న గంపెడు ఆశలు ఆవిరై పోయినట్లే..

ఇక పాలు పితికినట్టే!

పాడి రైతుల ఆశలు ఆవిరి

చిత్తూరు డెయిరీ లిక్విడేషన్‌ రెండేళ్ళు పొడిగింపు


కలికిరి(చిత్తూరు): జిల్లాలోని పాడి రైతులు ప్రభుత్వంపై పెట్టుకున్న గంపెడు ఆశలు ఆవిరై పోయినట్లే. చిత్తూరు డెయిరీ (చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిదార్ల యూనియన్‌ లిమిటెడ్‌) లిక్విడేషన్‌ పరిమితిని మరో రెండేళ్ళు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ డెయిరీ తెరుచుకోవడమనేది కనుచూపుకు దూరమయినట్లేనని చెబుతున్నారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన చిత్తూరు డెయిరీని ప్రభుత్వం పదిహేనేళ్ళ క్రితం దివాలా సంస్థ (లిక్విడేషన్‌)గా ప్రకటించి లిక్విడేటర్‌ను నియమించి దాని పరం చేసింది.


అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలన్నీ డెయిరీని తెరిపిస్తామనే హామీతో పాడి రైతులకు ఆశలు కల్పించి ఊరిస్తూ రావడం పరిపాటయింది. గతంలో ఏకంగా ఐదేళ్ళు లిక్విడేషన్‌ పీరియడ్‌ను పొడిగిస్తూ 2016 ఆగస్టు 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గడిచిపోయిన నాలుగేళ్ళకు కలుపుకుని ఈ పొడిగింపు ఇవ్వడంతో పాడి రైతులకు డెయిరీపై ఆశలు చిగురించాయి. నాలుగేళ్ళుగా లిక్విడేషన్‌ ఊసు లేకపోవడంతో ఏదో విధంగా డెయిరీ తెరుచుకుంటుందనే ఆశలు పెరిగాయి.


2017 జూలై 26 వరకూ వర్తించే విధంగా ఈ పొడిగింపు జరిగింది. అయితే తిరిగి 2019 జూలై 26 వరకూ పొడిగిస్తూ 2017 సెప్టెంబరు 25న ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి ఎన్నిల ముందు డెయిరీని తెరిపించడంతోపాటు లీటరుకు రూ.4 సబ్సిడీ ఇస్తామని జగన్‌ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్లు 2019 జూలై 26కు లిక్విడేషన్‌ గడువు ముగిసినా సంవత్సర కాలం పైబడుతున్నా పొడిగింపు ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. దీంతో ఇక లిక్విడేషన్‌కు ముగింపు పలికి డెయిరీని తెరిపిస్తారనే ఆశలు రైతుల్లో పాదుకున్నాయి.


అయితే హఠాత్తుగా లిక్విడేషన్‌ను మరో రెండేళ్ళపాటు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాలపొంగుపై నీళ్ళు చల్లినట్లయ్యిందని పాడి రైతులు వాపోతున్నారు. తామెవరికీ తీసిపోమన్నట్లు 2019                జూలై 27 నుంచి 2021 జూలై 26 వరకూ రెండేళ్ళు (గడిచిపోయిన సంవత్సరంతో సహా) పొడిగిస్తూ పశుసంవర్ధక, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2020-09-24T14:03:04+05:30 IST