Abn logo
Nov 23 2020 @ 01:59AM

పరిహారం లేదు.. ప్రత్యామ్నాయం లేదు

ఇరుకుగా ఉన్న ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌Kaakateeya

చిత్తూరు హైరోడ్డు విస్తరణకు అధికారుల అడుగులు

రోడ్డున పడనున్న వందల కుటుంబాలు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: పరిహారం మాటలేదు. ప్రత్యామ్నాయం చూపలేదు. అయినా చిత్తూరులోని హైరోడ్డు విస్తరణకు అధికారులు అడుగులేస్తున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా రహదారులన్నీ 30- 40 అడుగులే ఉన్నాయి. నిత్యం వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా నలుచెరుగులా రహదారుల అభివృద్ధి జరుగుతుంటే నగరంలో మాత్రం ఆగుతూ వస్తోంది. కట్టమంచి వెంకుసా కల్యాణ మండపం నుంచి గిరింపేట వరకున్న రహదారిని విస్తరించాల్సి ఉంది. దీనికోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్‌ ప్రద్యుమ్న గట్టి ప్రయత్నం చేశారు. ఈ హైరోడ్డు నిర్వాసితులంతా అసోసియేషన్‌గా ఏర్పడి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నగదు పరిహారం ఇచ్చాకే తమ ఆస్తులను ధ్వంసం చేయాలని బాధితులు డిమాండు చేశారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జరిగే రహదారుల విస్తరణలో పరిహారం ఇవ్వమని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో విస్తరణ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు విస్తరణలో భాగంగా కట్టడాల తొలగింపునకు మార్కింగ్‌ వేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. 


రూ.300 కోట్లు అవసరం 

ఈ రహదారి ప్రస్తుతం 40 అడుగుల్లోపే ఉండడంతో.. విస్తరణకు మరో 60 అడుగులు అవసరం. ఈ రహదారి మీదుగా 365 నిర్మాణాలున్నాయి. వీటిలో నివాసాల కంటే దుకాణాలే అధికం. కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిననున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్తులను లెక్కేయగా.. రూ.300 కోట్ల వరకు పరిహారం అవసరమని అంచనా వేశారు.

నయాజ్‌, ముంతాజ్‌, ఆసీఫ్‌, అస్లాం అన్నదమ్ములు. వీరికి ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌ సమీపంలో టైర్లు, పంక్చర్‌ షాపులున్నాయి. వీరి పూర్వీకులు సహా 60 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నాలుగు కుటుంబాలకే 20/22 అడుగులున్న ఈ దుకాణమే ఆధారం. ఇప్పుడు రహదారి విస్తరణలో ఈ దుకాణం మొత్తం ధ్వంసం కానుంది. నాలుగు కుటుంబాలూ రోడ్డున పడనున్నాయి.

ఈమె కుముదమ్మ. గాంధీ, ఎమ్మెఎస్సార్‌ సర్కిళ్ల మధ్యలో రహదారి పక్కన సాయంత్రం బజ్జీల దుకాణం నిర్వహిస్తోంది. 20 ఏళ్ల కిందట భర్త మరణించగా.. ఈ దుకాణం ఆధారంగానే ముగ్గురు పిల్లల్ని స్థిరపడేలా చేసింది. మరో బాబు ఉన్నాడు. మూడు తరాలుగా ఈ కుటుంబం ఇక్కడే ఉంటోంది. 27/13 అడుగులున్న ఈ దుకాణం రహదారి విస్తరణలో పూర్తిగా పోతే వీరు జీవనాధారం కోల్పోనున్నారు. ఇదే జరిగితే ఆత్మహత్యే శరణ్యమని కుముదమ్మ ఆవేదన చెందుతోంది.

ఆరణి మాట


అప్పుడలా.. 

‘నేను ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీ అధికారంలోకి వస్తే నగదు పరిహారం ఇప్పిస్తాను. అప్పటి వరకు రహదారుల జోలికి వెళ్లం’ అంటూ అప్పట్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆరణి శ్రీనివాసులు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. పరిహారం ఇవ్వకుండా నివాసాలను తొలగించకూడదని తేల్చిచెప్పారు. 


ఇప్పుడిలా.. 

‘విస్తరణలో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి  నగరానికి బయట ఉన్న ప్రశాంత్‌ నగర్‌లో ఇంటి స్థలం ఇప్పిస్తాం. పాక్షికంగా కోల్పోతున్న వారికి టీడీఆర్‌ బాండ్లను ఇస్తాం’ అంటూ ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఒప్పిస్తున్నారు. గత హామీ ప్రకారం పరిహారం ఇవ్వకనే రహదారి విస్తరణకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల అధికారులు రహదారి వంద అడుగుల విస్తరణకు మార్కింగ్‌ వేశారు. 


గాలి వెంకటేశ్వర్లు, హైరోడ్డు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు

నగదు పరిహారం ఇవ్వాల్సిందే 

మా డిమాండ్లను పరిగణనలోని తీసుకుని మాకు నష్టపరిహారం అందించండి. మేము అభివృద్ధికి సహకరిస్తాం. మాకు జీవనాధారం లేకుండా చేయొద్దు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను రోడ్డున పడేయకండి. 2013 నిర్వాసితుల చట్టం ప్రకారం మాకు నగదు పరిహారం ఇవ్వాల్సిందే.

మనోహర్‌, సంఘం కార్యదర్శి

మీ ఆస్తులైతే వదులుకుంటారా?

మా స్థానాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులుంటే తమ ఆస్తులను ఉచితంగా వదులుకుంటారా? మమ్మల్ని ఎందుకు ఇంతగా వేధిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా మా ఆస్తులను ధ్వంసం చేయకూడదని కోర్టు స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను గౌరవించండి.


Advertisement
Advertisement