Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆసక్తి రేకెత్తిస్తోన్న.. చిత్తూరు టీడీపీ ఇంఛార్జ్‌ పదవి..?

అది జిల్లా కేంద్రమైన నియోజకవర్గం. రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ను నియమించలేదు.కానీ ఇప్పుడు ఆసమయం దగ్గర పడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆపదవి దక్కించుకోవడానికి ఎవరికివారు ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెలుతున్నారనే వాతావరణం కనిపిస్తోందనే టాక్‌వస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఎవరికి నియమించాలనుకుంటున్నారు? పోటీలో ఉన్నవారిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


చిత్తూరు టీడీపీ ఇంఛార్జ్‌ పదవి దక్కేదెవరికి?  

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు.  జిల్లా కేంద్రం చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్‌ పదవి కోసం సామాజికవర్గాల వారీగా పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో బలిజ సామాజికవర్గం ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీ చేయగా టీడీపీ తరఫున ఆయన సమీప బంధువు వరుసకు సోదరుడయ్యే మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగిన ఆయనపై వైసీపీ కక్షసాధింపులు, బెదిరింపులకు పాల్పడటతో పార్టీకి దూరమయ్యారు మనోహర్‌. అప్పటి నుంచి పార్టీకి ఇంఛార్జ్‌ లేకుండానే టీడీపీ కార్యక్రమాలు సాగుతున్నాయి. 

ఇంఛార్జ్‌కే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ అనే ప్రచారం 

నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌కే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రభావం చూపించే కమ్మ, బలిజ వర్గాలు తెరవెనక ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నియోజకవర్గ టీడీపీ నేతల్లో నెలకొంది. బలిజ సామాజికవర్గం నుంచి మాజీ మేయర్, నగర టీడీపీ అద్యక్షురాలు కటారి హేమలత, చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా టీడీపీ ఉపాద్యక్షుడు కాజూరు బాలాజీ ఇన్‌ఛార్జ్‌ పదవిని ఆశిస్తున్నారు.


కమ్మసామాజికవర్గానికి చెందిన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుజాల మహదేవ సందీప్‌లు ఇంఛార్జ్‌ పోస్ట్‌ కోసం ట్రై చేస్తున్నారు. పులివర్తి నాని 2019 ఎన్నికల్లోనే చిత్తూరు నుంచి పోటీచేయాలని ఎంతో ప్రయత్నించారు. చంద్రగిరి నుంచి పోటీచేయాల్సిన పరిస్దితి రావడంతో అప్పటినుంచి అక్కడే ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇక వచ్చే 2024 ఎన్నికల్లోనైనా చిత్తూరు నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. 

సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న నేతలు 

బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత అవకాశం దొరికినపుడల్లా అనేక సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చంద్రబాబునాయుడు దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్‌ వస్తోంది. కరోనా కష్టకాలంలో చిత్తూరు నగరంలోని డివిజన్లు, చిత్తూరు రూరల్, గుడిపాల మండలాల్లోను ప్రజలకు నిత్యావసర సరకుల దగ్గర నుంచి, ఆనందయ్య కరోనా మందు  పంపిణీ వరకు అన్ని కూడా కాజూరీ బాలాజీ సొంత డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలకు ఉచితంగా పంపిణీచేసారని, డాక్టర్‌ను అందుబాటులో ఉంచారని కార్యకర్తలు అంటుంటారు. తాజాగా గుడిపాల మండలంలో జరిగిన ఓ ఎంపీటీసీ ఎన్నికలోను టీడీపీ గెలుపునకు బాలాజీ తీవ్రంగా కృషిచేశారు. కీలకమైన నేతలు చిత్తూరు నియోజకవర్గం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఇంఛార్జ్‌ పదవి కోసం ప్రయత్నిస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పుడు...?ఎవరికి... అవకాశం కల్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. 

Advertisement
Advertisement