సొంత మనిషిలా.. ఆపదలో అందరికీ చేరువలో..

ABN , First Publish Date - 2021-05-30T00:24:00+05:30 IST

గతేడాది కాలంగా కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఎందరినో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కుంగదీసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వలస కూలీలను నడిరోడ్డుపై నిలబెట్టింది.

సొంత మనిషిలా.. ఆపదలో అందరికీ చేరువలో..

‘‘నేను మనిషిని నమ్ముతాను. ప్రేమిస్తాను. ఆదరిస్తాను. ఎందుకంటే నేను కూడా మనిషినే అన్న చిన్న స్వార్థం’’ ... ‘ఆ నలుగురు’ సినిమాలో ఓ డైలాగ్ ఇది. సాటి మనిషి పట్ల సేవాదృక్పథంతో.. ఆదరణ భావంతో పనిచేసే ఎందరో మానవతామూర్తులకు ఇది ఓ నిర్వచనంలా ఉంటుంది. గతేడాది కాలంగా కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఎందరినో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కుంగదీసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వలస కూలీలను నడిరోడ్డుపై నిలబెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ‘మేము సైతం’ అంటూ ఎంతో మంది మంచి మనుషులు ముందుకు వచ్చి.. అన్నార్థుల ఆకలి బాధలను తీర్చారు. అంతేగాక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజన్, బెడ్స్, మందులు ఇలా ఎన్నో సమకూర్చారు. అందులో ఒకరు చిత్తూరు టౌన్‌కు చెందిన వరుణ్. 


వలస కూలీలతో మొదలు..


ఈ 30 ఏళ్ల యువకుడు బెంగళూరులోని ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగి. తన పని మాత్రమే చూసుకోకుండా... చుట్టూ ఉన్న వారి వ్యథలను, కష్టనష్టాలను గమనిస్తూ.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అండగా నిలుస్తున్నాడు. తను పుట్టిన పెరిగిన చిత్తూరులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ ఆపత్కాలంలో ఆదుకున్న దేవుడు అయ్యాడు. 


కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో వరుణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్‌లో వలస కూలీలు పడుతున్న కష్టాలను దగ్గరి నుంచి గమనించిన వరుణ్.. తన స్నేహితులు సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజులు తన జీవితంలో మరపురాని అనుభూతులను మిగిల్చాయి అంటాడు వరుణ్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి రైతు ఘటన తన జీవితంలో ప్రత్యేకమైన రోజంటూ ఉద్వేగానికి గురవుతుంటాడు. రైతు తన పొలంలో కుమార్తెల సాయంతో దుక్కి దున్నడం.. అతి జాతీయ మీడియా ద్వారా సోను సూద్‌కు తెలియడం.. ఆయన ట్రాక్టర్ ఇస్తానని మాటివ్వడం.. దానిలో తానూ భాగస్వామి కావడం చకచకా జరిగిపోయాయి. సోనుసూద్ నుంచి రైతుకు ట్రాక్టర్ అందడంలో తనదైన పాత్ర పోషించాడు వరుణ్. సోనూ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ మదనపల్లెలో సోనాలికా కంపెనీ డీలర్‌ ద్వారా రైతు దగ్గరకు ట్రాక్టర్ చేరేలా చేశాడు.   


ఆనాటి పరిచయం సోనూకు వరుణ్‌ను మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం సోనూ ఫౌండేషన్‌లో వరుణ్ కూడా ఒక సభ్యుడు. వాట్సాప్, ట్విటర్ వంటి ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఎవరికి ఏ సహాయం కావాలో తెలుసుకుని మరీ తనవంతు బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో వలస కూలీలు మొదలు సెకండ్ వేవ్‌లో ఆసుపత్రులలో వైద్య సిబ్బంది, కరోనా బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు ఇలా అందరికీ అందుబాటులో ఉంటూ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తున్నాడు.  అందరికీ సొంతమనిషిలా మారిపోయాడు వరుణ్. 

Updated Date - 2021-05-30T00:24:00+05:30 IST