Abn logo
May 24 2020 @ 00:04AM

ఊహించని డబ్బు ఉక్కిరిబిక్కిరి చేస్తే...!

అవినీతిని అరికట్టి, నల్లడబ్బును బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో 2016 చివర్లో ప్రధాని మోదీ ‘డీమానిటైజేషన్‌’ (పెద్ద నోట్ల రద్దు) ప్రకటించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ సమయంలో పాత నోట్లను మార్చుకునేందుకు చాలామంది చేసిన అనేక చిత్ర విచిత్ర ప్రయత్నాలు వార్తల్లోకెక్కాయి. ఆ అంశాన్నే కథాంశంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ కోసం ‘చోక్డ్‌’ అనే డార్క్‌ సినిమా తీశారు. రెండు రోజుల క్రితం విడుదలైన  ఈ వెబ్‌ సినిమా ట్రైలర్‌ అందరిలో ఆసక్తిని రేపుతోంది.


అదొక అపార్ట్‌మెంట్‌... చీకట్లో భుజానికి బ్యాగు, చేతిలో సూట్‌కేస్‌ పట్టుకున్న ఒక వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోని పై ఫ్లోర్‌కు వెళ్తాడు. గదిలో సూట్‌కేస్‌ తెరవగానే దాని నిండా నోట్ల కట్టలు. కొన్ని కొన్ని నోట్లను పాలిథిన్‌ కవర్లలో పెట్టి, రబ్బర్‌ చుట్టి... బాత్‌రూమ్‌లోని ఔట్‌లెట్‌ పైపులో పడేస్తుంటాడు. ‘‘పైన ఫ్లాట్‌లో ఉన్నతను ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు... రహస్యంగా వస్తాడు... కుందేలులాగా బయటకు వెళ్లిపోతుంటాడు’’... అతడి గురించి అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు మహిళల గుసగుసలు.


అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది సరితా పిళ్లై. సాధారణ మధ్య తరగతికి చెందిన ఆమె బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తుంటుంది. ఇంట్లో ఏ పనిచేయని భర్త ‘‘మూడు రోజులుగా ఆలూ కర్రీనే వండుతోంది... పనీర్‌ కర్రీ చేయొచ్చుగా’’ అన్నా కూడా పట్టించుకోదు. పైగా పనీ పాటలేక రికామీగా ఉన్న భర్త అంటే ఏ భార్యకైనా చులకనే కదా. సరిత ఉంటున్న ఫ్లాట్‌లోని కిచెన్‌ సింక్‌ తరచూ బ్లాక్‌ అవుతూ ఉంటుంది. దాంతో ఆమె అనేక అవస్థలు పడుతుంటుంది. ఒక రోజు రాత్రి వంటగది సింక్‌ ఉన్న  చోట నీళ్లు పొంగి పొర్లుతుంటాయి. టార్చి వేసి చూస్తే అక్కడి పైపులో నుంచి ప్లాస్టిక్‌ కవర్‌ బయటకు వస్తూ కనిపిస్తుంది. రబ్బరు బ్యాండ్‌ వేసి ఉన్న ఆ కవర్‌ను విప్పి చూస్తే ఆశ్చర్యం... అన్నీ 500 నోట్లు. దాంతో సరిత లైఫ్‌స్టయిల్‌ ఒక్కసారిగా మారిపోతుంది. అయితే కనిపించే ఆ నోట్ల వెనుక కనిపించని కథ ఏంటీ? ప్రధాని మోదీ ‘పెద్ద నోట్ల రద్దు’ ప్రకటనను టీవీలో చూసి ‘‘ఇప్పుడు బ్లాక్‌ మనీ మొత్తం బయటకు వస్తుంది’ అని భర్త సంతోషంగా అంటే ఆమె ఎందుకు బిక్కమొహం వేసింది? ‘పైసా బోల్తా హై’ (డబ్బు మాట్లాడుతుంది) అంటూ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తీసిన ‘చోక్డ్‌’ ఎప్పటిలాగే ఆయన తరహా డార్క్‌ సస్పెన్స్‌ డ్రామాను గుర్తుకుతెస్తుంది. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన మరో ఆసక్తికరమైన కథతో, తనదైన శైలిలో ఉత్కంఠభరితంగా రూపొందించారు.మధ్య తరగతి మహిళగా...

పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ఒక మధ్య తరగతి మహిళ కోణంలో చూపించడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సాదాసీదా గృహిణిగా, సాధారణ బ్యాంకు ఉద్యోగిగా సరితా పిళ్లై పాత్రలో సయామీ ఖేర్‌ నటించారు. 2015లో సాయిధరమ్‌ తేజ హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘రేయ్‌’ సినిమాలో సయామీ హీరోయిన్‌గా చేశారు. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా (‘రంగ్‌ దే బసంతీ’, ‘ఢిల్లీ6’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ ఫేమ్‌) దర్శకత్వంలో వచ్చిన ‘మీర్జ్యా’లో నటించినప్పటికీ సరైన బ్రేక్‌ మాత్రం రాలేదు. మాజీ మిస్‌ ఇండియా ఉత్తర మాత్రా ఖేర్‌ కూతురైన సయామీ సీనియర్‌ నటి తన్వీ అజ్మీకి మేనకోడలు కూడా. ‘‘నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నందుకు ముందుగా దర్శకుడు అనురాగ్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. నేను పోషించిన సరిత పాత్రలో సగటు మధ్యతరగతి మహిళ కనిపిస్తుంది. ఇంట్లో, ఆఫీసులో పనిభారంతో ఫ్రస్టేషన్‌లో ఉన్న గృహిణికి అనుకోకుండా నోట్ల కట్టలు కనిపిస్తే ఆమె ఎలా జీవించాలనుకుంటుంది? స్ర్కిప్టు రచయిత నిహిత్‌ భావే మధ్య తరగతి భావోద్వేగాలను అద్భుతంగా రాశారు’’ అన్నారు సయామీ. ఇందులో ఆమె భర్తగా మలయాళం నటుడు రోషన్‌ మాథ్యూ నటించారు. ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘దేవ్‌ డి’, ‘గాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’, ‘మన్‌మర్జియా’ వంటి విభిన్న సినిమాలతో తనదైన మార్క్‌ను బాలీవుడ్‌పై వేసిన అనురాగ్‌ కశ్యప్‌ వెబ్‌ సినిమాలతో కూడా ఆకట్టుకుంటున్నారు. ‘‘నిజం, అధికారం, డబ్బు మధ్య అనిశ్చితిని ఒక మధ్య తరగతి మహిళ కోణంలో చూపాలనే ప్రయత్నం చేశా. ప్రతీరోజూ రాత్రి కిచెన్‌ సింక్‌లో నుంచి పొంగిపొర్లే డబ్బు... ఒక మహిళలో, ఆమె జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందనేది ఆసక్తికరం’’ అన్నారు కశ్యప్‌. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ వెబ్‌ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది.


Advertisement
Advertisement
Advertisement