రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన Chris Gayle

ABN , First Publish Date - 2021-11-07T22:25:04+05:30 IST

వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు.

రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన Chris Gayle

దుబాయ్: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల విండీస్  ఆటగాడు బ్రావో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో నిన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్, డ్వేన్ బ్రావోకు సహచర ఆటగాళ్ల నుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ లభించింది.


దీంతో గేల్ కూడా రిటైర్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీనికితోడు బ్యాటింగ్ సమయంలో తన బ్యాట్‌ను ఎత్తి ప్రేక్షలకు చూపిస్తూ అభివాదం చేయడం, తన గ్లోవ్స్‌పై సంతకం చేసి ప్రేక్షలకు ఇవ్వడం వంటి చర్యలు గేల్ రిటైర్మెంట్ వార్తలను మరింత బలపరిచాయి. అలాగే, బౌలింగులో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్‌ను అవుట్ చేశాక, అతడు వెళ్తూవెళ్తూ గేల్‌ను హగ్ చేసుకోవడం వంటివి అందరి దృష్టిని ఆకర్షించాయి.


ఇవన్నీ చూసిన అభిమానులు గేల్ తన చివరి మ్యాచ్ ఆడేశాడని, రిటైర్మెంట్ ప్రకటించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన గేల్.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. టీ20 ప్రపంచకప్ చివరి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశానంతేనని పేర్కొన్నాడు. తన ఫేర్‌వెల్ మ్యాచ్ తన స్వస్థలమైన జమైకాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.  

Updated Date - 2021-11-07T22:25:04+05:30 IST