రాజాంలో భూ మాయ!

ABN , First Publish Date - 2021-06-21T04:37:41+05:30 IST

జిల్లాలో భూ దందాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పట్టణాల్లో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసే స్థాయిలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించి దందాలు సాగిస్తున్నారు. ప్రైవేటు సంస్థల భూములకు రక్షణగా ఉండాల్సిన మరికొందరు.. అక్రమార్జన కోసం వాటిని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. తాజాగా రాజాంలో ‘ఆర్‌సీఎం’ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులకు ఓ చర్చి ఫాదర్‌ గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి రిజిస్ర్టేషన్‌కు ప్రయత్నించారు. దీనిపై మిగతా చర్చిల ఫాదర్లు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా రిజిస్ర్టార్‌కు ఫిర్యాదు చేయడంతో.. అక్రమాల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. రిజిస్ర్టేషన్లకు బ్రేక్‌ పడింది.

రాజాంలో భూ మాయ!

 ఆర్‌సీఎం భూముల విక్రయించిన చర్చి ఫాదర్‌!

 గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు

 ఫిర్యాదులతో నిలిచిన అక్రమాల వ్యవహారం

(రాజాం/రూరల్‌)

జిల్లాలో భూ దందాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పట్టణాల్లో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసే స్థాయిలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించి దందాలు సాగిస్తున్నారు. ప్రైవేటు సంస్థల భూములకు రక్షణగా ఉండాల్సిన మరికొందరు.. అక్రమార్జన కోసం వాటిని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. తాజాగా రాజాంలో ‘ఆర్‌సీఎం’ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులకు ఓ చర్చి ఫాదర్‌ గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి రిజిస్ర్టేషన్‌కు  ప్రయత్నించారు. దీనిపై మిగతా చర్చిల ఫాదర్లు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా రిజిస్ర్టార్‌కు ఫిర్యాదు చేయడంతో.. అక్రమాల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. రిజిస్ర్టేషన్లకు బ్రేక్‌ పడింది. 

......................

రాజాంలో ఆర్‌సీఎం చర్చి భూములపై అక్రమార్కుల కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో ఓ చర్చి ఫాదర్‌ వీటిని విక్రయించేందుకు యత్నించిన వైనం వెలుగుచూసింది. జిల్లాలో పారిశ్రామికంగా రాజాం పట్టణం అభివృద్ధి చెందుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో భారీగా కొత్త లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో భూముల  ధరలు  రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాజాంలోని ఆర్‌సీఎం చర్చికి సంబంధించిన భూముల ధరలు కూడా పెరిగాయి.

 దశాబ్దాలుగా చర్చికి చెందిన ఈ భూములను కౌలుకు అప్పగించారు. గడిముడిదాం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 392లో సుమారు 51 ఎకరాలు ఉన్నాయి. ఇందులో సుమారు 12 ఎకరాల వరకు వైఎస్‌ఆర్‌ ఇళ్ల స్థలాల పేరుతో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూమి సర్వే నెంబరు 392-1బీలో 21.61 ఎకరాలు, 392-3లో 15.55 ఎకరాలు కలిపి మొత్తం 37.16 ఎకరాలు ఈ చర్చి ఫాదర్‌ పేరున ఉంది. ఈ భూముల పరిసరాల్లోనే గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే క్రమంలో కొత్త లేఅవుట్లు పుట్టుకొస్తుండడంతో చర్చి భూములపై కొంతమంది అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. చర్చి ఫాదర్‌తో బేరాలు కుదుర్చుకుని రిజిస్ట్రేషన్‌కు సిద్ధమయ్యారు. దీన్ని సహించని మరికొంతమంది చర్చి ఫాదర్లు ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు, జిల్లా రిజిస్ట్రార్‌కు, పాలకొండ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటపడి... రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌కు ఫోన్‌ ద్వారా ఆదేశాలు అందినట్టు పలువురు చెబుతున్నారు. 


వెలసిన లే అవుట్‌

క్రిస్టియన్‌ మిషనరీస్‌కు చెందినదిగా చెబుతున్న ఈ భూముల్లో ఇప్పటికే లేఅవుట్‌ వేసేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారని చెబుతున్న ఈ భూమి మరింత లాభానికి వారు పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించారని తెలిసింది. ప్రభుత్వ పెద్దల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ భూమిలో ఇప్పటికే వెంచర్‌ పనులు ప్రారంభించారు. 


 పెద్దల హస్తం..?

భూముల అక్రమ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ నేత కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిపినట్టు సమాచారం. ఇందులో రాజాం పట్టణానికి చెందిన మరో నాయకుడు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. వీరికి రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టాలనుకున్నా... చివరి క్షణంలో ఈ వ్యవహారం బయటపడడంతో ఇటు రెవెన్యూ, అటు అధికార పార్టీకి చెందిన నేతల్లో అయోమయం నెలకొంది.


ఎన్నో ప్రశ్నలు...

ఈ వ్యవహారంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు రాజాం ప్రాంతంలో జరగడం, భూములు సైతం ఇక్కడే ఉన్నా రిజిష్ట్రేషన్లు పాలకొండలో ఎందుకు ఏర్పాటు చేశారనేది ప్రశ్నార్థకమవుతోంది. ఈ వ్యవహారంపై కొంతమంది పెద్దలు రాజాం టౌన్‌ సీఐను కలిసినా ఎందుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నది చర్చనీయాంశమవుతోంది. 


దర్యాప్తు చేస్తాం

 భూ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తాం. భూ లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు నిర్ధారణ జరిగితే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.

- కుమార్‌, ఆర్డీవో పాలకొండ

Updated Date - 2021-06-21T04:37:41+05:30 IST