Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా హత్యకు సీఐడీ చీఫ్‌ కుట్ర

  • జార్ఖండ్‌ నుంచి గూండాలను తెచ్చేందుకు ప్రయత్నం
  • సీఎం ప్రోద్బలంతోనే ఇదంతా.. ఈ కుట్రలో ‘సజ్జలా’ భాగస్వామే
  • ప్రధాని మోదీకి ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు


న్యూఢిల్లీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను హత్య చేయడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతో ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ కుట్ర పన్నారు. నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేయించడానికి జార్ఖండ్‌కు చెందిన గూండాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సీఐడీ చీఫ్‌తో పాటు సీఎం నుంచీ నాకు ప్రాణ హానీ ఉంది’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం ఈ అంశంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్‌ఐఏ) దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ప్రఽధాని మోదీకి లేఖ రాశారు. సునీల్‌ కుమార్‌ తనకు చెందిన అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ సంస్థ సభ్యులను రెచ్చగొట్టి తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుల దర్యాప్తునకు తాను పోలీస్‌ స్టేషన్లకు వచ్చినప్పుడు హత్య చేయించాలని భావిస్తున్నారని తనకు సమాచారం ఉందని తెలిపారు. 


‘‘నేను రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే అరెస్టు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కుట్ర పన్ని నాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. గత ఏడాది మే నెలలో నన్ను గుంటూరు జైలులో భౌతికంగా నిర్మూలించాలని వ్యూహం రచించి విఫలమయ్యారు. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భాగస్వామి. కాబట్టి ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), లేదా ఇతర సంస్థలతో దర్యాప్తు జరిపించండి’’ అని రఘురామ అభ్యర్థించారు.


ఇదే అంశంపై ఢిల్లీలో శుక్రవారం రఘురామ విలేకరులతో మాట్లాడారు. సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై తాను ఇచ్చిన సభాహక్కుల పిటిషన్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వ్యవహారంలో స్పందించినంత వేగంగా స్పీకర్‌ స్పందించాలని కోరారు.  పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కాగా, చిరంజీవిలాంటి గొప్ప వ్యక్తి రాజ్యసభ పదవి కోసం మా పార్టీ వైసీపీలో చేరతారని నేను అనుకోవడం లేదన్నారు. 


కేంద్రం నిధులతో జగనన్న పథకాలు కుదరవు: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పథకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా అమలు చేస్తోందంటూ తాను రాసిన లేఖకు సంబంధిత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారని రఘురామ చెప్పారు. ఇకపై పథకాల పేర్లు మార్చి అమలు చేస్తే ఆ పథకాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని స్మృతి చెప్పారని అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరని రఘురామరాజు స్పష్టం చేశారు.


Advertisement
Advertisement