తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తారల తళుకులు’!

ABN , First Publish Date - 2021-03-05T17:12:08+05:30 IST

శాసనసభకు ఏప్రిల్‌ 6న జరుగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయడానికి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తారల తళుకులు’!

చెన్నై : రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్‌ 6న జరుగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయడానికి ప్రముఖ సినీనటీనటులు సిద్ధమవుతున్నారు.అధికార అన్నాడీఎంకే తరఫున, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తరపున, జాతీయ పార్టీ బీజేపీ టికెట్టుపై పోటీ చేయడానికి పలువురు సినీ హీరోయిన్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తు న్నారు. మునుపెన్నడూలేని విధంగా ఈసారి శాసనసభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సినీ తారలు పోటీ చేయడా నికి సిద్ధపడుతుండడం విశేషం. అన్నాడీఎంకేకు చెందిన నటి వింధ్య కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై పోటీకి సై అంటున్నారు. ఇదేవిధంగా అన్నాడీఎంకే కు చెందిన హాస్యనటుడు, దర్శకుడు రవి మరియా ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు పెట్టుకున్నారు. కన్నియాకుమారి జిల్లా విలవంగోడు నియోజకవర్గంలో పోటీ చేయడానికి అనుమతి కోరుతున్నారు. అన్నాడీఎంకే ప్రచారకర్త, సినీ దర్శకుడు పీసీ అన్బళగన్‌ కన్నియాకుమారి, నాగర్‌కోవిల్‌లో పోటీ చేయడానికి దరఖాస్తులు సమర్పించారు. అన్నాడీఎంకే ప్రచార విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న నటి వింధ్య కూడా ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేశారు. నటుడు సింగముత్తు, సినీ సంభాషణల రచయిత లియాఖత్‌ అలీఖాన్‌ కూడా పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. 


డీఎంకేలో...

ప్రధాన ప్రతిపక్షం డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న సినీనటుడు, నిర్మాత, పార్టీ నేత స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. సినీ హాస్యనటుడు, సన్‌టీవీ బాలల కార్యక్రమాల వ్యాఖ్యాత ఇమాన్‌ అన్నాచ్చి కూడా ఎన్నికల్లో  పోటీకి దరఖాస్తు పెట్టుకున్నారు. సేలం జిల్లా ఎడప్పాడిలోని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై పోటీ చేయడానికి సై అంటున్నారు. ప్రముఖ సినీనటుడు, దర్శకుడు బోస్‌ వెంకట్‌ అరంతాంగి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. మరో నటుడు, డీఎంకే ప్రధాన కార్యాలయం కార్యదర్శి పూచ్చిమురుగన్‌ టి.నగర్‌ లేదా వేళచ్చేరిలో పోటీ చేయడానికి దరఖాస్తు దాఖలు చేశారు. సినీ నిర్మాత శింగారవేలన్‌ పట్టుకోటలో పోటీకి రెడీ అంటున్నారు. మనప్పారై నియోజకవర్గంలో పోటీకి నటుడు విమల్‌ సతీమణి అక్షయ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక వేళచ్చేరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సినీ నటుడు వాగై చంద్రశేఖర్‌ మళ్ళీ ఆ నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నిస్తున్నారు.


బీజేపీలో...

జాతీయ పార్టీలోనూ సినీతారలకు, సినీరంగ ప్రముఖులకు కొదువలేదు. బీజేపీ నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా ఉన్న ప్రముఖ నటీమణులు ఖుష్బూ, గౌతమి ఎన్నికల్లో పోటీకి అంగీకరించారు. పార్టీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గంలోనైనా పోటీకి రెడీ అంటున్నారు. పార్టీ ప్రచారకర్త, సినీ కొరియోగ్రాఫర్‌, నటి గాయత్రి రఘురామ్‌, శృంగార తార నమిత, విలన్‌ నటుడు రాధారవి, నటుడు ఆర్కే సురేష్‌, సినీ దర్శకుడు పేరరసు, సినీ నిర్మాత పీటీ సెల్వకుమార్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా వున్నారు.


మక్కల్‌ నీదిమయ్యంలో...

మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా అసెం బ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. చెన్నై నగర పరిధిలో ఆలందూ రు నియోజకవర్గం లేదా కోయబత్తూరు వెస్ట్‌ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్టీలోనూ పలువురు సినీరంగ ప్రముఖులు ఎన్నికల్లో పోటీకి దర ఖాస్తులు సమర్పించా రు. పార్టీ ఆవిర్భావం నుంచి కమల్‌హాసన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న తమిళ సినీ గేయరచయిత స్నేహన్‌ కూడా ఈ ఎన్నిక ల్లో పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇదేవిధంగా పార్టీ నిర్వహణలో కీలకపాత్రను పోషిస్తున్న అలనాటిమేటి నటి శ్రీప్రియ, ప్రముఖ సినీ నటుడు నాజర్‌ సతీమణి కమీలా నాజర్‌, నటుడు పళయ కరుప్పయ్య కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉ న్నారు. ఇక సినీ విలన్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తమిళ దేశియ పులిగళ్‌ పేరుతో పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయను న్నారు.అఖిల ఇండియ నాడాలుమ్‌ మక్కల్‌ కట్చి నాయకుడు, సినీ నటుడు కార్తీక్‌ కూడా బీజేపీ మద్దతుతో పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Updated Date - 2021-03-05T17:12:08+05:30 IST