Oct 22 2021 @ 08:25AM

Chennai: మా కుమారుడికి ప్రాణహాని

- టి.రాజేందర్‌ దంపతుల ఆరోపణ

- పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు 

`

అడయార్‌(Chennai): తమ కుమారుడు, హీరో శింబుకు ప్రాణహాని వుందని, ఇదే విషయంపై ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని నగర పోలీసు కమిషనర్‌కు ప్రముఖ నటుడు టి.రాజేందర్‌, ఆయన సతీమణి ఉషా రాజేందర్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వెల్లడించారు. తన కుమారిడిపై హత్యాబెదిరింపులకు పాల్పడిన నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌తో సహా మరికొందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్టు వెల్లడించారు. అలాగే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లేలా ఆయన ఇంటిముందు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించినట్టు రాజేందర్‌ వెల్లడించారు. కాగా, శింబు హీరోగా నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ ‘అన్బానవన్‌ - అసరవాదవన్‌ - అడంగాదవన్‌’ అనే పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. ఇందుకోసం శింబుకు కొంత మొత్తాన్ని కూడా చెల్లించారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌కు శింబు సక్రమంగా రాలేదని, అందువల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని, తాను ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలికి కూడా మైఖేల్‌ రాయప్పన్‌ గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైనే హీరో శింబు, మైఖేల్‌ రాయప్పన్‌ల మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో శింబు తల్లిదండ్రులు పోలీస్‌ కమిషనరును కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.