Abn logo
May 7 2021 @ 22:39PM

నల్లానల్లని మబ్బుల్లోకి...!

  •  సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌ కన్నుమూత
  •  స్వగ్రామం హిరమండలం మండలం తులగాం
  •  జిల్లాలో విషాదఛాయలు  
  •  దుఃఖ సాగరంలో సంగీత అభిమానులు

(శ్రీకాకుళం- ఆంధ్రజ్యోతి/ఎల్‌.ఎన్‌.పేట/హిరమండం/ఆమదాలవలస రూరల్‌)

‘ఏడాదిలో ఒక్కరోజుకే పరిమితమైతే ఎలా? ...మిగిలిన రోజులు నన్ను చూసుకునేదెవరు?... నా వద్దకు వచ్చెయ్‌...’ అంటూ ఆదిత్యుడే స్వయంగా ఏకాంత సేవకు రమ్మని  ఆహ్వానించాడో... గానగంధర్వుడు ఎస్పీ బాలు స్వర్గలోకంలో ఒంటరినైపోయానని వగచారో... సిక్కోలు ‘స్వరమాధురి’ని దేవలోకంలో వినిపించాలనుకున్నారో... ఉన్నట్టుండి ఓ సంగీత తార దివికేగిపోయింది. ఏదేశానికి పాట కచేరీకి వెళ్లినా... ఏ ప్రాంతాన్ని తన గానామృతంతో ఓలలాడించాలనుకున్నా... నేను ‘శ్రీకాకుళం వాడిని’ అని అక్కడ గర్వంగా చెప్పుకుంటూ... స్వరాల పూలు పూయించిన ఆ పాటమాలి ఇకలేరు. ఆయనే సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌. సంగీత అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి... ‘నల్లానల్లని మబ్బుల్లోకి’ వెళ్లిపోయారు.

....................................

‘ఒక వేణువు వినిపించెను’ అంటూ ఆ గొంతు తన్మయత్వం పొందినా... ‘దిక్కులు చూడకు రామయ్యా’ అని కథానాయిక ఆట పట్టిస్తే... ‘చెంతకు రావే ముద్దులగుమ్మా’ అని కథానాయకుడి మాటను తన పాటగా వినిపించినా... ‘నల్లానల్లని మబ్బుల్లోన లక్కో పిల్లా’ అంటూ సరదాలాడినా... ‘విఠలా...విఠలా..పాండురంగ విఠలా’ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయినా.. శ్రోతలూ ఆ భావాలను తమకు అన్వయించుకున్నారు. ఆ పాట తమ గొంతు నుంచి వచ్చినట్టే తెగ ఇదైపోయేవారు. అన్నిటికీ మించి ఆ స్వరం.. సిక్కోలు ఒడిలో పెరిగినదేనని తెలిసి మరింతగా మురిసిపోయేవారు. ఇన్నాళ్లూ ఏదో వేదిక మీద నుంచో... ఏ టీవీ చానెల్‌లోనో వినిపించే ఆ రాగం... మూగబోయిందని తెలిసి సిక్కోలు చిన్నబోయింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌ ఇకలేర నే వార్తను జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త విని... సంగీత అభిమానులు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు.


ఇదీ నేపథ్యం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా మంచి కీర్తిప్రతిష్ఠలు సాధించిన గేదెల ఆనంద్‌ (67) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. సినీ నేపథ్య గాయకునిగానే కాకుండా దేశవిదేశాల్లో అనేక వేదికలపై కచేరీల ద్వారా తన గాత్రాన్ని వినిపించారు. జి.ఆనంద్‌ స్వగ్రామం హిరమండలం మండలం తులగాం. ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర్‌నాయుడు, తల్లి అమ్మడమ్మ రైతు కుటుంబానికి చెందినవారు. తండ్రి గ్రామ మునసబుగా పనిచేశారు. వీరికి ఐదుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆనంద్‌ వీరికి రెండో సంతానం. ఆయన పీయూసీ వరకు చదువుకున్నారు. నేపథ్య గాయకుడిగా కాకముందు గార  సమితిలో కొన్నాళ్లపాటు గ్రామ విస్తరణాధికారిగా (వీడీఓ)గా పనిచేశారు. 


రంగస్థలంపై అడుగుపెట్టి...

ఉద్యోగం చేస్తూనే కళారంగంపై మక్కువతో అప్పట్లో కొంతమందితో కలిసి గ్రామంలో శ్రీనివాసా కళాసమితిని ఆనంద్‌ స్థాపించారు. ఈ సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా ‘కూలిపిల్ల’ అనే సాంఘిక నాటకంలో కథానాయకుడిగా నటించారు. అనంతరం అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. మరోవైపు  సంగీత కచేరీల్లో పాల్గొనేవారు.

మలుపుతిప్పిన పోటీ

 ఓసారి నంద్యాలలో జరిగిన పాటల పోటీల్లో పాల్గొన్న ఆనంద్‌... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పోటీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కొద్దికాలం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి... 1970లో మద్రాసు (చెన్నై) బయలుదేరారు.  అక్కడ కూడా ‘సుకుమార్‌ ఆర్కెస్ట్రా’ను నిర్వహించారు. తద్వారా సినీ ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. 1976లో ‘అమెరికా అమ్మాయి’ అనే చిత్రంలో తొలిసారిగా పాట పాడే అవకాశం అందుకున్నారు. ‘ఒక వేణువు వినిపించెను’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ‘పండంటి కాపురం, ప్రాణం ఖరీదు, ఆమె కథ, దానవీరశూరకర్ణ, చక్రధారి, మనవూరి పాండవులు వంటి ఎన్నో చిత్రాల్లో తన గాత్రంతో ఆనంద్‌ అలరించారు. అనేక అనువాద చిత్రాలు, టీవీ సీరియళ్లకు నేపథ్య గాయకుడిగా పాట సాయం చేశారు. సంగీత దర్శకుడిగానూ వ్యవహరించారు. ‘స్వరమాధురి’ అనే సంస్థను స్థాపించి దేశ విదేశాల్లో 6 వేలకు పైగా కచేరీలు చేశారు. తనకు జన్మనిచ్చిన సిక్కోలు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తన బృందంతో ఆర్కెస్ట్రాలు నిర్వహించేవారు. 


బంధువుల  దిగ్ర్భాంతి

 ఆనంద్‌కు భార్య, సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల కిందటే చెన్నై నుం చి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. ఆనంద్‌ తండ్రి, తాతలు సైతం పూర్వం పౌరాణిక నాటక రంగంలో పేరు పొందారు. ఆనందరావు స్వగ్రామం హిరమండలం మండలం తులగాం. ఈ గ్రామం ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి భూసేక రణలో భాగంగా ప్రభుత్వం మూడేళ్ల కిందట ఈ గ్రామాన్ని ఖాళీ చేయిం చింది. దీంతో ఇక్కడి గ్రామస్థులు, ఆనంద్‌ బంధువులు శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎల్‌.ఎన్‌.పేట మండలాలకు తరలివెళ్లి పోయారు. ఈ క్రమంలో ఆనంద్‌ సోదరులు  బాలరాజు, వీర్రాజులు శ్రీకాకు ళం మండలం రాగోలు సమీపంలో ఉన్న ఆర్టీసీ కాలనీలో స్థిరపడ్డారు. ఆనంద్‌ ఇక లేరన్న వార్త విని సోదరులు, కుటుంబ సభ్యులతో పాటు జిల్లాలోని ఆయన సమకాలికులు, తుల గాం గ్రామానికి చెందిన పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సినీరంగంపై మక్కువతో 1970వ దశకంలో గ్రామాన్ని విడిచి మద్రాసు వెళ్లిపోయారని ఆయన సమకాలికులు గేదెల రామకృష్ణ మాస్టర్‌, గేదెల జగన్మోహన్‌రావు, గేదెల ప్రశాంత్‌లు  తెలిపారు. సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా.. తమతో గర్వం లేకుండా వ్యవహరించేవారని.. ఆనంద్‌తో తమకు ఉన్న అనుబంఽధాన్ని గుర్తుచేసుకుం టూ  అశ్రునయనాలతో నివాళి అర్పించారు. తులగాం గ్రామానికి దేశవిదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆనంద్‌ మృతి తమకు తీరని లోటు అని పేర్కొన్నారు. 


 డిప్యూటీ సీఎం సంతాపం

జిల్లాకు చెందిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సంతాపం ప్రకటించారు. తన ప్రతిభతో సినీరంగంలో కీర్తి ప్రతిష్టలు సముపార్జించిన ఆనంద్‌ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 


ఆదిత్యుడి సేవలో.. 

గుజరాతీపేట : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఆనంద్‌.. ఆదిత్యుడి సేవలోనూ తరించేవారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి పుణ్యక్షేత్రంలో ఏటా నిర్వహించే రథసప్తమి వేడుకలకు హాజరయ్యేవారు. మూడున్నర దశాబ్దాలుగా రథసప్తమి నాడు సంగీత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. పాటలతో అలరించిన ఆ మహానుభావుడు ఇక లేడని తెలిసి.. విషాదంలో మునిగిపోయామని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఏటా రథసప్తమి వేడుకల సమయంలో  ఏకాంతసేవ పేరుతో జిల్లాకు చెందిన బండారు చిట్టిబాబుతో కలిసి ఆనంద్‌ సంగీత ప్రదర్శనలను నిర్వహించి ఆదిత్యుడి గీతాలను ఆలపించేవారని చెప్పారు. మద్రాసుకు మకాం మార్చినప్పటి నుంచి రెండేళ్లకొకసారి ఇక్కడకు వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. మూడేళ్ల కిందట ఆదిత్యుడిని దర్శించుకుని.. సంగీత ప్రదర్శన ఇచ్చారని తెలిపారు.  కరోనా నిబంధనల కారణంగా రెండేళ్లుగా రథసప్తమి వేడుకల్లో ఆనంద్‌ సంగీత ప్రదర్శనలు నిర్వహించలేకపోయామని ఆయన తెలిపారు. 

Advertisement