సినిమా.. చూపిస్తారా?

ABN , First Publish Date - 2020-10-04T07:48:30+05:30 IST

ఈ నెల 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రకటన సినీ రంగంలో జోష్‌ను నింపింది. అయితే అన్ని థియేటర్లను తెరుస్తారా? తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? థియేటర్లు తెరిచినా ప్రదర్శించడానికి అన్ని సినిమాలున్నాయా? చిన్న సినిమాలు ప్రేక్షకులను రప్పిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు!!...

సినిమా.. చూపిస్తారా?

  • బొమ్మ పడినా ప్రేక్షకులు థియేటర్‌ దాకా వస్తారా? రారా?
  • బయ్యర్లు, థియేటర్ల యజమానుల ఆందోళన
  • తెరవడానికి మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల
  • యాజమాన్యాలు సిద్ధం.. లీజుదారుల వెనకడుగు!
  • ప్రేక్షకులు వచ్చినా ప్రదర్శించడానికి సినిమాలేవి?
  • ఆగిపోయిన షూటింగులు.. ఇప్పుడిప్పుడే మొదలు
  • పెద్ద హీరోల సినిమాలు జనవరిలోనే వచ్చే చాన్స్‌
  • అప్పుడు తెరిస్తే చాలని పరిశ్రమలో కొందరి భావన
  • ఓటీటీల్లోని సినిమాల్నే హాళ్లలో ప్రదర్శించే యోచన


ఈ నెల 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రకటన సినీ రంగంలో జోష్‌ను నింపింది. అయితే అన్ని థియేటర్లను తెరుస్తారా? తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? థియేటర్లు తెరిచినా ప్రదర్శించడానికి అన్ని సినిమాలున్నాయా? చిన్న సినిమాలు ప్రేక్షకులను రప్పిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు!!



భారత దేశంలో అతి ఎక్కువ చిత్రాలు నిర్మించేది తెలుగు చిత్ర పరిశ్రమే. దానిపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల మంది.. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. కరోనా దెబ్బకు మార్చి చివరి వారం నుంచి షూటింగులు ఆగిపోవడంతో టాలీవుడ్‌ అతలాకుతలమైంది! లైట్‌బాయ్స్‌, జూనియర్‌ ఆర్టిస్టులు.. ఇలా ఏరోజుకారోజు వచ్చే కూలీతో జీవించే చాలామంది జీవితాలు చితికిపోయాయి. బడా నిర్మాతల సంగతి పక్కన పెడితే... భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి సినిమాలు తీసిని ఒక మోస్తరు నిర్మాతలు సైతం వడ్డీల భారాన్ని మోయలేక, సినిమాలు పూర్తికాక లబోదిబోమంటున్నారు.


థియేటర్లు మూతపడ్డంతో.. వాటిపై ఆధారపడి జీవించే వాహన స్టాండ్లవారు, సెక్యూరిటీ గార్డులు, కౌంటర్‌ సిబ్బంది, తినుబండారాలు అమ్మేవారు.. కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు. వారందరికీ ఊరట కలిగించేలా.. అన్‌లాక్‌ 5.0లో భాగంగా అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సైతం థియేటర్లు నడుపుకోవడానికి మల్టీప్లెక్స్‌ యజమానులు గతంలో సిద్ధమయ్యారు. అలాంటిది ప్రభుత్వం 50ు సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతిచ్చింది. అయితే.. ఓటీటీ, ఏటీటీ యుగంలో జనాలు థియేటర్లకు వస్తారా? అనేదే వెయ్యి రూకల ప్రశ్న.


వ్యవస్థ ఇదీ..

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1600 థియేటర్లు ఉంటాయి. వీటిలో 1100 సింగిల్‌ స్ర్కీన్‌లు.. 500 మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు ఉం టాయి. 1100 సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో 60ు మేర లీజ్‌ వ్య వస్థ ఉంది. అంటే యజమానులు తమ థియేటర్లను లీజుకు ఇస్తారు. మిగిలిన థియేటర్లను యజమానులే నడుపుకుంటా రు. కొవిడ్‌ వల్ల థియేటర్లన్నీ మూతపడినా నిర్వహణ వ్యయం తప్పదు. 2 రోజులకోసారి సీట్లను, వారానికి ఒకసారి థియేటర్‌ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు థియేటర్లన్నీ డిజిటల్‌ అయిపోయాయి. దీంతో 2 రోజులకు ఒకసారైనా వాటిని రన్‌ చేయకపోతే మొత్తానికే మోసం వస్తుంది. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని సింగిల్‌థియేటర్‌ యజమానులు, మల్టీప్లెక్స్‌లవారు స్వాగతిస్తున్నారు. 25ు మంది వచ్చినా నిర్వహణ వ్యయం కలిసివస్తుందని భావిస్తున్నారు. థియేటర్లు తెరిస్తే ప్రజలు తప్పకుండా వస్తారని కొందరు సినీ ప్రముఖులు కూడా భావిస్తున్నారు. ‘‘ఇంట్లో టీవీలో కన్నా థియేటర్‌లో చూస్తే భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఽథియేటర్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. థియేటర్లు తెరుచుకుంటే పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం మాకుంది’’ అని నిర్మాతల మం డలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్‌ అన్నారు. లీజుదారులు, పరిశ్రమకు చెందిన కొందరు కీలక వ్యక్తులు మాత్రం జనవరిలో పెద్ద హీరోల సినిమాలు వచ్చేదాకా థియేటర్లు తెరిచేందుకు సుముఖంగా లేరనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 


బొమ్మలున్నాయా?

థియేటర్లు తెరవటం వరకూ సరే. మరి వాటిలో ప్రదర్శించటానికి సినిమాలున్నాయా? అనేది మరో పెద్ద ప్రశ్న. కొవిడ్‌ వల్ల చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, వెంకటేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌వంటి పెద్ద హీరోల షూటిం గ్స్‌ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే మొదలైన ఆ షూటింగ్స్‌ పూర్తయి, విడుదల కావడానికి నాలుగైదు నెలలు పడుతుంది. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి తమ సినిమాలు విడుదల చేయాలని చాలా మంది నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నా రు. ఈలోపు ఆడించడానికి చిన్న సినిమాలే ఉన్నాయని సమాచారం. నైజాం, సీడెడ్‌లలో దసరా, దీపావళి పండుగలు ఘనం గా జరుగుతాయి. ఈ సమయంలో థియేటర్లలో సినిమాలు చూసేవారు కూడా ఎక్కువే. అందువల్ల దసరా ముందు థియేటర్లను తెరిస్తే తమకు కొంత మేలు జరుగుతుందనేది థియేటర్‌ యజమానుల అభిప్రాయం. మరి చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్ల దాకా తీసుకొస్తాయా? లేదా అనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్న. ఒకసారి థియేటర్లు తెరిస్తే అనుమానాలు నివృత్తి అవుతాయని ప్రముఖ ఎగ్జిబిటర్‌ విజేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, ఇంగ్లిష్‌, హిందీ సినిమాల ప్రదర్శనకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. 


ఓటీటీ ట్విస్ట్‌..

కొవిడ్‌ భయానికి కొందరు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేశారు. మరికొందరు విడుదలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఓటీటీలలో విడుదలైన సినిమాలను థియేటర్లలోనూ ప్రదర్శించే అవకాశముందని కొందరు ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఓటీటీల కోసమే తీసిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం లేదు. థియేటర్లలోనూ విడుదల చేసుకోవచ్చు అనే క్లాజు అగ్రిమెంట్‌లో ఉంటే ఆ సినిమా లు రిలీజ్‌ చేసుకోవచ్చని వారన్నారు. మరి వాటిని చూడ్డానికి థియేటర్లకు వస్తారా అంటే.. ‘ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా ఏ సెంటర్లలోనే ఉంటారు. బి, సి సెంటర్ల ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూసే అవకాశం తక్కువ. కాబట్టి బి, సి సెంటర్లలో ఆ సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్లు బాగానే వస్తాయి’ అని ఒక ఎగ్జిబిటర్‌ వివరించారు. థియేటర్లతోపాటే ఓటీటీలో విడుదల చేసే అంశంపై చర్చలు ఫలించి.. అలా రిలీజ్‌ చేస్తే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.


తెరవకుండా లీజుదారుల లాబీయింగ్‌

థియేటర్‌లోనే సినిమాలు చూడాలని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు ‘థియేటర్‌ లీజుదారులు’ ఈనెల 15న కూడా ఓపెన్‌కాకుండా లాబీయింగ్‌ చేస్తున్నారు. కార్మికుల పొట్ట కొట్టడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం. వచ్చే 4 నెలలు గడ్డు కాలమే. - నట్టి కుమార్‌, నిర్మాత


సంతోషమే

థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వడం సంతోషకరమే. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వెంటనే అనుమతి ఇవ్వాలి. థియేటర్ల పరంగా ఉన్న సమస్యల గురించి అందరూ కలసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

- సునీల్‌,  నిర్మాత, ఎగ్జిబిటర్


మాస్కులు అక్కర్లేదు!

సినిమాలు చూసే సమయంలో మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాలులో ప్రవేశించే సమయం లో.. బయటకు వెళ్లే సమయంలో, లాబీల్లో ధరిస్తే సరిపోతుంది. థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాలను కూడా యూవీ కేబినెట్‌లలో శుద్ధి చేసి విక్రయిస్తాం.

- గౌతం దత్తా, సీఈవో, పీవీఆర్‌ సినిమా 


సినీ రంగం కోలుకోవాలంటే..

ప్రేక్షకుల ఆరోగ్యం ముఖ్యం. వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. కొవిడ్‌ వల్ల సినీ రంగం చాలా కోల్పోయింది. దీని నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలంటే థియేటర్లు తిరిగి తెరవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి.

- మల్టీఫ్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా


-స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-10-04T07:48:30+05:30 IST