బొమ్మ పడుద్ది!

ABN , First Publish Date - 2021-07-30T05:00:48+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడిన సినిమా థియేటర్లు ఈ నెల 30న (శుక్రవారం) తెరుచుకుంటున్నాయి. థియేటర్ల యజమానులు ఈ దిశగా సన్నాహాలు పూర్తి చేశారు. ఎప్పటిలా నాలుగు షోల ప్రదర్శన లేనట్టే.. మూడు షోలకే అనుమతి ఉంది. సాలూరులో రెండు, విజయనగరంలో ఎన్‌సీఎస్‌ ఐనాక్స్‌, ఆదిత్య, హిమగిరి, సప్తగిరి కాంప్లెక్స్‌ థియేటర్స్‌ తెరుచుకోనున్నాయి.

బొమ్మ పడుద్ది!

నేటి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు

సాలూరు రూరల్‌/ విజయనగరం రింగురోడ్డు, జూలై 29: కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడిన సినిమా థియేటర్లు ఈ నెల 30న (శుక్రవారం) తెరుచుకుంటున్నాయి. థియేటర్ల యజమానులు ఈ దిశగా సన్నాహాలు పూర్తి చేశారు. ఎప్పటిలా నాలుగు షోల ప్రదర్శన లేనట్టే.. మూడు షోలకే అనుమతి ఉంది. సాలూరులో రెండు, విజయనగరంలో ఎన్‌సీఎస్‌ ఐనాక్స్‌, ఆదిత్య, హిమగిరి, సప్తగిరి కాంప్లెక్స్‌ థియేటర్స్‌ తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తి చేశారు. పోస్టర్లు సిద్ధం చేశారు. కరోనా వల్ల నెలల తరబడి సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయి. తొలివేవ్‌లో ఎనిమిది నెలలు మూతపడగా... వైరస్‌ నెమ్మదించిన తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా కొద్ది నెలలకే మళ్లీ రెండో వేవ్‌ రావడంతో మే ఐదు నుంచి మళ్లీ ఆపేశారు. జిల్లాలో 28 థియేటర్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించిన అనంతరం కర్ఫ్యూ సడలింపుల్లో భాగంగా 50 శాతం సిటింగ్‌ సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరవవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతిచ్చి నెల రోజులు కావస్తున్నా యజమానులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కరోనా వల్ల వారు ఇప్పటికే నష్టపోయారు. థియేటర్లు నడవకపోయినా కరెంట్‌ చార్జీలు, పన్నులు చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, ప్రభుత్వం టిక్కెట్‌ ధరలపై విధించిన నియంత్రణ తదితర కారణాలతో యజమానులు వెనుకంజ వేశారు. ప్రస్తుతం థియేటర్లు తెరిచినా ఏ విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందోనని సందిగ్ధంతోనే యాజమానులు ఉన్నారు. ఎగ్జిబిటర్లంతా కొద్దిరోజుల కిందట విజయనగరంలో సమావేశం నిర్వహించి తమ సమస్యలపై జేసీకి వినతిపత్రమిచ్చారు. జిల్లాలో వచ్చే 8 నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. 

యాజమాన్యాలను ఆదుకోవాలి 

సినిమా థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు గురువారం అసోసియేషన్‌ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు.  విద్యుత్‌ బిల్లులు, సిబ్బందికి వేతనం ఇవ్వడం కష్టంగా మారిందన్నారు. 2020 ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ రాయితీలు ఇచ్చారని, ఆ ఏడాది జూలై, ఆగస్టు నెలలతో పాటు 2021 మే, జూన్‌, జూలై నెలలకూ అవే రాయితీలు ఇవ్వాలని కోరారు. 


Updated Date - 2021-07-30T05:00:48+05:30 IST