Abn logo
Mar 31 2020 @ 03:43AM

చిరస్మరణీయుడు దుగ్గిరాల పూర్ణయ్య

ప్రత్యేకమైన మాడ్యులేషన్‌తో దుగ్గిరాల పూర్ణయ్య మూడు దశాబ్దాలపాటు చదివిన వార్తలు విలక్షణమైనవి. ఆ తరం రేడియో న్యూస్ రీడర్లకు గ్లామర్ ఉండేది. ఇదే విషయం ఆయనతో అంటే, ‘ఒక చిన్న యంత్రం నుంచి మానవ కంఠం వినబడటమే ఆకర్షణ’ అంటూ ఆ విషయాన్ని దాటవేసేవారు. గ్రామీణ జీవితం, వ్యవసాయం, రైతులు, వారిభాష, సహజత్వం పూర్ణయ్యకు ఇష్టం. ఆయన భాష, అనువాదం, అధ్యయనం కూడా అలానే ఉండేవి.నివాళి

దుగ్గిరాల పూర్ణయ్య (1936 – 2020)

‘మీరందరూ ఢిల్లీలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉన్నారు కదా. మరి తెలుగు వారి భాషలో వస్తున్న మార్పులు మీరు ఎలా గమనిస్తారు. మీ అనువాదాన్ని ఎలా సజీవంగా మలుస్తారు’ అని మూడు దశాబ్దాల క్రితం నేను ఆయనను అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది. అప్పటికి ప్రాంతీయ భాషలో లెక్కకు మించిన ఛానళ్ళు గానీ, చౌక ఇంటర్‌నెట్ గానీ, ఢిల్లీలో తెలుగు పత్రికల ప్రింటింగ్ గానీ, ఫోన్లు గానీ ఇప్పటిలా వుండేవి కావు. నా ప్రశ్నకు దుగ్గిరాల పూర్ణయ్య జవాబు చెప్పలేదు గానీ, కళ్ళతో అభినందించారు. పలుచటి శరీర ఆకృతి; తెల్లని షర్టు, ఇస్త్రీ లేకుండా చేతుల వద్ద మడిచి, గొంతు దగ్గర బొత్తాం వేసుకుని, కొంచెం పొడుగ్గా పెరిగిన జుట్టుతో ఢిల్లీ ఆకాశవాణి బ్రాడ్‌కాస్టింగ్ హౌస్‌లో, న్యూస్ యూనిట్ తెలుగు విభాగంలో కుర్చీలో కూర్చుని, బల్లమీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా గానీ; బ్రాడ్‌కాస్టింగ్ హౌస్ ప్రాంగణంలో నడుస్తూ, చేతులు వెనక్కి పెట్టుకుని అంతర్ముఖంగా ఆలోచిస్తూ సాగే భంగిమలో గానీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నారు. 2020 మార్చి 29 ఆదివారం మధ్యాహ్న సమయంలో కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వుండే తన సొంతవూరు అంగలూరులో 83 సం. 11 నెలల పైబడిన వయసులో స్వల్ప అస్వస్థతతో ఆయన కన్నుమూశారు.


ప్రత్యేకమైన మాడ్యులేషన్‌తో దుగ్గిరాల పూర్ణయ్య మూడు దశాబ్దాలపాటు చదివిన వార్తలు విలక్షణమైనవి. ఎంతోమంది వారి కంఠాన్ని అనుకరిస్తూ మిమిక్రీ చేసేవారు. ఆ తరం రేడియో న్యూస్ రీడర్లకు గ్లామర్ ఉండేది. ఇదే విషయం ఆయనతో అంటే, ‘ఒక చిన్న యంత్రం నుంచి మానవ కంఠం వినపడటమే ఆకర్షణ’ అంటూ ఆ విషయాన్ని దాటవేసేవారు. 1990లో నేను ఆకాశవాణి బాధ్యతల మీద గోవా కేంద్రం నుంచి ఢిల్లీ డైరెక్టరేట్‌లో కొన్ని రోజులుగా కొన్ని విడతలలో పనిచేశాను. అప్పటికి తెలుగు ప్రాంతం వదలి రెండేళ్ళయ్యింది కనుక తెలుగు అన్నా, తెలుగు వారన్నా కొంత వ్యామోహం వుండేది. అలాంటి సమయంలో ఢిల్లీ ఆకాశవాణి భవనంలో ఉద్యోగం చేస్తూ - క్యాంటీనుకు వెళ్తుండగా తెలుగు న్యూస్ యూనిట్ అనే బోర్డు కుడివైపున కనబడింది. దాంతో టీ విషయాన్ని మరచిపోయి లోపలికి వెళ్ళి పూర్ణయ్యగారిని పలకరించాను. ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. త్రిపురనేని రామస్వామిది తమ అంగలూరు అనే గౌరవం కూడా తమ స్వస్థలం మీద ఆయనకుండేదని మాటల మధ్య తెలిసింది. తొలి పరిచయం నుంచే వారు నన్ను పితృవాత్సల్యంతో చూసేవారు, చాలా విషయాలు వివరించేవారు. వారితో, వారి కుటుంబంతో నాకు మూడు దశాబ్దాల పరిచయం, స్నేహం.


1936 ఏప్రిల్ 15న వెంకట కృష్ణారావు, అన్నపూర్ణమ్మ దంపతులకు గుడివాడ దగ్గర అంగలూరులో దుగ్గిరాల పూర్ణయ్య జన్మించారు. ఆయన చదువు తొలుత స్వగ్రామంలో, తర్వాత పి.యు.సి. గుడ్లవల్లేరులోనూ; పిమ్మట బి.ఏ. డిగ్రీ గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాలలో చదివారు. భీమవరంలో ఎం.ఎ. ఇంగ్లీషు, పిమ్మట భాగల్పూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. ఉద్యోగంలో స్థిరపడ్డాక పూనా విశ్వవిద్యాలయం నుంచి నుంచి ఎల్‌ఎల్‌బి చేశారు. ఖమ్మంలో కొంతకాలం టీచరుగా పని చేసి, పిమ్మట 1961 ప్రాంతంలో ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. తొలుత జనసంఘ్ పార్టీ వారి పత్రిక ‘ఆర్గనైజర్’లో సబ్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో ప్రముఖ రాజకీయ నాయకుడు లాల్ క్రిష్ణ ఆడ్వాణీ అదే పత్రికలో సబ్ ఎడిటర్. కనుక వారు సహ ఉద్యోగులు. 1964లో ఢిల్లీలో ఆకాశవాణి న్యూస్ యూనిట్‌లో తెలుగు న్యూస్ రీడర్‌గా చేరిన అన్నపూర్ణయ్య 58 సం. వయసులో 1994లో ఢిల్లీలోనే పదవీ విరమణ చేశారు. 1967లో తూర్పుగోదావరి జిల్లా పామర్రుకు చెందిన అనంతలక్ష్మితో వివాహమైంది. కృష్ణారావు, సత్యనారాయణ మూర్తి, ప్రసాద్ వీరి కుమారులు. రెండో కుమారుడు హైదరాబాదులో స్థిరపడగా, మిగతా ఇద్దరూ విజయవాడలో ఉంటున్నారు. 


వార్తల అనువాదంలో, పఠనంలో పన్యాల రంగనాథరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యంగార్లు అంటే అభిమానం, గౌరవం అని చెప్పే దుగ్గిరాల పూర్ణయ్య మితభాషి, నిగర్వి! సూటిగా మాట్లాడే విధానం, లోతుగా అధ్యయనం చేయడం, కొంతవరకు ముభావంగా ఉండటం, కలివిడిగా దూసుకుపోయే తత్వం అసలు లేకపోవడం ఆయన విధానం. కాలక్షేపపు మాటలు, ఆర్భాటం, సభలలో పాల్గోవడం వంటివి అసలు పడదు. అందువల్ల మామూలుగా సాగే మెజారిటీవారికి ఇది కొరుకుడు పడని వ్యవహారం. సరిగా మాట్లాడడు, అహం అని కూడా కొందరు భావించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో కొందరి పద్ధతులు ఆయనకు నచ్చేవి కావు. అలాంటి వారిని కలవడం కూడా ఆయనకు ఇష్టం ఉండదు. కనుకనే ఆయన పెన్షన్ కాగితాలు ఆయనకు ఆలస్యంగా అందాయని అంటారు. నిజానికి న్యూఢిల్లీలో పార్లమెంటు వీధిలో ఉద్యోగం చేసే వ్యక్తి, అధిక చెలామణిలో వుండేకాలంలో ఆకాశవాణిలో నిత్యం పేరు, గొంతు వినబడే సౌలభ్యం ఉన్నవారు అక్కడ చేసే హడావుడి చాలా ఉంటుంది. ఆయనకు ఢిల్లీలో స్థిరపడాలనే ఆలోచన కూడా లేదు. కొన్న యిల్లును చౌకగా అమ్మివేశారు. అది ఇపుడు కోట్ల విలువ చేసేది. సొంత ఊరు అంటే అభిమానం. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వచ్చేశారు. ఏడెనిమిది సంవత్సరాలు హైదరాబాదులో ఉన్నారు. ఆ సమయంలో స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం దెబ్బతినింది. పన్నెండేళ్ళ క్రితం అంగలూరు వచ్చేశారు. 


అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం అంతంతమాత్రం. పెద్దగా తినరు. ఢిల్లీలో కూడా ఉద్యోగం అంటూ ఆఫీసుకొస్తే ఏడెనిమిది గంటలుండిపోయేవారు ఏదో చదువుకుంటూ, ఆకాశవాణి క్యాంటీన్‌లో మాకు మైసూర్ పాక్ వడ యిప్పించి తను టీ, బ్రెడ్ తినేవారు. స్వభావంలోనే కొంత బద్ధకం, వాయిదా వేసే లక్షణం ఉందేమో! ఆరోగ్యం బాగా దెబ్బతినింది. నాలుగేళ్ళ క్రితం మద్రాసు నుంచి విజయవాడ వచ్చినపుడు అంగలూరు వెళ్ళి వారిని కలిశాను. అంతకుముందు ఇంకోసారి వారితో ఒకరోజు గడిపాను. గత మూడు నెలలుగా ఆరోగ్యం బాగా చెడిపోయింది. మంచం మీద నుంచి లేవలేకపోయేవారు. భోజనం కూడా తినడం బాగా తగ్గిపోయింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక రెండు స్పూన్లు భోజనం చేసి పిమ్మట కనుమూశారు. ఇంకో 17 రోజులుండి ఉంటే 84 సం. పూర్తి అయ్యేవి.


గ్రామీణ జీవితం, వ్యవసాయం, రైతులు, వారిభాష, సహజత్వం పూర్ణయ్యకు ఇష్టం. ఆయన భాష, అనువాదం, అధ్యయనం కూడా అలానే ఉండేవి. వేమరాజు భానుమూర్తి, వాడ్రేవు పతంజలి వంటివారు పూర్ణయ్యగారి అనువాదాన్ని ఇష్టపడి గౌరవించేవారని పూర్ణయ్యను బాగా ఎరిగిన గణేశ్వరరావు చెబుతారు. మాటకొంత పెళుసు అయినా, మనసులో మర్మం లేదని ఆయనతో మూడు దశాబ్దాలు పనిచేసిన కందుకూరి సూర్యనారాయణ అంటారు. హోమ్ సెక్రెటరీగా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె. పద్మనాభయ్య ఆయన బాల్య మిత్రులు. ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారో అలాగే కనుమూశారు. ఇలా శ్రద్ధాంజలి వ్యాసం రాయడం కూడా వారికి ఇష్టం ఉండదు. 

డా. నాగసూరి వేణుగోపాల్

Advertisement
Advertisement
Advertisement