ఐటీ హబ్‌లుగా పట్టణాలు!

ABN , First Publish Date - 2021-06-11T09:59:40+05:30 IST

ఐటీ హబ్‌లుగా పట్టణాలు!

ఐటీ హబ్‌లుగా పట్టణాలు!

త్వరలో అందుబాటులోకి సిద్దిపేట, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్లు

కొత్తగా నల్లగొండ, రామగుండం, వనపర్తిలో కూడా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఐటీ రంగం అనగానే గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌. కానీ, ఇప్పుడు ఇతర పట్టణాలూ క్రమంగా ఐటీకి వేదికలుగా మారుతున్నాయి.  వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో ఐటీ టవర్లు అందుబాటులోకి రాగా.. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటల్లో ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్నాయి. నల్లగొండ, రామగుండం, వనపర్తి జిల్లాల్లోనూ టవర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వీటిలో 25 వేల మంది ఐటీ వృత్తి నిపుణులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. సిద్దిపేటలో 1.26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ డిసెంబరులో శంకుస్థాపన చేశారు.


రూ.45 కోట్ల వ్యయం తో ఈ భవనం నిర్మిస్తుండగా, 2 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. నిజామాబాద్‌ ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయగా.. రూ.25కోట్లు వెచ్చిస్తున్నారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనవరి నాటికి ఇది అందుబాటులోకి రానుందని అంచనా. ఖమ్మంలో తొలుత 430 సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించిన ఐటీ టవర్‌లో 19 కంపెనీలు ఉండగా, మంత్రి పువ్వాడ చొరవతో రెండో దశ టవర్‌ నిర్మాణానికి ఇటీవల కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇది 31 కంపెనీలకు వేదిక అయ్యే అవకాశముంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి-ఎదిర శివారులో ఐటీ మల్టీపర్పస్‌ కారిడార్‌కు 475 ఎకరాలు కేటాయించారు. 18 కంపెనీలు పని చేయడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని ఆసక్తి చూపాయని, 6 నెలల్లో ఇది ప్రారంభమవుతుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండలోని ఐటీ టవర్‌లో టెక్‌ మహీంద్ర, కాకతీయ ఐటీ సొల్యూషన్స్‌, వెంటోయ్‌ సంస్థలు పని చేస్తున్నాయి.


సెయంట్‌ సొంత భవనాన్ని నిర్మించుకుంది. 200 మందికి ఉద్యోగాలిచ్చిన ఈ కంపెనీ.. విస్తరణ బాటలో ఉంది. మరో రెండు ఐటీ కంపెనీలకు టీఎ్‌సఐఐసీ స్థలం కేటాయించింది. టెక్‌ మహీంద్ర 25వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు తీసుకుంది. 100 మంది పని చేస్తుండగా మరో 300 మందికి ఉపాధి లభించవచ్చని అంచనా. కరీంనగర్‌ ఐటీ టవర్‌ నిరుడు జూలైలో అందుబాటులోకి వచ్చింది. 15 కంపెనీలు అందులో పని చేయడానికి ముందుకు వచ్చాయి.


కొత్తగా మూడు జిల్లాల్లో.. నల్లగొండలో ఐటీ టవర్‌ 

ఏర్పాటుకు 13 ఎకరాలు గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే నివేదిక పంపించారు. రామగుండం ఐటీ టవర్‌ ఏర్పాటుకు  స్థలం సమస్య లేదు. అక్కడ నుంచి పని చేయడానికి ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. వనపర్తిలోనూ టవర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

జయేశ్‌రంజన్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి 


25వేల మందికి ఉపాధి

రెండు, మూడో శ్రేణి పట్టణాల్లోని ఐటీ హబ్‌ల ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది ఆశయం. వరంగల్‌లో 1400 మందికి, కరీంనగర్‌లో 556 మందికి, ఖమ్మంలో రెండు దశలు కలిపి 1000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోంది. నల్లగొండలో 1,350 సీటింగ్‌ సామర్థ్యంతో ఐటీ టవర్‌ ఏర్పాటు కాబోతుంది. 

విజయ్‌ రంగినేని, సీఈవో, ఐటీ హబ్స్‌

Updated Date - 2021-06-11T09:59:40+05:30 IST