Abn logo
Jun 2 2020 @ 00:48AM

పౌరసత్వ పోరాటకారులను విడుదల చేయాలి

మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిరక్షణ కోసం, ముఖ్యంగా స్త్రీలు, మైనారిటీ, దళిత వర్గాల హక్కుల కోసం, శ్రేయస్సు కోసం క్షేత్ర స్థాయిలో పని చేసే పలు సంస్థల తరఫున ఈ ప్రకటన చేస్తున్నాము. ఫిబ్రవరి నించి ఢిల్లీ పోలీస్, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతున్న అరెస్ట్‌లని తీవ్రంగా ఖండిస్తున్నాం. యువతులపై, విద్యార్థినులపై జరుగుతున్న దాడులు మమల్ని కలిచి వేశాయి. వీరు తమ ప్రజాస్వామిక హక్కుగా, బాధ్యతగా ప్రభు త్వం ప్రవేశపెడుతున్న అన్యాయమైన చట్టాలని, విధానాల్ని వ్యతిరేకిస్తూ అనేక ర్యాలీల్లో, సభల్లో పాల్గొన్నారు. కొవిడ్‌–19 కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులని అదనుగా తీసుకుని, ప్రభుత్వం తనపై విమర్శలు చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది.


సీఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో ముందున్న పింజరా తోడ్ అనే విద్యార్థి సంఘానికి చెందిన దేవాంగన కలిత, నతాషా నర్వాల్ తాజాగా అరెస్టయ్యారు. మాండొలి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈ విద్యార్థినులకు బెయిల్ ఇవ్వాలని ఆదేశించినా, మరొక FIRలో ఇంకా తీవ్రమైన నేరారోపణలు చేసి, వారిని జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఊపా చట్టంకింద చాలామంది ఆక్టివిస్టులని, విద్యార్థులని, ముఖ్యంగా ముస్లింలని అరెస్ట్‌‍‍ చేస్తోంది మోదీ–షా ప్రభుత్వం. గుల్ ఫీషా ఫాతిమా, సాఫుర జర్గర్, మీరన్ హైదర్, అసిఫ్ ఇక్బాల్ తాన్హ, షార్జిల్ ఇమామ్ అందరు కూడా ఈ ఉపా బాధితులే. గర్భవతి అయిన సాఫురాని జైలులో ఉంచడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని, విడుదల చేయాలన్న అభ్యర్థనలను ప్రభుత్వం వినడంలేదు.


ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన ఇష్రత్ జహాన్, ఖాలిద్ సైఫీ ఫిబ్రవరి నించి జైల్లో మగ్గుతున్నారు. సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్న వందలమందిపై అరెస్ట్ చేస్తున్నట్టు, చట్టానికి విరుద్ధంగా వారిని కస్టడి లో ఉంచుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన విద్యార్థులపై, ఆక్టివిస్టులపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలన్నీ ఉపసంహరించుకుని, తక్షణమే జైలునించి విడుదల చేయాలి. ఈశాన్య ఢిల్లీ‍లో జరిగిన హత్యాకాండపై నిష్పాక్షికమైన విచారణ జరపాలి. హత్యాకాండ బాధ్యులను ఇంకా రెచ్చగొట్టిన మతో న్మాద పోలీసులని ఉద్యోగం నించి తీసివేయాలి. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ చట్టాలని తక్షణం ఉపసంహరించాలి. 


హైదరాబాద్‌ ముస్లిం వుమెన్స్‌ ఫోరమ్‌, దళిత్‌ వుమెన్స్‌ కలెక్టివ్‌, దళిత్‌ బహుజన్‌ ఫ్రంట్‌, చైతన్య మహిళా సంఘం, అముమాత్‌ సొసైటీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌, సావిత్రీబాయ్‌ పూలే అధ్యయన వేదిక, కేరింగ్‌ సిటిజెన్స్‌ కలెక్టివ్‌, నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ తదితర సంఘాలు.

Advertisement
Advertisement