గడ్డితో ఎకో ఫ్రెండ్లీ ఇటుకలు.. సివిల్ ఇంజనీర్ అద్భుత సృష్టి

ABN , First Publish Date - 2021-10-15T22:42:40+05:30 IST

ఒక్క ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఓ సాధారణ వ్యక్తిని అనితరసాధ్యుడిని చేస్తుంది. ఉత్తరాఖండ్‌‌కు చెందిన తరుణ్ విషయంలో..

గడ్డితో ఎకో ఫ్రెండ్లీ ఇటుకలు.. సివిల్ ఇంజనీర్ అద్భుత సృష్టి

ఒక్క ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఓ సాధారణ వ్యక్తిని అనితరసాధ్యుడిని చేస్తుంది. ఉత్తరాఖండ్‌‌కు చెందిన తరుణ్ విషయంలో అదే జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్.. జీవితంలో ఏదో చేయాలని, ఎవరూ చేయలేనిది సాధించాలని అనుకునేవాడు. దాని కోసం రేయింబవళ్లు కష్టపడేవాడు. ‘ఇంజనీరింగ్ చదివి.. ఇదేం పనిరా.. ఉద్యోగం చేసుకోవచ్చుగా..!’ అని చుట్టుపక్కల వాళ్లు నిరాశపరుస్తున్నా.. తన పట్టుదల మాత్రం వదిలిపెట్టలేదు. ఆ పట్టుదలతోనే అనుకున్నది సాధించింది అందరి నోళ్లు మూయించాడు. నిర్మాణరంగంలో అత్యంత ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు.


ఉత్తరాఖండ్‌లోని రుడ్‌కీ ప్రాంతానికి చెందిన తరుణ్.. ఇప్పుడు ఓ సెన్సేషన్. కేవలం కొన్ని లక్షలతో అతడు ప్రారంభించిన ‘గ్రీన్‌జెమ్స్’ స్టార్ట్‌అప్ కంపెనీ ఇప్పుడు కోట్ల టర్నోవర్ చేస్తోంది. అలాగే దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఓ మెరుగైన ఉపాయాన్ని చూపించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్.. తన తండ్రి, సోదరుడితో కలిసి ఈ కంపెనీని ప్రారంభించాడు. ఇందులో ఎకో ఫ్రెండ్లీ ఇటుకలను తయారు చేస్తాడు. పంట కోసిన తరువాత మిగిలిన గడ్డి ఈ ఇటుకల తయారీలో ప్రధాన పదార్థం. థర్మల్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్‌, సిమెంట్‌లా పనిచేసే ఎకో ఫ్రెండ్లీ బైండర్‌ను కలిసి ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఇవి బట్టీలలో తయారయ్యే సాధారణ ఇటుకలతో పోల్చితే మరింత బలంగా ఉంటాయి. అలాగే వీటిని వినియోగించి నిర్మించే భవనాలు ఎండాకాలంలో అంత వేడిగా అనిపించవు. అలాగే చలికాలంలో అంత చలి లేకుండా ఉంటాయి. అంతేకాకుండా విపరీతమైన కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న దేశ రాజధాని నగరం ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఈ ఇటుకలు ఎంతగానో ఉపయోపడతాయి.


ఈ ఐడియా తనకు రావడం గురించి తరుణ్ ఇలా చెబుతున్నాడు. ‘నేను ఒకసారి ఢిల్లీలో కారులో వెళుతున్నా. ఎదురుగా మంచులా కమ్మేసిన కాలుష్యం వల్ల దాదాపు పెద్ద ప్రమాదానిగి గురయ్యేవాడిని. అప్పుడే అనిపించింది. ఈ కాలుష్యం తగ్గించడానికి ఏదైనా చేయాలని. అసలు ఈ కాలుష్యానికి కారణం ఏంటని ఆరా తీశా. పక్క రాష్ట్రాల్లో పంట వేసిన తర్వాత మిగిలిన గడ్డిని పొలాల్లోనే తగులబెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలిసింది. అలా పంటను తగులబెట్టడాన్ని నిరోధించడమే కాకుండా, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2020 డిసెంబరులో గ్రీన్‌జెమ్స్ కంపెనీని ప్రారంభించాను. మా నాన్న, అన్నయ్యల సాయం తీసుకున్నాను. ఎకరానికి రూ.3,500 చొప్పున చెల్లించి రైతుల నుంచి ఈ గడ్డిని కొనుగోలు చేస్తాం. అలా తెచ్చిన గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఉడకబెడతాం. దానిని ఫ్లై యాష్, ఎకో ఫ్రెండ్లీ బైండర్‌ను కలిపి ఇటుకలుగా మారుస్తాం. ఇలా తయారు చేసిన ఇటుకలను ‘ఎగ్రోక్రీట్’ అని పిలుస్తున్నాం. వీటికి ఇప్పుడు మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పటికే 20-25 మంది రైతులతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే సీజన్లో మరో 100 రైతులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మాకు ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పటికే రూ.3.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ పది నెల్లలో రూ.3 లక్షలకు పైగా లాభాలు కూడా వచ్చాయి. మీరట్, విశాఖపట్నంలలో బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేశాం. ఫ్రాంచైజీలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాం’ అని తరుణ్ చెప్పుకొచ్చాడు.


మేధస్సుకు పదును పెడితే మనం గొప్పవాళ్లు కావడమే కాదు.. ప్రపంచ గమనాన్నే మార్చే స్థాయికి ఎదగవచ్చని తరుణ్‌లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. హ్యాట్సాఫ్ తరుణ్.

Updated Date - 2021-10-15T22:42:40+05:30 IST