జార్ఖండ్ జడ్జి హత్యపై సీజేఐ జస్టిస్ రమణ స్పందన

ABN , First Publish Date - 2021-07-29T20:03:49+05:30 IST

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా, అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను

జార్ఖండ్ జడ్జి హత్యపై సీజేఐ జస్టిస్ రమణ స్పందన

న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా, అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగానే ఆటోతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సుప్రీంకోర్టులో ప్రస్తావించగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, ఈ కేసు గురించి తమకు తెలిసిందని, తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


బుధవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను గుర్తు తెలియని ఆటో ఢీకొట్టింది. ఆయన రక్తపు మడుగులో ఉండగా, ఓ వ్యక్తి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది గంటలపాటు ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఆయన కనిపించడం లేదని బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి, ఆటో ఢీకొనడంతో, ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి ఉత్తమ్ ఆనంద్ అని గుర్తించారు. 


సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఆటో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ఆ ఆటోను కొద్ది గంటల క్రితమే దొంగిలించి, ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైందని తెలిపారు. ఇదిలావుండగా, ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో చూసినవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 


నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జడ్జి ఉత్తమ్ ఆనంద్ విచారణ జరుపుతున్న కేసులపై దృష్టి పెట్టారు. ఇటీవలే ఆయన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుసుకున్నారు. ఆయన ధన్‌బాద్‌లో చాలా హత్య కేసులపై విచారణ జరుపుతున్నట్లు గుర్తించారు. 


ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ వద్ద ఈ కేసు గురించి ప్రస్తావించింది. తాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీని గురించి మాట్లాడానని జస్టిస్ రమణ చెప్పారు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టారని, ఈ కేసు గురించి తమకు తెలుసునని, తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


అంతకుముందు న్యాయవాది వికాస్ సింగ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ కేసు గురించి ప్రస్తావించారు. ఇది న్యాయ వ్యవస్థపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. ఈ కేసుపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని కోరారు. ఇటువంటి విషయాల్లో స్థానిక పోలీసులు సాధారణంగా కుమ్మక్కు అవుతారని, ఇది చాలా దిగ్భ్రాంతికరమని చెప్పారు. ఉదయం వాకింగ్ చేస్తున్న జడ్జిని వాహనంతో ఢీకొట్టారన్నారు. ఆయన గ్యాంగ్‌స్టర్ల బెయిల్ దరఖాస్తులను విచారిస్తున్నారన్నారు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడి అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, ఈ విషయాన్ని తాను సీజేఐకి తెలియజేస్తానని చెప్పారు. 


జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణం గురించి వేరొక కోర్టు గదిలో కూడా అనధికారికంగా చర్చించారు. ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారని జస్టిస్ ఎంఆర్ షా అడిగారు. దీనిపై వికాస్ సింగ్ స్పందిస్తూ, ఈ ఫుటేజ్ సాధారణ సీసీటీవీ ఫుటేజ్ కాదని, దీనిని ఉద్దేశపూర్వకంగానే రికార్డు చేసి, సర్క్యులేట్ చేశారని చెప్పారు. ఈ వీడియోను చిత్రీకరిస్తున్నపుడు వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వినిపిస్తోందని చెప్పారు. 


Updated Date - 2021-07-29T20:03:49+05:30 IST