పెగాసస్‌పై మధ్యంతర ఉత్తర్వులు: సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-09-13T18:39:47+05:30 IST

పెగాసస్ స్పైవేర్ అంశంపై మధ్యంతర ఉత్వర్తులు ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

పెగాసస్‌పై మధ్యంతర ఉత్తర్వులు: సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై మధ్యంతర ఉత్వర్తులు ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పెగాసస్‌ స్పైవేర్ అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం పెగాసస్‌పై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) వాదనలు వినిపించారు. స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్.. కోర్టుకు తెలిపారు. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే కేంద్రం అభిప్రాయమని, ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని ఎస్‌జీ చెప్పారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు.


ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి సొలిసిటర్ జనరల్ సమాధానం ఇస్తూ.. స్పైవేర్‌ అంశంపై లోక్‌సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే స్పైవేర్‌పై కమిటీని నియమించడం.. విచారణ చేయడం ఇక్కడ ప్రశ్న కాదని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ స్టాండ్ ఏంటో తెలుస్తుందని సీజేఐ సూచించారు. కేంద్ర మాజీమంత్రి రవిశంకర్‌ప్రసాద్ 2019లో పెగాసస్‌పై చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సీజేఐ ప్రస్తావించారు.


కేంద్రానికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని సీజేఐ అభిప్రాయపడ్డారు. అయితే స్పైవేర్‌పై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సొలిసిటర్ జనరల్ మరోసారి కోర్టుకు తెలియజేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ..అఫిడవిట్ దాఖలు చేస్తారనే గత విచారణలో సమయం ఇచ్చామని, కానీ మీరు మరోలా మాట్లాడుతున్నారని ఎస్‌జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం సుముఖంగా లేనందున మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ ఎన్వీరమణ పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, శ్యామ్ దివాన్, రాకేష్ ద్వివేది, దినేష్ ద్వివేది వాదనలు వినిపించారు.

Updated Date - 2021-09-13T18:39:47+05:30 IST