ధన్యవాదాలు..!

ABN , First Publish Date - 2021-11-04T13:08:04+05:30 IST

ఓ బాలిక చొరవ, ఆమెతో పాటు విద్యనభ్యసించే పిల్లలు సమస్యను తీర్చింది. కిలోమీటర్ల దూరంలోని బడికి రోజూ ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న వారి ఇబ్బందులు తొలిగాయి. ఇప్పుడు వారి ఊరికి పాఠశాల పనివేళలకు అనుగుణంగా రోజూ ఆర్టీసీ బస్సు వస్తోంది. గతంలో ఉన్న బస్సును రద్దు చేయడంతో..

ధన్యవాదాలు..!

సీజేఐ చొరవ.. ఆ ఊరికి బస్సు!

బడికి వెళ్లేందుకు విద్యార్థుల ఇబ్బందులు

ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ కోసం జస్టిస్‌ రమణకు బాలిక లేఖ 

ఆయన ఆఫీసు నుంచి ఆర్టీసీ ఎండీకి లేఖ

పిల్లల విద్యాహక్కును గౌరవిస్తాం

అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు

నిలిపివేసిన ప్రాంతాలకు బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు: సజ్జనార్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మంచాల(ఆంధ్రజ్యోతి): ఓ బాలిక చొరవ, ఆమెతో పాటు విద్యనభ్యసించే పిల్లలు సమస్యను తీర్చింది. కిలోమీటర్ల దూరంలోని బడికి రోజూ ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న వారి ఇబ్బందులు తొలిగాయి. ఇప్పుడు వారి ఊరికి పాఠశాల పనివేళలకు అనుగుణంగా రోజూ ఆర్టీసీ బస్సు వస్తోంది. గతంలో ఉన్న బస్సును రద్దు చేయడంతో పునరుద్ధరించాలని కోరుతూ బాలిక ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాసింది. ఇది ఫలితాన్నిచ్చింది. లేఖ ఆ బాలిక, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్‌ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న పీ వైష్ణవి. తాను, తొమ్మిదో తరగతి చదువుతున్న తన సోదరుడు.. ఊరికి ఆరు కి.మీ దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నామని.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న తమ సోదరి ప్రీతి 18 కి.మీ దూరంలో ఉన్న కాలేజీకి వెళుతోందని లేఖ ద్వారా సీజేఐ రమణ దృష్టికి బాలిక తీసుకెళ్లింది. తమ గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిరావడానికి అటో చార్జీలు రూ. 150 అవుతున్నాయని, తమ తండ్రి కరోనా మొదటి దశలో గుండెపోటుతో చనిపోయారని, అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తోందని సీజేఐ దృష్టికి తీసుకెళ్లింది. బడికి వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో బస్సులు లేవని లేఖలో వివరించింది.


ఉదయం ఏడింటికి బస్సు ఉండటంతో కొందరు తెల్లవారుజామునే లేచి బడికి వెళుతున్నారని.. తిరిగివచ్చేందుకు సాయంత్రం 6:30కు బస్సు ఉండటంతో స్కూలు వదిలినా కూడా గంటన్నర దాకా వేచి చూడాల్సి వస్తోందని.. ఇంటికొచ్చేసరికి రాత్రి 7 గంటలవుతోందని ఇబ్బందులను వెల్లబోసుకుంది. విద్యాసంస్థల వేళలకు అనుగుణంగా గతంలో ఉన్న బస్సును పునరుద్ధరిస్తే తమ సమస్యలు తొలగుతాయని.. ఆ మేరకు ఆర్టీసీ బస్సును తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయాలని వైష్ణవి లేఖలో విజ్ఞప్తి చేసింది. బుధవారం ఈ లేఖపై జస్టిస్‌ ఎన్వీ రమణ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌కే రాఖేజా టీఎ్‌సఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌కు లేఖ రాశారు. బస్సును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.   


సమస్యలను మా దృష్టికి తెండి: సజ్జనార్‌ 

జస్టిస్‌ ఎన్వీ రమణ కార్యాలయం నుంచి అందిన లేఖకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ధన్యవాదాలు. పిల్లలకు విద్యా హక్కును గౌరవించి సకాలంలో విద్యార్థులను పాఠశాలలకు చేర్చడానికి బస్సును పురుద్ధరించాం’’ అని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం డిపో బస్సు (రూట్‌ నంబరు 406) ఇబ్రహీంపట్నం నుంచి చీదేడ్‌  మీదుగా దాతుపల్లి వరకు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 5గంటలకు, రాత్రి 9గంటలకు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నిలిపివేసిన ప్రాంతాలకు బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


విద్యార్థులు, పలు గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు కొవిడ్‌ తీవ్రత కారణంగా బస్సులను రద్దు చేసిన సుమారు 30 ప్రాంతాలకు అక్కడి ప్రజల అభ్యర్థన మేరకు అక్టోబరు 30వ తేదీన  పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని వైష్ణవిని ఆదర్శంగా తీసుకొని.. ఇలాంటి సమస్యలున్న పక్షంలో ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లల విద్యాహక్కు ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్రంలో బడులు, కళాశాలల విద్యార్థుల రాకపోకలకు రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఆర్టీసీ హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులు, గ్రామస్థులు, ప్రయాణికులు కస్టమర్‌ సపోర్టు టీమ్‌ (040 301028829-040 68153333)ను సంప్రదించాలని, లేదంటే @tsrtcmdofficeకి ట్వీట్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2021-11-04T13:08:04+05:30 IST