Apr 14 2021 @ 10:54AM

అల్లు అర్జున్ - కొరటాల సినిమాపై క్లారిటీ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాగా 'పుష్ప' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమాకి సంబంధించిన ప్రకటన గత ఏడాదే వచ్చింది. 'ఏ ఏ 21' వర్కింగ్ టైటిల్‌తో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ - యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నాలుగు భాషలలో కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ షాకింగ్‌గా కొరటాల శివ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉండబోతున్నట్టు తాజాగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో తెరకెక్కబోతున్న 30వ సినిమాని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారట. దాంతో ఇక కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండదన్న ప్రచారం మొదలైంది. దాంతో తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ..2022 ఏప్రిల్‌లో మొదలు కానుందంటూ నిరాత సుధాకర్ మిక్కిలినేని తెలిపాడు. ఆ సమయానికి ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.