ఇరువర్గాల ఘర్షణ.. ఐదుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T05:28:38+05:30 IST

చంపావతి నది ఇసుక మేటలపై గురువారం నెల్లిమర్ల శెగిడిపేట, లక్ష్మీదేవిపేట గ్రామాల యువకుల మధ్య జరిగిన వివాదానికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్టు నెల్లిమర్ల పోలీసులు శుక్రవారం తెలిపారు.

ఇరువర్గాల ఘర్షణ.. ఐదుగురి అరెస్టు

నెల్లిమర్ల, జనవరి 15: చంపావతి నది ఇసుక మేటలపై గురువారం నెల్లిమర్ల శెగిడిపేట, లక్ష్మీదేవిపేట గ్రామాల యువకుల మధ్య జరిగిన వివాదానికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్టు నెల్లిమర్ల పోలీసులు శుక్రవారం తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చంపావతి ఇసుక దిబ్బలపై నెల్లిమర్ల ప్రజలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు, పిల్లలు, యువకులు ఏటా కలుసుకోవడం దశాబ్దాల కాలంగా సంప్రదాయంగా వస్తున్నది. ఈక్రమంలో నెల్లిమర్ల శెగిడిపేట, లక్ష్మీదేవిపేట గ్రామాలకు చెందిన యువకుల మధ్య గురువారం సాయంత్రం తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. చీకటి పడిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయన తర్వాత కూడా శెగిడిపేట యువకులు లక్ష్మీదేవిపేట వెళ్లి కొంతమంది యువకుల ఇళ్లపై దాడి చేసి గాయపరచడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాలను వేరు చేసి పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. లక్ష్మీదేవిపేటకు చెందిన రాధాకృష్ణ, పార్వతి, సింహాచలమ్మ తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శెగిడిపేటకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దామోదరరావు చెప్పారు.

 


Updated Date - 2021-01-16T05:28:38+05:30 IST