రావణ దహనాన్ని అడ్డుకునే యత్నం

ABN , First Publish Date - 2021-10-17T08:46:49+05:30 IST

దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి.

రావణ దహనాన్ని అడ్డుకునే యత్నం

  • కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఘర్షణలు.. 
  • దసరా వేడుకల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లొల్లి
  • సిరిసిల్ల జిల్లాలో లాఠీచార్జ్‌.. పలువురికి గాయాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. రావణ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బీబీపేట, గాంధారి మండలాల్లో గొడవలు జరిగాయి. బీబీపేట మండలం మందాపూర్‌లో కోటమైసమ్మ ఆలయం వద్ద రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తుండగా కొంత మంది అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి, పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో రావణదహనం చేస్తుండగా.. ఓ వర్గానికి చెందిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాము ఏటా ఇలాగే చేస్తామని మరో వర్గం వారు ఎదురుతిరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గాంధారి మండల కేంద్రంలోనూ రావణ దహనాన్ని అడ్డుకున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలో శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు దసరా ఉత్సవాలకు హాజరయ్యారు. కొద్దిసేపటికి ఇరు వర్గాలు ఒకరినొకరు దూషించుకుని దాడులు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. గాయపడిన కాంగ్రెస్‌ నేత రవీందర్‌ను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం ఆయనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మునిసిపల్‌ పరిధిలోని మల్లెమోనిగూడలో శుక్రవారం దసరా ఊరేగింపు సందర్భంగా ఘర్షణ నెలకొంది. ఓ వర్గం వారు ఊరేగింపునకు అడ్డుతగిలి, చేయి చేసుకున్నారని మరో వర్గం వారు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని, కావాలని వారే తమతో గొడవ పడ్డారని మరో వర్గం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తమపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఓ వర్గం శనివారం పరిగి బస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపల్‌ పరిధిలోని కండ్లకోయలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ శ్రీనివాస్‌ జెండావిష్కరణ చేయకుండా బీజేపీ కౌన్సిలర్‌ హంసకృష్ణాగౌడ్‌ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 


ఎమ్మెల్యే నరేందర్‌కు తప్పిన ప్రమాదం

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. దసరా సందర్భంగా శివనగర్‌లో రావణ దహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దహనం కోసం వత్తి అంటించిన వెంటనే, దానికి ఉన్న బాణసంచా పేలడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యేతోపాటు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడి నుంచి పరుగెత్తారు. కాలుతున్న వత్తిని పలువురు చేతితో పట్టుకుని ఆపే ప్రయత్నం చేయగా గాయాలయ్యాయి. 

Updated Date - 2021-10-17T08:46:49+05:30 IST