టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు

ABN , First Publish Date - 2022-09-11T06:17:15+05:30 IST

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అల్లుడు అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌ భర్త సోహెన్‌సింగ్‌ మంత్రి గంగుల కమలాకర్‌ను అపఖ్యాతిపాలు చేసేందుకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు ప్లాన్‌ చేశానంటూ చేసిన వాఖ్యలతో కూడిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.

టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు

- కార్పొరేటర్‌ భర్త ఆడియో క్లిప్పింగ్‌ కలకలం 

- రవీందర్‌సింగ్‌, కమల్‌జిత్‌కౌర్‌, సోహెన్‌సింగ్‌పై అధిష్ఠానానికి కార్పొరేటర్ల ఫిర్యాదు 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 10: కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అల్లుడు అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌ భర్త సోహెన్‌సింగ్‌ మంత్రి గంగుల కమలాకర్‌ను అపఖ్యాతిపాలు చేసేందుకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు ప్లాన్‌ చేశానంటూ చేసిన వాఖ్యలతో కూడిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్లిప్పింగ్‌ పార్టీలో తీవ్ర దుమారం లేపింది. 

వ్యాఖ్యలను ఖండించిన కార్పొరేటర్లు

నగర పాలక సంస్థలోని టీఆర్‌ఎస్‌కు చెందిన 42 మందిలో 40 మంది కార్పొరేటర్లు కమల్‌జిత్‌కౌర్‌ భర్త సోహెన్‌సింగ్‌ మంత్రిపై చేసిన వాఖ్యలను ఖండించారు. వారిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, ఆయన కుటుంబసభ్యులు పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచే రాజకీయాలతో మంత్రి, మేయర్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్రచేస్తున్నారని అన్నారు. రవీందర్‌సింగ్‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

స్వపక్షంలో విపక్షం

కొంత కాలంగా నగరపాలక సంస్థలో నివురుగప్పిన నిప్పులా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్ల మధ్య రాజుకుంటున్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఇటీవల పంజాబ్‌, ఢిల్లీ, బీహార్‌ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను వెంట తీసుకువెళ్లారు. దీంతో ఆయనకు సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో  కీలక బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో కరీంనగర్‌లో వైరల్‌ అయిన ఆడియో క్లిప్పింగ్‌ రాజకీయ కలకలం సృష్టించింది.  అధికారపార్టీలోనే ఉంటూ గతంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తన డివిజన్‌లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందంటూ ఖాళీ బిందెలతో కమల్‌జిత్‌కౌర్‌ నిరసన తెలిపారు. మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ నగరపాలక సంస్థలో పాలన కుంటుపడిందని, అవినీతి రాజ్యమేలుతోందని, అధికారులు పనులు చేయడం లేదంటూ విమర్శించారు. రవీందర్‌సింగ్‌ మాత్రం తనకు మంత్రితో ఎలాంటి విభూదాలు లేవని, ఉండబోవని స్పష్టం చేశారు. కార్పొరేటర్‌ ఆడియో క్లిప్‌ వ్యవహారాన్ని తేలికగా కొట్టివేశారు.

ఆడియో క్లిప్పింగ్‌లో ఏముంది..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆడియోలో కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌ భర్త సోహెన్‌సింగ్‌ ఓ వ్యక్తితో మాట్లాడిన మాటలు ఉన్నాయి. తమ కాలనీలోని రోడ్డు, డ్రైనేజీలు  దెబ్బతిన్నాయని, దానికి మరమ్మతులు చేయిద్దామంటే మంత్రి అడ్డుకుంటున్నాడని సోహెన్‌సింగ్‌ అన్నారు. ఆ రోడ్డుతో కాలనీలోని షాపుల వాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీంతో తామే ఎక్స్‌కావేటర్‌తో డ్రైనేజీ కోసం తవ్వించామని, తర్వాత కమిషనర్‌ను అనుమతి ఇవ్వమని అడిగామన్నారు. అనుమతి ఇవ్వకపోతే కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు కూర్చుంటామని చెప్పామన్నారు. కమిషనర్‌ వారం రోజులు గడవు అడిగాడని, దీంతో రవీందర్‌సింగ్‌ కలెక్టర్‌తో మాట్లాడాడన్నారు. మంత్రి తమను చిత్రహింసలు పెట్టాలనుకుంటున్నాడని, ఆమే ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నామని అన్నారు. వినాయక నిమజ్జనం కాగేనే కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పు చేద్దామని అనుకుంటున్నామని, అలా చేస్తే కలెక్టర్‌ వచ్చి డ్రైనేజీ నిర్మాణానికి అనుమతిస్తాడని అన్నారు.


Updated Date - 2022-09-11T06:17:15+05:30 IST