Abn logo
Sep 9 2021 @ 00:00AM

క్లాసికల్‌గా వర్కవుట్‌!

జయంతి కుమరేశ్‌కు బాల్యం నుంచీ సంగీతమే ప్రపంచం. అందులోనూ ప్రయోగాలంటే ప్రాణం. ప్రసిద్ధ వైణికురాలైన ఆమె కొన్నాళ్ళ కిందట... చక్కటి కథల ద్వారా చిన్న పిల్లలకు కర్ణాటక సంగీత మాధుర్యాన్ని పరిచయం చేసే యూట్యూబ్‌ సిరీస్‌ చేశారు. తాజాగా... వర్కవుట్స్‌ చేసే వారి కోసం... భర్త కుమరేశ్‌తో కలిసి ‘రన్‌ విత్‌ సా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేశారు.


‘‘కర్ణాటక సంగీతం పూర్తి శాస్త్రీయమైన  పద్ధతి. కానీ కళాకారులు మూసధోరణులను దాటి ఆలోచించగలిగితే ఏ సందర్భానికైనా అనుగుణంగా, ఎవరినైనా ఆకట్టుకొనేలా దాన్ని మలచుకోవచ్చు. అయితే ఏ ప్రయోగానికైనా ప్రయోజనం ఉండాలి. ‘కప్‌ ఓ కర్ణాటిక్‌’, ‘రన్‌ విత్‌ సా’ సంగీతం మీద ఆసక్తి ఉన్నవారు చేసిన సూచనలే’’ అంటారు జయంతి కుమరేశ్‌.  


ఆలోచన అలా పుట్టింది...

వైణికురాలుగా జయంతి, వాయులీన విద్వాంసుడిగా ఆమె భర్త ఆర్‌.కుమరేశ్‌ చాలా ప్రసిద్ధులు. ఒక రోజు మేమిద్దరం మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నప్పుడు... మా గురించి తెలిసిన ఒక వ్యక్తి పలకరించారు. రన్నింగ్‌ చేస్తున్నప్పుడు వినడానికి మంచి శాస్త్రీయ సంగీత ఆల్బమ్స్‌ ఉంటే చెప్పండి. అన్నీ వెస్ట్రన్‌వే దొరుకుతున్నాయి. భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ప్రేరణ కలిగించేలా... వర్కవుట్ల కోసం ప్రత్యేకంగా ఒక ఆల్బమ్‌ ఉంటే బాగుంటుంది’’ అని ఆయన అడిగారు. మేము ఆలోచనలో పడ్డాం. కర్ణాటక రాగాలు, తాళాలతో మనమే ఎందుకు కంపోజ్‌ చెయ్యకూడదనిపించింది. దానిలోంచి పుట్టుకు వచ్చిందే ‘రన్‌ విత్‌ సా’ అనే ఈ ముప్ఫై ఆరు నిమిషాల ఆల్బమ్‌’’ అని చెప్పారు జయంతి. అయితే దీని కోసం వారు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎవరెవరు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికీ, అందరినీ ఆకట్టుకొనే స్వరాలను ఎంచుకోవడానికీ కొన్ని వారాలు పట్టింది. శరీర కదలికలకు అనుగుణమైన కంపోజిషన్స్‌ చెయ్యడానికి బిపిఎం (బీట్స్‌ పర్‌ మినిట్‌) లాంటి చిన్న చిన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. రన్నర్స్‌తో, జిమ్‌ నిర్వాహకులతో మాట్లాడారు. చివరకు దీన్ని ఫైవ్‌ ట్రాక్‌ ఆల్బమ్‌గా తయారు చేశారు. ‘‘ఇది రోజువారీ వర్కవుట్లు, పరుగు, నడక లాంటి వాటికోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఆల్బమ్‌. సంగీతాన్ని ఫిట్‌నెస్‌ కోసం వినియోగించుకోవడం దీని ఉద్దేశం. ఇది ఇండియన్‌ పాప్‌ లేదా వరల్డ్‌ మ్యూజిక్‌ కేటగిరీకి చెందినదని చెప్పొచ్చు. మేం క్యూబన్‌ డ్రమ్స్‌, బ్రెజిలియన్‌ బీట్స్‌ లాంటివి కూడా ఉపయోగించాం. మా ఆల్బమ్‌కు ఆధారం కర్ణాటక సంగీతమే అయినా, అనేక కోణాలను స్పృశించాం. కీబోర్డ్‌, ట్రంపెట్‌, వాటర్‌ డ్రమ్స్‌ లాంటి అనేక వాయిద్యాలను ఇందులో వినవచ్చు’’ అంటున్నారామె. 


ఆ దశలకు అనుగుణంగా...

సంగీతంలో స్వరాల ఆరోహణ, అవరోహణ ఉన్నట్టే... వ్యాయామంలో కూడా వివిధ దశలు ఉంటాయి. మొదట వార్మప్‌, తరువాత వేగాన్ని అందుకోవడం, చివరకు నెమ్మదించడం... ఈ దశలన్నిటికీ అనుగుణంగా ఈ ఆల్బమ్‌లో ట్రాక్స్‌ ఉంటాయి. ‘‘విలక్షణమైన వర్కవుట్ల సంస్కృతికి అనుగుణంగా అన్ని అంశాలనూ దీనిలో పొందుపరిచాం. ఆరంభం నుంచి చివరి వరకూ, వినేవారి దృష్టి చెదిరిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొదటి ఐటమ్‌ ‘గెట్‌ ఇన్‌ ట్యూన్‌’... ఇది ‘హంసధ్వని’ రాగంలో ఉంటుంది, దాన్లో నిమిషానికి 160 బీట్స్‌ ఉంటాయి. అది వార్మప్‌ కావడానికి ఉపయోగపడుతుంది. తరువాత, ‘స్వింగ్‌ విత్‌ స్ట్రింగ్స్‌... ఉత్తేజం కలిగించేలా ‘శుద్ధ ధన్యాసి’ రాగంలో ఉంటుంది, అది వేగం నిలకడగా ఉండేలా చేస్తుంది. ‘ఫాలో ది నోట్స్‌కు స్ఫూర్తి ‘నాటకురంజి’ రాగం... నిమిషానికి 180 బీట్స్‌ ఉంటాయి. అది వేగాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. ‘రన్‌ విత్‌ ఎస్‌ఎ’కి ‘కీరవాణి’, ‘సింహేంద్రమధ్యమం’ రాగాలు ఆధారం, ఇది ఎనర్జీని పూర్తిగా ప్రేరేపిస్తుంది. ‘కమాస్‌’ రాగంలో చేసిన ‘కూల్‌ విత్‌ కమాస్‌’ ఆఖరు ఐటమ్‌..అది శరీరాన్ని చల్లబరచడానికి ఉద్దేశించింది. 


‘‘నిమిషానికి 80 నుంచి నూట 115 బీట్స్‌ మధ్య నెమ్మదిగా సాగే సంగీతం హార్ట్‌ రేట్‌ను నెమ్మదింపజేస్తుందనీ, ఒక రేస్‌ లేదా గేమ్‌ ముందు తలెత్తే ఆత్రుతని తగ్గిస్తుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. విలక్షణమైన వర్కవుట్‌ కోసం ఏం ఉండాలో అవన్నీ మా ఆల్బమ్‌లో పొందుపరచడానికి ప్రయత్నించాం. ఇందులోని ట్రాక్స్‌ వినేవాళ్ళ దృష్టిని చెదరనివ్వవు. ఆరంభం నుంచి ముగింపు వరకూ ఆహ్లాదం కలిగిస్తాయి. యువత మన సంప్రదాయ మూలాలతో మరింత అనుసంధానం కావడానికి, శాస్త్రీయ సంగీతాన్ని తమ జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని నమ్ముతున్నాం. సంగీతాన్ని ఎక్కువగా వింటున్న వారిలో 25-35, 55-65 మధ్య వయసుల వారు ఉంటారు. మేము ‘రన్‌ విత్‌ సా’ను విడుదల చేస్తున్నట్టు తెలిసి, ‘డ్యాన్స్‌ విత్‌ సా’, ‘బ్రీత్‌ విత్‌ సా’ అనే ఆల్బమ్‌లు కూడా చెయ్యాలని కొందరు సూచించారు. నిర్దిష్టమైన యాక్టివిటీస్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆల్బమ్స్‌ను వారు ఆస్వాదిస్తున్నారు. వ్యక్తిగతంగానూ మా సృజనాత్మకతను పెంచుకోవడంలో, పంచుకోవడంలో ఇది సరికొత్త అనుభవం. ఈ సిరీస్‌లో మరిన్ని ఆల్బమ్స్‌ తేవడానికి ప్రయత్నిస్తాం’’ అంటున్నారు జయంతి.


ఆన్‌లైన్‌లో వీణ పాఠాలు..

ఆరేడు తరాలుగా సంగీత కుటుంబం వీరిది. తల్లి, ప్రఖ్యాత వాయులీన విద్వాంసురాలు లాల్గుడి రాజ్యలక్ష్మి దగ్గర మూడేళ్ళ వయసులోనే సంగీత పాఠాలకు ఆమె శ్రీకారం చుట్టారు. పద్మావతి అనంతగోపాలన్‌, ఎస్‌.బాలచందర్‌ లాంటి దిగ్గజాల దగ్గర వీణ నేర్చుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌, రోహు మజుందార్‌ తదితరులతో కలిసి అనేక కచ్చేరీలు చేశారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల బృందంతో ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్కెస్ట్రా’ ప్రారంభించారు. సరస్వతీ వీణను పలికించే శైలి, మెళకువలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. దేశ విదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. వైణికురాలుగా మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ నుంచి పదిసార్లు అవార్డు తీసుకోవడంతో పాటు దేశ విదేశాల్లో పలు పురస్కారాలు పొందారు. వీణపై అనేక ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఆల్బమ్‌లు విడుదల చేశారు. కర్ణాటక సంగీతంపై పిల్లలకు ఆసక్తి కలిగించడం కోసం ‘కప్‌ ఓ కర్ణాటిక్‌ - ఫన్‌ సిరీస్‌’ పేరుతో యూట్యూబ్‌లో రెండు సిరీస్‌లు రూపొందించారు. మొదటి సీజన్‌లో హారీపోటర్‌, జేమ్స్‌బాండ్‌ లాంటి విదేశీ కథలనూ, రెండో సీజన్‌లో పంచతంత్రం, జాతక కథలనూ వివిధ రాగాల్లో వినిపిస్తూ, ఆ రాగాలను, వాటి నోటేషన్స్‌ను పిల్లలకు పరిచయం చేశారు. ‘జయంతి కుమరేశ్‌ అకాడమీ ఆఫ్‌ వీణ’ సంస్థ ద్వారా వీణావాద్యంలో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నారు.


ప్రత్యేకం మరిన్ని...