వైద్యులపై పంజా

ABN , First Publish Date - 2022-01-18T08:53:34+05:30 IST

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో కరోనా బాధితులు క్రమంగా

వైద్యులపై పంజా

  • కరోనా బారినపడుతున్న వైద్యులు, సిబ్బంది
  • బెజవాడలో 15 రోజుల్లో 50 మందికి కొవిడ్‌
  • కడప రిమ్స్‌లో 48 మంది వైద్య విద్యార్థులకు
  • విశాఖ, శ్రీకాకుళంలోనూ వైద్యులకు వైరస్‌
  • వైద్య సేవలపై ప్రభావం చూపే ప్రమాదం
  • అనంతలో ఆగిన సత్యసాయి వైద్య సేవలు


తొలి రెండు విడతల్లో సాధారణ ప్రజల్ని ఓ ఆటాడుకున్న కరోనా వైరస్‌.. మూడో దశలో వైద్యులపైనా విరుచుకుపడుతోంది. ఈ సారి ఎక్కడ చూసినా వైద్యసిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గత 15 రోజుల్లో సూరింటెండెంట్‌ సహా సుమారు 50 మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడగా.. కడప రిమ్స్‌లో 48 మంది వైద్య విద్యార్థులకు వైరస్‌ సోకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖలో ఆరుగురు వైద్య సిబ్బంది, శ్రీకాకుళంలో ఐదుగురు ప్రభుత్వ వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా కష్టకాలంలో వైరస్‌కు ఎదురొడ్డి పోరాడాల్సిన వైద్య సిబ్బందే ఇలా కొవిడ్‌ బారిన పడుతుండడంతో వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది. కొన్ని చోట్ల వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో కరోనా బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారినపడుతున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో గత 15 రోజుల వ్యవధిలో దాదాపు 50 మందికిపైగా జూనియర్‌  డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది కరోనా బారినపడగా.. తాజాగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, పరిపాలన విభాగంలో మరో కీలక అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.


ఇంకా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు కూడా వైరస్‌ బారినపడి క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పేదలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ పెద్దాసుపత్రిలోనే వైద్యులు, సిబ్బంది ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతుండటంతో కరోనా వార్డుల్లోని బాధితులకు మెరుగైన వైద్యసేవలందించడంపై ప్రభావం పడుతోందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. వారం క్రితం 15 మంది మాత్రమే ఇక్కడ కరోనాకు చికిత్స పొందుతుండగా.. సోమవారం నాటికి ఆ సంఖ్య 40కి చేరుకుంది.



రిమ్స్‌లో 48 వైద్య విద్యార్థులకు

కరోనా మహమ్మారి కడప జిల్లాలో కలకలం రేపుతోంది. రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో 48 మంది వైద్య విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. వారికి మంగళవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలు వాయిదా వేసేది లేదని ఎలాగైనా నిర్వహిస్తామని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సోమవారం ప్రకటించింది. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అయితే వారికి ఇన్విజిలేషన్‌ చేయాలంటే అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి విధుల్లో పాల్గొనడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. 


విశాఖలో ఆరుగురు వైద్య సిబ్బందికి 

విశాఖపట్నం జిల్లా చోడవరం కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆరుగురికి కరోనా సోకింది. హెడ్‌ నర్సు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులతో పాటు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లకు జలుబు, జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు ప్రభుత్వ వైద్యాధికారులు కరోనా బారిన పడ్డారు. వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం నుంచి ఎంబీబీఎస్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. ఇందులో ఇద్దరు వైద్యవిద్యార్థులకు, ఇద్దరి హౌస్‌ సర్జన్లకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  


గుంటూరు జీజీహెచ్‌లో బెడ్లన్నీ ఫుల్‌

గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. సంక్రాంతి ముగిసిన తర్వాత ఒక్కసారిగా సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి కరోనాతో వచ్చిన రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం వరకు 30 మందిలోపే చికిత్స పొందుతుండగా 100 బెడ్లను కేటాయించారు. సోమవారం ఈ బెడ్లన్నీ నిండిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అప్పటికప్పుడు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని మరో రెండు వార్డులను కొవిడ్‌కు ప్రత్యేకంగా కేటాయించారు. 


ఆగిన సత్యసాయి వైద్య సేవలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. సోమవారం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు వైద్యసేవలు నిలిపివేసినట్టు పేర్కొన్నారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు స్థానికేతరులకు వైద్యసేవలు అందవని, స్థానికులకు పరిసర గ్రామాల ప్రజలకు మాత్రం కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టుతో వైద్య సేవలందిస్తామని తెలిపారు.


Updated Date - 2022-01-18T08:53:34+05:30 IST