కౌంటింగుకు లైన్‌ క్లియర్‌ !

ABN , First Publish Date - 2021-05-01T07:10:33+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అడ్డంకులు తొలగిపోయాయి.

కౌంటింగుకు లైన్‌ క్లియర్‌ !

తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ, బీజేపీ అభ్యర్థుల రిట్‌ పిటిషన్ల కొట్టివేత


తిరుపతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని, కాబట్టి రీ పోలింగ్‌ జరపాలని కోరుతూ టీడీపీ, బీజేపీ అభ్యర్థులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 17న జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు ప్రత్యేకించి తిరుపతి సెగ్మెంట్‌లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు భారీగా బయట్నుంచి మనుషులను రప్పించి వారితో దొంగ ఓట్లు వేయించారు. దీన్ని టీడీపీ, బీజేపీ నేతలు కొంతమేరకు అడ్డుకునే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. ఈ అక్రమాల నేపధ్యంలో తొలుత బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తర్వాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం స్పందించలేదని, కనుక రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరారు. అయితే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్లను కొట్టివేసింది. ఈ దశలో తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చేసింది.దీంతో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల ప్రకటన యధాప్రకారం జరగనున్నాయి.


పోలింగ్‌ తీరుతో మారిన పార్టీల అంచనాలు

తిరుపతి ఉప ఎన్నికలపై తొలినుంచీ ప్రధాన పార్టీలు వేసుకున్న అంచనాలన్నీ పోలింగ్‌ తీరుతో మారిపోయాయి. పోలింగ్‌కు ముందు వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలంతా 5 లక్షల మెజారిటీ సాధిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. టీడీపీ నేతలైతే చంద్రబాబు, లోకేశ్‌ పర్యటనలకు లభించిన స్పందన చూసి తమ అభ్యర్థి గెలుస్తారనే నమ్మకానికి వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకత ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపించిందన్న అభిప్రాయానికి వచ్చారు.ఇక బీజేపీ నేతలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని మతపరమైన అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో పార్టీ ప్రభావం చూపుతుందని విశ్వసించారు. అయితే పోలింగ్‌ రోజు పరిస్థితి అందరి అంచనాలనూ తారుమారు చేసింది. అధికార పార్టీ నేతలు ఇతర నియోజకవర్గాల నుంచీ వందలాది వాహనాలు ఏర్పాటు చేసి వేలాదిమందిని తిరుపతికి తరలించి వారితో దొంగ ఓట్లు వేయించారు. దీన్ని టీడీపీ, బీజేపీ తదితర ప్రతిపక్ష నేతలు ఎంతమాత్రం అడ్డుకోలేకపోయాయి.వారి ఫిర్యాదులపై ఽఅధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం కూడా స్పందించలేదు. పోలింగ్‌ రోజు పరిణామాలతో వైసీపీ వర్గాలు ఆత్మరక్షణలో పడిపోయాయి. ఓడిపోతామన్న ఖచ్చితమైన సమాచారం వుండబట్టే దానికి విరుగుడుగా భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించారన్న ప్రచారం మొదలైంది. దానికి తోడు తొలినుంచీ వారు చెబుతున్న 5 లక్షల మెజారిటీ ఇపుడు విందామన్నా వారి నోట వినిపించడం లేదు. ఇపుడు గత మెజారిటీ కంటే తగ్గకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇక ప్రచారంలో జనం స్పందన చూసి గెలుపు తమదేనని విశ్వసించిన టీడీపీ వర్గాలు సైతం దొంగ ఓట్ల ధాటికి బెంబేలెత్తిపోయాయి. హైకోర్టుపై పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరకపోవడంతో ఫలితాల్లో తమకు ఓటమి తప్పదన్నట్టుగా నైరాశ్యంతో వుంటున్నారు. కాకపోతే వైసీపీకి భారీ మెజారిటీ రాదన్న అంచనాలు వారికి ఎంతోకొంత ఊరటనిస్తున్నాయి. ఇంచుమించు బీజేపీ వర్గాలదీ అదే పరిస్థితి. కేంద్రంలో అధికారంలో వున్నందున ఈసీ తమ మొర ఆలకిస్తుందని తొలుత భావించారు. అది నెరవేరకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఫలితం లేకపోవడంతో వైసీపీ ఎన్నికల అక్రమాలపై తాము పోరాడిన తీరును జనం గమనించారని,దాంతో నైతికంగా తమకే విజయం దక్కిందన్న భావనకు లోనవుతున్నారు.

Updated Date - 2021-05-01T07:10:33+05:30 IST