నేటి నుంచి క్లోన్‌ రైళ్ల కూత

ABN , First Publish Date - 2020-09-21T06:50:33+05:30 IST

ప్రయాణికులను వేగంగా గమ్యానికి చేర్చే ఉద్దేశంతో రైల్వేశాఖ నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్న ‘క్లోన్‌ రైళ్లు’ సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి...

నేటి నుంచి క్లోన్‌ రైళ్ల కూత

  • 2-3 గంటల ముందే గమ్యస్థానానికి
  • తెలంగాణ నుంచీ రెండు రైళ్ల సేవలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ప్రయాణికులను వేగంగా గమ్యానికి చేర్చే ఉద్దేశంతో రైల్వేశాఖ నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్న ‘క్లోన్‌ రైళ్లు’ సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. కొవిడ్‌-19 ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో రద్దీ, వెయిటింగ్‌ లిస్టు అధికంగా ఉంటోన్న 20 మార్గాల్లో వీటిని పరిచయం చేయనున్నారు. ఈ రూట్లలో మొత్తం 40 రైళ్లు నడుస్తాయి. ఇవి షెడ్యూల్‌ ప్రకారం నడిచే రైళ్లకు క్లోనింగ్‌గా ఉంటూ.. వాటికంటే రెండు లేదా మూడు గంటల ముందే గమ్యస్థానాన్ని చేరుతాయి. వీటిలో ఎక్కువ రైళ్లను ఢిల్లీ నుంచి బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలకు నడుపుతుండగా.. సికింద్రాబాద్‌-ధనపూర్‌ మధ్య ఒకరైలు.. బెంగళూరు-ధనపూర్‌ రైలు తెలంగాణ వాసులకు సేవలందించనున్నాయి. వీటిలో టికెట్‌ ధరలు కూడా హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాదిరిగానే ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిలో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సమయాన్ని 10 రోజులుగా నిర్ణయించారు. నిజానికి 2016లోనే అప్పటి రైల్వే శాఖ మంత్రి క్లోన్‌ రైళ్లను ప్రకటించగా.. అప్పట్లో పట్టాలపై రద్దీ కారణంగా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తుండడం.. ప్యాసింజర్‌, ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనుమతి లేకపోవడంతో.. క్లోన్‌ రైళ్ల సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం లభించిందని అధికారులు చెబుతున్నారు.


క్లోనింగ్‌ రైలు అంటే..?

క్లోనింగ్‌ రైలు అంటే.. సాధారణంగా షెడ్యూల్‌ ప్రకారం నడిచే రైలుకు ప్రతిరూపంలాంటిది. అంటే.. ఒక స్టేషన్‌ నుంచి ఒక రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సి ఉంటే.. అందులో వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులను క్లోనింగ్‌ రైలుకు మారుస్తారు. క్లోనింగ్‌ రైలు ఆ స్టేషన్‌ నుంచి మూడు గంటల ముందు బయలుదేరుతుంది. ఈ రైలు నిలిపే స్టేషన్లు కూడా పరిమితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కీలక జంక్షన్లలో కూడా వీటికి స్టాపేజీ ఉండదు. అందుకే.. ఇవి షెడ్యూల్‌ సమయం కంటే.. రెండు నుంచి మూడు గంటల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంటాయి.


Updated Date - 2020-09-21T06:50:33+05:30 IST