నేనుకు దూరం.. దైవానికి దగ్గర

ABN , First Publish Date - 2020-07-30T09:14:55+05:30 IST

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది జనవాక్యం. అదేకోవలో.. మనిషిలో అహం - దైవం ఉండలేవు అని పెద్దలు అంటారు.

నేనుకు దూరం.. దైవానికి దగ్గర

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది జనవాక్యం. అదేకోవలో.. మనిషిలో అహం - దైవం ఉండలేవు అని పెద్దలు అంటారు. ఈ విస్తృత భావాన్ని కబీరుదాసు తన రెండు పంక్తుల దోహాలో, ఆకాశాన్ని అగ్గిపెట్టలో ఇమిడ్చినట్టు చెప్పాడు.


జబ్‌ మైఁ థా తబ్‌ హరి నహిఁ అబ్‌ హరి హై మైఁ నహీఁ

ప్రేమ్‌ గలీ అతి సాంకరీ జామేఁ దోన సమాహీఁ


‘‘ఎప్పటివరకైతే నాలో ‘నేను’ అనే అహంకారం ఉన్నదో అప్పటివరకూ నేను దైవచింతన చేయలేకపోయాను. ఎప్పుడైతే నాలోని, ఆ ‘నేను’ అనే అహంభావం లేకుండా వెళ్లిపోయిందో అప్పటి నుంచి నాలో దైవీ భావాలు విస్తారంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇరుకైన నా మనసులో ఒక దానికి మాత్రమే చోటుంటుంది కాబట్టి’’ అంటాడు కబీరుదాసు. మనిషిలో గర్వం, దైవం కలిసి ఉండలేవు అనేదే ఆయన మాటల్లోని అంతరార్థం. ఇదే భావాన్ని బద్దెన కవి.. ‘బలవంతుడ నాకేమని’ అనే పద్యంలో అద్భుతంగా చెప్పాడు. ‘‘తాను బలవంతుడనని మనిషి ఎప్పుడూ విర్రవీగకూడదు. బలమైన పాము సైతం చలి చీమల బారిన పడి మరణిస్తుంది కదా’’ అంటాడు.


మనిషికి అసలైన శత్రువు అహంకారం. అది ‘నేను’ అనే తత్వం వల్ల ఏర్పడుతుంది. ఆ దురహంకారమే మనిషిని నాశనం చేస్తుందని మన పురాణేతిహాసాలు చెబుతున్నాయి. రామాయణంలోని ప్రధాన ప్రతినాయకుడు రావణుడు. లంకకు రాజు. పరిపాలనా దక్షుడు. గొప్ప శివ భక్తుడు. కానీ ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తూ మదాంధుడై సీతను అపహరించి, మరణం కోరి తెచ్చుకుంటాడు. మహాభారతంలోనూ.. రారాజైన దుర్యోధనుడు దురహంకారంతో ప్రవర్తించి చివరకు కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. భాగవతంలో హిరణ్యకశ్యపుడు బ్రహ్మ నుండి పొందిన వరాల కారణంగా తనంతటి వాడు లేడని విర్రవీగుతూ విష్ణువుతో శత్రుత్వం పెంచుకుంటాడు. తన కొడుకు ప్రహ్లాదుని విష్ణు భక్తిని చూసి భరించరాని శిక్షలకు గురిచేస్తాడు. చివరకు ఉగ్ర నరసింహుని చేతిలో కడు హీనంగా ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ‘‘దంబం, గర్వం, అభిమానం, కోపం, కాఠిన్యం, అవివేకం వంటివన్నీ ఆసురీప్రవర్తన గలవారి లక్షణాలు. వాటి నుంచి దూరంగా ఉండేవాడే జ్ఞాని’’ అని గీతాచార్యుడు చెప్పాడు.


రమణ మహర్షి మానవాళికి అందించిన బ్రహ్మాస్త్రం.. ‘‘నేను ఎవరు?’’ అనే ఆలోచనా ధార. వేంకటేశ్వరుడి ఆజ్ఞ మేరకు తిరుమలలో భవ్య మందిరాన్ని నిర్మించిన తొండమాన్‌ చక్రవర్తి.. తన వంటి భక్తుడు శ్రీనివాసుడికి మరొకరు లేరని విర్రవీగితే.. భీముడనే పేద కుమ్మరి నిస్వార్థ, నిర్మల భక్తిని చూపి ఆయనకు గర్వభంగం చేశాడా ఏడుకొండలవాడు. మహాత్మా కబీరు చెప్పినట్టు.. తొండమాన్‌ చక్రవర్తి మనసులో ‘నేను’ అనే భావన మాయమయ్యాక మళ్లీ ‘శ్రీనివాసుడు’ కొలువయ్యాడు.


పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-07-30T09:14:55+05:30 IST