ముగిసిన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ABN , First Publish Date - 2020-08-14T10:30:20+05:30 IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ముగిసింది. కో ఆప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు సీహెచ్‌

ముగిసిన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

నాలుగు టీఆర్‌ఎస్‌కు, ఒకటి ఎంఐఎంకు

అజిత్‌రావు, రమ, నరేందర్‌, అమ్జద్‌, రఫియాసుల్తానాకు అవకాశం 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 13: కరీంనగర్‌ నగరపాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ముగిసింది. కో ఆప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు సీహెచ్‌ అజిత్‌రావు, నందెల్లి రమ, పుట్ట నరేందర్‌, మైనార్టీ స్థానంలో మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు అమ్జద్‌ అలీ, ఎంఐఎంకు చెందిన రఫియా సుల్తానా ఎన్నికయ్యారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం మేయర్‌ వై సునీల్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో కమిషనర్‌ వల్లూరి క్రాంతి ఉదయం 11.30 గంటలకు జనరల్‌ కోటాలో ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. సమావేశానికి 41 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, ఐదుగురు ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు.


కో ఆప్షన్‌ సభ్యులుగా నందెల్లి రమ, చెన్నాడి అజిత్‌రావు, పుట్ట నరేందర్‌ పేర్లను ప్రతిపాదించగా 41 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో సహా, ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు, మంత్రి గంగుల కమలాకర్‌ చేతులెత్తి వారికి ఓటు వేయడంతో వారంతా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తర్వాత 12.30 గంటలకు మైనార్టీ కోటాలో  ఎంఐఎంకు చెందిన రఫియా సుల్తానా, సయ్యద్‌ అమ్జద్‌ అలీ పేర్లను కార్పొరేటర్లు ప్రతిపాదించగా వారిద్దరిని ఎన్నుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఏ కార్పొరేటర్‌ కూడా ప్రస్తావించక పోవడంతో ఐదురుగు కో అప్షన్‌ సభ్యులుగా ఎన్నికైనట్లు కమిషనర్‌ వల్లూరి క్రాంతి ప్రకటించారు. అనంతరం  కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన అజిత్‌రావు, నందెల్లి రమ, పుట్ట నరేందర్‌, అమ్జద్‌ అలీ, రఫియాసుల్తానాతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం ధ్రువీకరించారు. అనంతరం కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన వారిని మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతితోపాటు ఇతర సభ్యులు అభినందించారు.


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే పార్టీకి విధేయులుగా ఉన్న వారినే  మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గం ప్రజల ఆలోచనకు అనుగుణంగా సేవలందించి కరీంనగర్‌ను అన్నిరంగాల్లో ముందంజలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ళపు రమేశ్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-14T10:30:20+05:30 IST