Abn logo
Aug 4 2020 @ 05:01AM

ముగిసిన కోఅప్షన్‌ ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ

చివరి రోజున 15 మంది దరఖాస్తు 

 ఐదు పదవులకు 20 మంది పోటీ 

 నేడు, రేపు, ఎల్లుండి దరఖాస్తుల పరిశీలన : తుది జాబితా విడుదల 

 13న బల్దియా ప్రత్యేక సమావేశం.. ఎన్నికల నిర్వహణ!


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 3: నగరపాలక సంస్థలోని ఐదు కోఆప్షన్‌ పదవుల ఎన్నికలకు దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. రెండు మైనార్టీ, మూడు అనుభవజ్ఞులైన కోటాలోని ఐదు కోఆప్షన్‌ పదవులకు నందెల్లి రమ, చీటీ రామారావు, జనగామ రాజయ్య, మైనార్టీ కోటలో మియాజుద్దీన్‌ ఖాద్రీ, రఫియా సుల్తానా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం సయ్యద్‌ అజ్జద్‌ అలీ, చెన్నాడి అజిత్‌రావు, పుట్ట నరేందర్‌, కొమ్ము మధూకర్‌, సాధవేణి సుజాత, సాధవేని శ్రీనివాస్‌, రజియా బేగం, మోహిసీన్‌ అహ్మద్‌ఖాన్‌, లింగంపల్లి సుజాత, లింగంపల్లి శ్రీనివాస్‌, బాకారపు శివయ్య, కె.మధుకర్‌, ఫర్హానా అజీజ్‌, అఖిల్‌ ఉన్నీసా, ఖాజా ముస్కర్‌ మొత్తం 15మంది దరఖాస్తులను నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌(ఏసీపీ) వై.సుభాష్‌కు సమర్పించారు. మంగళ, బుధ, గురువారాల్లో ఈ దరఖాస్తులను పరిశీలించి, ఆ తర్వాత మున్సిపల్‌కార్యాలయ నోటీసు బోర్డుపై తుదిజాబితాను విడుదల చేస్తామని ఏసీపీ వై.సుభాష్‌ తెలిపారు.


అయితే మైనార్టీ, అనుభవజ్ఞుల కోటాలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు కావడంతో ఆపార్టీ వారిలో నలుగురిని ఎంపిక చేస్తుందని, వారే కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికవుతారని చర్చించుకుంటు న్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయిందని, అయితే వారి పేర్లను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో దరఖాస్తుదారులంతా కోఆప్షన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 13న ప్రత్యేక సమావేశాన్నిఏర్పాటు చేసి అదేరోజు కోఆప్షన్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయని భావిస్తున్నారు. కాగా, బీజేపీ నుంచి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆపార్టీ కోఆప్షన్‌ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా కోఆప్షన్‌ ఎన్నికలతో టీఆర్‌ఎస్‌ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.

Advertisement
Advertisement