సీడ్స్‌ కంపెనీ మూసివేత

ABN , First Publish Date - 2022-08-04T08:40:41+05:30 IST

సీడ్స్‌ కంపెనీ మూసివేత

సీడ్స్‌ కంపెనీ మూసివేత

విషవాయువు లీకేజీపై విచారణకు హైపవర్‌ కమిటీ

నివేదిక వచ్చే వరకు కార్మికులకు వేతనాలు చెల్లించాలి

గత ప్రమాదంపై జూన్‌ 30న కంపెనీకి షోకాజ్‌ నోటీసులు

ఈ నెలాఖరులోగా సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్‌ 

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ప్రమాదకర పరిశ్రమల్లో  భద్రతా ప్రమాణాలపై సేఫ్టీ ఆడిట్‌

సీడ్స్‌ కంపెనీలో పరిశీలన, ఘటనపైౖ ఆరా

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ


అనకాపల్లి/అనకాపల్లిటౌన్‌/అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 3: అనకాపల్లి జిల్లా బ్రాండిక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకైన ఘటనపై హైపవర్‌ కమిటీని నియమించి విచారణ జరిపిస్తామని, నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న బాధితులను బుధ వారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించామన్నారు. ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారన్నారు. గతంలో కూడా ఈ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు కారణాలు తెలుసుకునేందుకు ఒక కమిటీ వేశామని.. సీడ్స్‌ కంపెనీ నుంచి కొన్ని శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా అందులో కాంప్లెక్స్‌ గ్యాస్‌ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు పేర్కొన్నారు. పెస్ట్‌ కంట్రోల్‌కు వాడే క్రిమిసంహారక మందు ఏసీ యంత్రాల్లోకి వెళ్లిందని, వాటిని వినియోగిస్తున్నప్పుడు అందులోంచి విష వాయువు బయటకు వచ్చి అక్కడ పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారని కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి సెక్షన్‌ 41 కింద జూన్‌ 30న షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని రెండు నెలల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించామని... సంబంధిత యాజమాన్యం దీనిపై స్పందించాల్సి ఉందని వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి సేఫ్టీ ఆడిట్‌ నిర్వహిస్తామని మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. సీడ్స్‌ కంపెనీలో జరిగిన ఘటనలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. కంపెనీని తిరిగి తెరిచే వరకు కార్మికులకు యథావిధిగా వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.


సీడ్స్‌ను సందర్శించిన మంత్రి 

బ్రాండిక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో మంగళవారం రాత్రి విషవాయువు వెలువడిన ఎం-1 యూనిట్‌ను మంత్రి అమర్‌నాథ్‌, జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి రాజు తదితరులు బుధవారం సాయంత్రం సందర్శించారు. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువు లీకవడానికి గల కారణాలు, గ్యాస్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాలపై మంత్రి ఆరాతీశారు. సమగ్ర విచారణ చేపట్టి, త్వరగా నివేదిక అందించాలని పీసీబీ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 


నేడు పీసీబీ సభ్య కార్యదర్శి రాక?

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సీడ్స్‌ కంపెనీలో విషవాయువు వెలువడిన ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్టు తెలిసింది. కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్‌, పరిశ్రమల విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణులు ఉంటారని సమాచారం. సీడ్స్‌ కంపెనీని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి విజయకుమార్‌ గురువారం సందర్శించనున్నారు. అయితే దీనిని సంబంధిత అధికారులు ధ్రువీకరించడం లేదు.  కాగా.. కంపెనీలో సంఘటనకు సంబంధించిన శ్యాంపిల్స్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి పంపారు.


కోలుకుంటున్న బాధితులు

అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 43 మందిని బుధవారం రాత్రి డిశ్చార్జి చేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. మరో పది మందికి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తామని కుటుంబసభ్యులు తీసుకువెళ్లారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉషాప్రైమ్‌ ఆస్పత్రిలో 42 మందిని చేర్చగా, వీరిలో 23 మంది బుధవారం డిశ్చార్జి అయ్యారని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీరామ్మూర్తి తెలిపారు.


ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి

మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే పీలా 

సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై న్యాయవిచా రణకు ప్రభుత్వం ఆదేశించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని, సీడ్స్‌ కంపెనీ యాజమాన్యంతో పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రెండు నెలల క్రితం ఇదే తరహాలో జరిగిన సంఘటనపై ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ కంపెనీని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసిందని, కార్మికులకు పరిహారం చెల్లించకుండా ఉండేందుకే విషవాయువు లీకేజీలకు పాల్పడుతోందన్న అనుమానం కలుగుతోందని వారు ఆరోపించారు.


‘సీడ్స్‌’ డబ్బుకు అమ్ముడుపోయారు

టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడి ఆరోపణ

సీడ్స్‌ కంపెనీలో రెండు నెలల క్రితం విషవాయువు వెలువడి వందలాది మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, ఈ ఘటనపై విచారణ జరిపించిన ప్రభుత్వం.. నివేదికను బయటపెట్టకుండా కంపెనీని తెరవడానికి ఎలా అనుమతులు ఇచ్చిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. ప్రమాద ఘటనకు నిరసనగా బ్రాండిక్స్‌ కంపెనీ మెయిన్‌ గేటు వద్ద టీడీపీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు డబ్బుకు అమ్ముడుపోయి, సీడ్స్‌ కంపెనీలో కార్యకలాపాల పునరుద్ధరణకు అనుమతులు ఇచ్చారని, ఇందుకు అధికారులు తమ వంతు సహకారం అందించారని ఆరోపించారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి విషవాయువు లీకైందని ఆయన అన్నారు. విషవాయువు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-04T08:40:41+05:30 IST