Advertisement
Advertisement
Abn logo
Advertisement

పర్యాటక ప్రదేశాలు మూసివేత

 అరకులోయ, డిసెంబరు 3:  జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏజెన్సీలోని అన్ని పర్యాటక ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలను స్థానిక అధికారులు మూసివేశారు. అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్‌, అనంతగిరి మండలంలో బొర్రాగుహల గేట్లకు తాళాలు వేశారు. కాగా తుఫాన్‌ నేపథ్యంలో పర్యాటక కేంద్రాలను మూసివేసినట్టు ప్రకటించిన అధికారులు, మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి పర్యాటకులు రాకుండా అనంతగిరి మండలం చిలకలగెడ్డ అటవీ చెక్‌పోస్టు వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్‌ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ వాసులను మినహా మరెవరినీ అరకులోయ వైపు వెళ్లనివ్వడంలేదు. పాడేరు మండలం వంజంగి మేఘాల కొండలు, చింతపల్లి మండలం చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్‌, తదితర పర్యాటక ప్రదేశాలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. నగరంలో జూ, సబ్‌మెరైన్‌ మ్యూజియం మూతపడ్డాయి.


నేడు, రేపు మరికొన్ని రైళ్లు రద్దు

విశాఖపట్నం, డిసెంబరు 3: తుఫాన్‌ నేపథ్యంలో శని, ఆదివారం మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. శనివారం విశాఖ-రాయపూర్‌-విశాఖ (08528/08527), రాయగడ-విశాఖ (18527), జగదల్‌పూర్‌-రూర్కెలా (18108), రాయగడ-గుంటూరు (17244), భువనేశ్వర్‌-తిరుపతి (22879), హౌరా-సికింద్రాబాద్‌ (12703), హౌరా-యశ్వంత్‌పూర్‌ (12245), భువనేశ్వర్‌-ముంబై (11020), హౌరా-తిరుపతి (20889), చెన్నై-హౌరా (12842), హైదరాబాద్‌-హౌరా (18046), డిబ్రుగర్‌-కన్యాకుమారి (15906), పూరి-గుణుపూర్‌ (18417), పూరి-అహ్మదాబాద్‌ (12843), విశాఖ-కిరండోల్‌-విశాఖ (18551/18552), యశ్వంత్‌పూర్‌-కామాఖ్య (12551), యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), యశ్వంత్‌పూర్‌-భగల్‌పూర్‌ (12253) రైళ్లను రద్దు చేశారు. అలాగే ఆదివారం తిరుపతి-భువనేశ్వర్‌ (22880), తిరుపతి-హౌరా (20890), సోమవారం గౌహతి-బెంగళూరు (12510), అగర్తాలా-బెంగళూరు (12984) రద్దు చేశారు.


హడావిడిగా వరి కుప్పలు

గత రెండు, మూడు రోజుల్లో కోత కోసిన పొలాల్లో వరి పనలను కాపాడుకునేందుకు రైతులు హైరానా పడుతున్నారు. పనలను మోపులు కట్టి, మెరక ప్రదేశాల్లో కుప్పలు వేస్తున్నారు. మరికొంతమంది రైతులు వరి పనలను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఇళ్ల వద్దకు చేర్చుకుని, ఖాళీ స్థలాల్లో కుప్ప పెడుతున్నారు. వర్షాలకు తడవకుండా వరి కుప్పలను టార్పాలిన్లతో కప్పి, ఈదురుగాలులకు పనలు లేచిపోకుండా వుండడానికి బరువైన వస్తువులు పెడుతున్నారు. కాగా వరి పంట పక్వానికి వచ్చి, తుఫాన్‌ కారణంగా కోత కోయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు వీస్తే పైరు నేలవాలుతుందని, భారీవర్షాలు కురిస్తే నీటమునిగి పాడైపోతుందని వాపోతున్నారు.


అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు 

నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా

విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సూచించారు. ఉత్తర కోస్తాపై తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరప్రాంతాల వాసులను అప్రమత్తం చేయడంతోపాటు, బీచ్‌రోడ్డులో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పోలీస్‌ సిబ్బంది తీర ప్రాంతంలోని జనావాసాల్లోనూ, బీచ్‌రోడ్డులో మైక్‌ ద్వారా నిరంతరం హెచ్చరికలు జారీచేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తున్నారన్నారు. మహిళా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని, అలాగే జలాశయాలు, చెరువులు పరిసర ప్రాంతాల్లో తమ సిబ్బందిని ప్రత్యేక గస్తీ కోసం నియమించామన్నారు.


Advertisement
Advertisement