పెట్రోభారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాపమే.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-03-08T05:58:06+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో 40ఏళ్లు వెనక్కు నెట్టాయని, ఆ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి ఖమ్మం వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం ప్రారంభమైంది.

పెట్రోభారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాపమే.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
భద్రాచలంలో ప్రారంభమైన భట్టి విక్రమార్క సైకిల్‌ యాత్ర

మోదీ, కేసీఆర్‌  పాలనలో 40ఏళ్లు వెనక్కు

భద్రాచలం నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభం

హాజరైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పలువురు నేతలు

భద్రాచలం/బూర్టంపాడు, మార్చి 7: పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో 40ఏళ్లు వెనక్కు నెట్టాయని, ఆ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి  ఖమ్మం వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం ప్రారంభమైంది. భట్టివిక్రమార్క సతీమణి నందిని, పలువురు కాంగ్రెస్‌ మహిళా నాయకులు ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.58వసూలు చేస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పన్నులు కేవలం రూ.12మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. తమ హయాంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ వాటిని అమ్మకానికి పెడుతోందని ఆరోపించారు. తాము ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలను నిర్వహిస్తే.. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వాటిని మూసివేసే స్థాయికి తెచ్చిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో పట్టభద్రులు కావాలంటే రూ.లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యూనివర్సిటీ నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటు వేయడం.. ఆత్మహత్య చేసుకోవడంతో సమానమన్నారు. కాంగ్రెస్‌ తరపున బరిలో ఉన్న ఎస్‌.రాములునాయక్‌కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.  

కేసీఆర్‌.. నీ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్‌లో ఉద్యమ స్ఫూర్తి ఏమైందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల మనోభావాలను స్పష్టం కావాలని, ఈ ఫలితాలతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. సైకిల్‌ యాత్రతో ఓట్లు అడిగే వినూత్న ప్రయత్నానికి భట్టి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్‌.రాములు నాయక్‌ మాట్లాడుతూ ఐదు పంచాయతీల విలీనం, భద్రాద్రికి రూ.100కోట్ల నిధులు, గిరిజన యూనివర్సిటీ మంజూరు అంశాలను విస్మరించిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌, తోటకూర రవిశంకర్‌, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఖమ్మం నగర అధ్యక్షుడు మహ్మద్‌ జావీద్‌, భద్రాద్రి జిల్లా నాయకులు యడవల్లి కృష్ణ, భూక్య దళ్‌సింగ్‌నాయక్‌, నల్లపు దుర్గాప్రసాద్‌, అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

కేంద్రంలో ఆ నలుగురు.. రాష్ట్రంలో ఈ నలుగురు 

కేంద్రంలో ఆ నలుగురు.. రాష్ట్రంలో ఈ నలుగురు దేశ సంపాదను దోచుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సైకిల్‌యాత్ర బూర్గంపాడు మండలం ఆంజనాపురం గ్రామానికి చేరుకున్న తరువాత భట్టి విక్రమార్కు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పెట్రోలు, డిజిల్‌ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు దొంగలు.. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాములునాయక్‌కు మొదటి ప్రాఽదన్యత ఓటు వేయాలని కోరారు. సమావేశంలో భద్రాచలం శాసనసభ్యుడు పొదెం వీరయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T05:58:06+05:30 IST