వికృతమవుతున్న నవ్యాంధ్ర సంఘ జీవనం

ABN , First Publish Date - 2020-09-13T06:53:49+05:30 IST

మానవుడు సంఘజీవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఈ సత్యాన్ని ఉద్ఘాటిస్తూ ‘సంఘంలో జీవించడానికి ఇష్టపడని వ్యక్తి దైవ స్వరూపుడు లేదా దయ్యంతో సమానం’...

వికృతమవుతున్న నవ్యాంధ్ర సంఘ జీవనం

నాణ్యమైన మానవవనరులు, విలువైన సహజవనరులు సమృద్ధంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధి సూచికలలో దిగజారడానికి కారణమేమిటి? ప్రస్తుత పాలకుల దార్శనికతా లోపమే కాదా? ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య సంకుచిత విభజనలను పెంపొందిస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో సర్వనాశన దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నారు. ఈ వికృత పాలన వల్ల అన్ని ప్రాంతాల ప్రజల భవిష్యత్తు బలి అయ్యే ప్రమాదం గోచరిస్తోంది.


మానవుడు సంఘజీవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఈ సత్యాన్ని ఉద్ఘాటిస్తూ ‘సంఘంలో జీవించడానికి ఇష్టపడని వ్యక్తి దైవ స్వరూపుడు లేదా దయ్యంతో సమానం’ అని వ్యాఖ్యానించాడు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు సాధారణ మనిషి అయి ఉండడు. ప్రతి వ్యక్తీ సంఘంలో అందరిలో ఒకడిగా జీవిస్తాడు. కారణమేమిటి? ఏ ఒక్క వ్యక్తీ వైయక్తిక సమాజాన్ని నిర్మించలేడు. అసలు వైయక్తిక సమాజమనేదే ఉండదు. కనుకనే ఉమ్మడి శ్రేయస్సే లక్ష్యంగా ప్రతి ఒక్కరి జీవన ప్రస్థానం వివిధ జన సముదాయాలలో అంతర్భాగంగా ఉంటుంది, ఉండాలి కూడా.


మానవుడు సంఘజీవిగా ఉండడానికి కారణాలు: 1) జీవనానికి; 2) భౌతిక వాంఛల పరితృప్తితో కుటుంబాన్ని అభివృద్ధిపరచుకోవడానికి; 3) ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి; 4) సామాజిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, భౌతిక జీవన అవసరాలు, ఆధ్యాత్మిక ఆవశ్యకతలు. ఈ జీవన సత్యాల వెలుగులో మన సమాజాలలోని పరిస్థితుల గురించి వివేచిద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పరిశీలించినప్పుడు మానవుడు నిజమైన సంఘజీవిగానే బ్రతుకుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. ప్రజల ఆలోచన విధానంలో వస్తున్న మార్పులే ఈ సందేహానికి తావిస్తున్నాయి. మరి ఆ మార్పులకు మీరే కారకులని ఎవరినైనా నిందించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. ఆ మార్పులకు మూలకారణాలేమిటో నిష్పాక్షికంగా అన్వేషించాలి. 


రాజకీయ కారణాలతో ప్రాంతాలవారీగా, కులాలవారీగా వ్యక్తుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఈ పొరపొచ్చాలు మనలను తిరోగామి సమాజం వైపు అడుగులు వేయిస్తాయనడంలో మరో అభిప్రాయం లేదు. అటువంటి పరిణామం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. మన సమాజ నిర్మాణంలోని మౌలిక స్వభావాన్ని మార్చే ప్రయత్నాలు ఇతరుల (మహ్మదీయలు, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, డచ్ జాతీయులు, పోర్చుగీసు వ్యాపారులు తదితరులు) ప్రభావంతో మన రాష్ట్రంలోనే కాదు, సువిశాల భారతదేశంలోనూ జరిగాయి. ఇప్పుడు ఈ పరిణామాత్మక ప్రక్రియను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మన మధ్యలో ఉన్నవారే వేగవంతం చేస్తున్నారు. ఇది అవగాహనా లోపంతో చేసే కార్యాచరణ ఎంతమాత్రం కాదు. వ్యవస్థలను జీవితాంతం తమ గుప్పిట్లో ఉంచుకోవాలని కొంతమంది అత్యాశ పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా సమాజంపై తమ ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెరపాలనే వికృత అవగాహనతో జరుగుతున్న ప్రయత్నాలివి. ఈ సంకుచిత వ్యవహారం మన సమాజ విశిష్ట లక్షణమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’ ప్రాతిపదికలను ఘోరంగా దెబ్బతీసే ప్రమాదం ఎంతైనా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం వర్ధిల్లడం మన సమాజ మనుగడకు ఎంతైనా అవసరమనే సత్యాన్ని మనం విస్మరించకూడదు. అంతేకాదు, ఆ దుష్ట వ్యవహారం మానవుడు సంఘజీవిగా ఉండటానికి అవసరమైన ఆలంబనలనూ ఛిన్నాభిన్నం చేస్తాయి. ఇదే జరిగితే మన సామాజిక సమతౌల్యత కూలిపోతుంది. కనుక ఈ దుష్టవిధానాలకు అడ్డుకట్ట వేయాలి. తక్షణమే వేసి తీరాలి. లేనిపక్షంలో మనం అన్ని విధాలా వెనుకబడి పోతాం. అనంత విశ్వం వెలుగుల్లోకి ప్రయాణించాలని ప్రపంచమంతా ఆరాటపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి విపత్కర, తిరోగమన ధోరణులు ఎందుకు ప్రబలుతున్నాయి? సమాజంలో అందరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరు అనే సహజ సూత్రం నుంచి సమాజం అంటే అతి కొద్దిమంది మాత్రమే లేదా కొన్ని కుటుంబాలకే పరిమితం అనే భావన ఎందుకు తీవ్రతరమవుతోంది? నవ్యాంధ్రులు ప్రతి ఒక్కరూ ఈ విషయమై చిత్తశుద్ధి, చైతన్యశీలమైన ఆలోచన చేయాలి. 


కులాలు, మతాలు, ప్రాంతాల మాటున అంతరాలు పెంచి విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా వ్యక్తుల మనస్సులలో విషబీజాలు నాటడం అనేది సమాజంలో ఒక దీర్ఘకాలిక ప్రతికూల అంశంగా మారే అవకాశముంది. అటువంటి పరిణామం మన పురోగతికి ప్రతిబంధకంగా మారుతుంది. నిష్ఠుర సత్యమేమిటంటే ఆ విష బీజాలు నాటినవారు సైతం ఆ ఊబిలోనే అంతర్ధానం కావడం ఖాయం. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ దుష్టవిధానంతో వ్యవహరిస్తున్నవారు తమతో పాటు ప్రజలను, వ్యవస్థలను, మొత్తం సమాజాన్ని తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నారు. తద్వారా మానవుడు సంఘజీవి అనే సత్యాన్ని మరచిపోయేలా చేస్తున్నారు. తమకు నచ్చిన కొంతమంది మాత్రమే సమాజంలో భాగం అనే విధంగా వారు సూత్రీకరించే ప్రమాదమూ పొంచి ఉంది. అరిస్టాటిల్ చెప్పినట్టు సమాజంతో సంబంధం లేని దయ్యాలుగా బ్రతుకుదామా? లేక అందరికోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరు అనే సహజ సూత్రం ద్వారా ఏర్పడిన సమాజంలో నిజమైన సంఘజీవులుగా జీవిద్దామా? నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్తుత పాలకులు ఈ ప్రశ్నలను తమకు తాము వేసుకుని తీరాలి. ఎందుకు? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంకా తీవ్ర మవకుండా నిరోధించాలి. ఇందుకు సానుకూల ఆలోచనతో పాలకులు నడవాలి. లేనిపక్షంలో అరాచకశక్తుల దాడుల నుంచి భవిష్యత్తులో ఎవరూ ఎవరినీ కాపాడలేరు. తత్ఫలితంగా సంఘజీవనం అర్థరహితమవుతుంది. 


రాష్ట్రంలో ప్రస్తుతం సంభవిస్తున్న సంఘటనలు చాలా ఆందోళనకరంగా ఉన్నందునే ఈ విశ్లేషణ అని ఆవేదనతో మనవి చేసుకుంటున్నాను. అమరావతి రైతుల ఆక్రందనకి మూలకారణమేమిటి? ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టి, అవాస్తవాలతో రైతులకి కులం అంటగట్టడం ద్వారా సమాజంలో అంతరాలను పెంచేందుకు ప్రయత్నించడమే కాదూ? దళితులు, వెనుకబడిన వర్గాలపై భౌతిక, మానసిక దాడులు; అన్యమత వ్యాప్తికి ప్రాధాన్యత నిచ్చి సువ్యవస్థిత సంప్రదాయ సంస్కృతిని ఉపేక్షించడం నాగరీకమేనా? కొంతమంది ప్రముఖులను కులం ప్రాతిపదికన వేధించడం సంస్కారయుతమేనా? చీటికీమాటికీ రాజ్యాంగవ్యవస్థ కట్టుబాట్లను అతిక్రమించడమేమిటి? ఈ అంశాలు మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పడం పరిస్థితి తీవ్రతను తక్కువ చేసి చెప్పడమే సుమా! 


ఏ సమాజంలోనైనా సమ్మిళిత అభివృద్ధి సుసాధ్యమవ్వాలంటే నాణ్యమైన మానవవనరులను పెంపొందించుకోవడంతో పాటు సహజవనరులను ఒక క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి. ఇది నిపుణుల అభిప్రాయం. ఏ ప్రాంత అభివృద్ధికి అవసరమైన వనరులు ఆ ప్రాంతంలో సమృద్ధంగా ఉండడం నవ్యాంధ్రప్రదేశ్‌కు దైవమిచ్చిన ఒక భౌగోళిక వరం. మరి ప్రస్తుత పాలకులు ఈ వరాన్ని సద్వినియోగం చేస్తున్నారా? రాజకీయ ఆధిపత్యం కోసం సంకుచిత బుద్ధితో కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోయే విధానాలను అనుసరిస్తున్నారు. ఈ వైఖరి వల్ల భావి తరాలు జీవన భద్రతను అన్ని విధాల కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అది మరిన్ని విభజన వాదాలకు ప్రాతిపదిక కూడా కావచ్చు. ఈ మాట కఠోరంగా ఉందా? కానీ అది ఒక నిష్ఠుర సత్యం. ఇప్పటికే విభజన సమస్యలతో పడుతున్న ఇబ్బందుల తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం కనబడుతుంది. కలసి మెలిసి సంఘజీవనంతో అభివృద్ది పథంలో దూసుకుపోవలసిన ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత పాలకుల విధానాలతో అన్ని విధాల వెనుకబడిపోతోంది. ఇప్పటికే ఇటువంటి దుస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. భవిష్యత్తు విషయమై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పాలకులకు వినపడడం లేదా? 


సహజ వనరులు సమృద్ధంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదలైనవి వెనుకబాటుతనానికి పర్యాయపదాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయా రాష్ట్రాల పాలకులు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా అవి ప్రగతిపథంలో ముందంజ వేస్తున్నాయి. ప్రజల సహకారంతో పాలకులు పలు సంస్కరణలు అమలుపరుస్తున్నారు. మరి నాణ్యమైన మానవ వనరులు, విలువైన సహజ వనరులు సమృద్ధంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధి సూచికలలో దిగజారడానికి కారణమేమిటి? ప్రస్తుత పాలకుల దార్శనికతా లోపమే కాదా? ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య సంకుచిత విభజనలను పెంపొందిస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో సర్వనాశన దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నారు. ఈ వికృత పాలన వల్ల అన్ని ప్రాంతాల ప్రజల భవిష్యత్తు బలి అయ్యే ప్రమాదం గోచరిస్తోంది. 


ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దే తారకమంత్రం ‘అందరికోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరు’ అనే సంఘజీవన సూత్రాన్ని చిత్తశుద్ధితో ఆచరించడమే. ఇది జరిగినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సుసాధ్యమవుతుంది. నవ్యాంధ్ర ప్రస్తుత పాలకులలో సామాజిక వాస్తవికతతో ఆలోచించే దృక్కోణం పెరగాలని ఆశిస్తున్నాను. నా శుభకామన నిజం కాకపోతే నవ్యాంధ్రప్రదేశ్ సమాజ భవ్య భవిష్యత్తును తమ వ్యక్తిగత స్వార్థం కోసం బలి చేసిన వారిగా ప్రస్తుత పాలకులు చరిత్ర పుటలలో నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

లంకా దినకర్

Updated Date - 2020-09-13T06:53:49+05:30 IST