‘మహాయజ్ఞం’పై మహదానందం

ABN , First Publish Date - 2021-01-19T05:30:00+05:30 IST

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన మంగళవా రం ఉత్సాహంగా సాగింది. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకొని పూజలు జరిపిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి ప్రధానమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీని సందర్శించారు. ఇక్క డ గోదావరి నిండుకుండను తలపించడంతో సీఎం ఆనందపరవశం చెందారు. తన కల సాకారమైందని సంతోషంతో చెప్పారు. బ్యారేజి వద్ద ఆయన సుమారు రెండున్నర గంటలపాటు గడిపారు.

‘మహాయజ్ఞం’పై మహదానందం
మేడిగడ్డ బ్యారేజ్‌ వ్యూ పాయింట్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, గోదావరి మాతకు నమస్కరిస్తున్న సీఎం

మేడిగడ్డ బ్యారేజి వద్ద గోదావరి జలాలను చూసి పులకించిన సీఎం
తన కల సాకారమైందని ఆనందం
కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి అని వ్యాఖ్య
ఇంజనీరింగ్‌ సిబ్బంది, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు అభినందనలు
సతీసమేతంగా గోదావరి మాతకు వాయినాలు


మహదేవపూర్‌ రూరల్‌/మహదేవపూర్‌, జనవరి 19 :
సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన  మంగళవా రం ఉత్సాహంగా సాగింది. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకొని పూజలు జరిపిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి ప్రధానమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీని సందర్శించారు. ఇక్క డ గోదావరి నిండుకుండను తలపించడంతో సీఎం ఆనందపరవశం చెందారు. తన కల సాకారమైందని సంతోషంతో చెప్పారు. బ్యారేజి వద్ద ఆయన  సుమారు రెండున్నర గంటలపాటు గడిపారు.

నిర్మాణం నుంచి నీటిని ఎత్తిపోసే వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు జరుగుతుండటం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశా రు. అనుకున్న సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలను  అభినందించారు. బ్యారేజీలో పూర్తిస్థాయి లో నీటిని నిల్వ ఉన్నందన ఈ ఎండాకాలంలో చుక్కనీటిని కూడా వృథా చేయకుండా రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటలు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఓ యజ్ఞంలా పూర్తి చేసి ఆ ఫలాలను రైతులకు వినియోగంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం మొదలు పూర్తయ్యేంత వరకు ఎదురైన అనుభవాలను ఆయన అధికారులతో కలిసి నెమరేసుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎన్నో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు ఆదర్శం అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీఎం అధికారులకు సూచించారు.

నీటి వనరులపై ఆరా..
మేడిగడ్డ బ్యారేజీ నిండుగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం..  బ్యారేజీలోకి నీరు ఎక్కడ నుంచి వస్తోందని, ప్రస్తుతం బ్యారేజీలో ఉన్న నీటి నిల్వ ఎంత.. ఇన్‌ఫ్లో ఎంత? తదితర అంశాలను ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ రమణారెడ్డిని  అడిగి తెలుసుకున్నారు.  ప్రస్తుతం బ్యారేజీలోకి ప్రాణహిత ద్వారా నీరు చేరుతోందని, బ్యారేజీలో 16.05 టీఎంసీలు (పూర్తిస్థాయి నీటిమట్టం) ఉందని ఎస్‌ఈ తెలిపారు.

కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయాలి
మేడిగడ్డ బ్యారేజీ, తూపాకులగూడెం బ్యారేజీ, దుమ్ముగూడెం బ్యారేజీలను ఆనుసంధానిస్తూ ప్రతి బ్యారేజీ వద్ద కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బ్యారేజీలో నిల్వ ఉన్న నీటితోపాటు గేట్లు ఎత్తే సమాచారం తదితర అంశాలతో ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించాలని అన్నారు. సమయాణుగుణంగా రూల్స్‌ను అమలు చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

గోదావరి మాతకు వాయినం
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి లక్కీ నెంబర్‌గా భావిస్తున్న ‘ఆరు’తో ప్రారంభమైన 62, 63 గేట్ల వద్ద గోదావరి నదికి పట్టు వస్ర్తాలతో వాయినం సమర్పించారు. బ్యారేజీ నిండినట్లే రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని గోదావరి మాతను నమస్కరించారు. ఆయన వెంట మంత్రులు కొప్పుల ఈ శ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి స్మి తాసభర్వాల్‌, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, నల్ల వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, జడ్పీ చైర్‌పర్సన్లు పుట్ట మఽధూకర్‌, గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చందర్‌, దివాకర్‌ రావు, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సతీష్‌, నారదాసు లక్ష్మణ్‌, వరంగల్‌ నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, ఏఎస్పీ శ్రీనివాసులు, ట్రైనీ ఐపీఎస్‌ సుఽధీర్‌ రామ్‌నాథ్‌ కేకాణ్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ముక్తీశ్వరుడి సన్నిధిలో..
మహదేవపూర్‌ రూరల్‌/మహదేవపూర్‌,  జనవరి 19:  కాళేశ్వరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ముక్తీశ్వరస్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా మంగళవారం సందర్శించారు. అర్చకులు, వేద పండితులు మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. విజయ గణపతి వద్ద పూజలు నిర్వహించిన సీఎం దంపతులు ఆలయంలో స్వామివారికి మహా రుద్రాభిషేకం చేశారు. దీంతోపాటు పలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఇలవేల్పు అయిన శుభానందాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ దంపతులకు అర్చకులు పట్టు వస్త్రాలతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర చిత్రపటాన్ని బహూకరించారు.  కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ఇప్పటికి నాలుగుసార్లు దర్శించుకోవడం తన అదృష్టమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతానన్నారు.

రోడ్డు మార్గంలో త్రివేణి సంగమ గోదావరి తీరానికి బయల్దేరిన సీఎం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిండుగా ఉన్న గోదావరిని చూసి పులకించిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ జలదృశ్యం సాక్షాత్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ల కృషిని ఆయన అభినందించారు. అనంతరం గోదావరిని  ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు

దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌తోపాటు సర్పంచ్‌ వసంత, ఎంపీటీసీ మమత, ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ అరుణ, ఈవో మారుతి తదితరులు పాల్గొన్నారు.  కాగా, ముఖ్యమంత్రి పర్యటన సుమారు నాలుగు గంటల పాటు సాగడంతో రాష్ట్ర సరిహద్దుల్లో రామగుండం సీపీ సత్యనారాయణ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు, ముగ్గురు అడిషనల్‌ ఎస్పీలు, నాలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 ఎస్సైలతోపాటు 650 మంది సిబ్బంది పాల్గొన్నారు.








































Updated Date - 2021-01-19T05:30:00+05:30 IST