మూడోదశ ఇంటింటి సర్వే!

ABN , First Publish Date - 2020-04-09T09:09:35+05:30 IST

మూడోదశ ఇంటింటి సర్వే!

మూడోదశ ఇంటింటి సర్వే!

పకడ్బందీగా చేయాలని సీఎం ఆదేశం

అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు

ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడోసారి ఇంటింటి సర్వేను అత్యంత పకడ్బందీగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో 1.4 కోట్ల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలన్నారు. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ప్రకారం క్వారంటైన్‌లో ఉంచాల్సిన మందులను అందుబాటులో పెట్టాలన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా తెప్పించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని.. అత్యవసర సేవల చట్టం అమలులో ఉన్నందున ప్రైవేటు వైద్యులు, సిబ్బందికి జాబ్‌ చార్ట్‌లు వేసి.. సత్వరం సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశ్రమల శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ కరోనా నివారణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు హాజరయ్యారు. దీనికి ముందు.. రాష్ట్రంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో తయారైన కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను సీఎం జగన్‌ ప్రారంభించారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కొవిడ్‌-19 ర్యాపిడ్‌ కిట్ల తయారీని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. టెస్ట్‌ కిట్ల తయారీ.. పనిచేసే విధానాన్ని మెడ్‌టెక్‌ సీఈవో జితేంద్ర శర్మ, సిబ్బంది సీఎం జగన్‌కు వివరించారు. దేశంలో మూడు కంపెనీలకు మాత్రమే కిట్‌ల తయారీ అనుమతులున్నాయని జితేంద్ర తెలిపారు. ప్రస్తుతం రోజుకు 2 వేల కిట్‌లను తయారు చేస్తున్నామని.. ఏప్రిల్‌ రెండో వారానికి రోజుకు పదివేల కిట్లు.. తయారు చేసే సామర్థ్యానికి మోల్‌ బయో సంస్థ చేరుకుంటుందని జితేంద్ర వివరించారు. అదేవిధంగా మే నుంచి ప్రతి నెలా 6 వేల వెంటిలేటర్లను తయారు చేస్తామన్నారు. 


స్వయంశక్తి దిశగా

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో స్వయంశక్తి దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభపరిణామమని సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అత్యంత కీలకమైన కిట్లు, వెంటిలేటర్ల తయారీకి రాష్ట్రం కేంద్రంగా ఉండడం సంతోషకరమైన విషయమని, దేశానికే విశాఖ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ర్యాండమ్‌ కిట్లు అందుబాటులోకి రావడంతో.. పరీక్షలు చేసే సామర్థ్యం పెరుగుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో సన్నద్ధత బాగా పెరగాలని సీఎం సూచించారు. 

Updated Date - 2020-04-09T09:09:35+05:30 IST