Abn logo
Oct 18 2020 @ 03:11AM

ఏవీ ఆ ‘వేల’ మాటలు!

వరద రిలీ్‌ఫపై సీఎం రివర్స్‌గేర్‌.. విపక్షనేతగా నాలుగైదు వేలు డిమాండ్‌

సీఎంగా నేడు చేతికి తలో రూ.500


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘ప్రతి ఇంటికి కనీసం నాలుగైదు వేల రూపాయలు ఇవ్వకపోతే వాళ్లు ఎలా బతకగలగుతారు? గ్రామాలు..గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క అధికారి కూడా వాళ్లను(బాధితులను) కలవలేదు’’ అని జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది ఇప్పుడు కాదులెండి. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వరదపీడిత ప్రాంతాలను సందర్శించిన సమయంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పటికి మించిన ఆపదే ఇప్పుడు వరద కొనితెచ్చింది. నాటి తన ఆవేదనను ఆచరణలోకి తెచ్చే అవకాశమూ ఆయనకు ఉంది. కానీ, వరద బాధితులకు ఆయన ప్రకటించింది తలకు రూ.500! వరద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్‌ క్యాంపుల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత బాధితులు తమ తక్షణ అవసరాలను తీర్చుకునేందుకు ఈ డబ్బులు ఇవ్వాలని సీఎం చెప్పారు. ఆ వె ంటనే అధికారులు రాష్ట్ర విపత్తు స్పందన నిధి నిబంధనల మేరకు సొమ్ము ఇస్తున్నట్టు జీవో విడుదల చేశారు. జగ న్‌ విక్షనేతగా ఉన్నప్పుడు చేసిన డిమాండ్‌, సీఎంగా చేస్తున్న సాయానికి ఎందుకు పొంతన లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా తుఫానులు, వాయుగుండాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. రైతులు, ప్రజలు పంటలు, పాడిసంపదను కోల్పోయారు. ఇళ్లు నీట మునిగిపోవడంతో నిత్యావసరాలను కోల్పోయారు. అయినా, సర్కారు సాయం ఆయన నాడు డిమాండ్‌ చేసినంత కూడా లేదు. వరద పీడిత ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ వారికి భరోసా ఇచ్చేందుకు సీఎం ఇప్పటిదాకా పర్యటించకపోవడాన్నీ పలువురు తప్పుబడుతున్నారు.