వెయ్యి కోట్ల సాయం అందించండి

ABN , First Publish Date - 2020-10-18T08:42:34+05:30 IST

వెయ్యి కోట్ల సాయం అందించండి

వెయ్యి కోట్ల సాయం అందించండి

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సీఎం జగన్‌ లేఖ 


అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకూ రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, తక్షణం వెయ్యికోట్లు సాయం చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జగన్‌ లేఖ రాశారు. అసలే కొవిడ్‌-19తో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్నివరదలు మరింత కష్టాల్లోకి నెట్టాయని లేఖలో పేర్కొన్నారు. 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరంలో ఏకంగా 265.10 మిల్లీమీటర్లు, కాట్రేనుకోనలో 228.20, పశ్చిమగోదావరి జల్లా ఆకివీడులో 205.30, పేరపల్లిలో 204.02 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. ఎగువనున్న తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తిందని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైందని వివరించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ భారీ వర్షాలు కురిశాయని, వరుస వర్షాలు, వరదలతో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. కాల్వలకు గండ్లు పడ్డాయని, విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, వాగులూ వంకలూ పొంగి రవాణా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4450 కోట్ల నష్టం వాటిల్లిందని, రాష్ట్రంలో 14 మంది చనిపోయారని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలబడాలని కోరారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణమే రూ.1,000 కోట్లు సాయమందించాలని కోరారు. అలాగే, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని అభ్యర్థించారు. 

Updated Date - 2020-10-18T08:42:34+05:30 IST