అది పాలనా వ్యవస్థ దాడి

ABN , First Publish Date - 2020-10-18T08:48:12+05:30 IST

అది పాలనా వ్యవస్థ దాడి

అది పాలనా వ్యవస్థ దాడి

సీఎం జగన్‌ ఆరోపణలు హాస్యాస్పదం

ఒక్క తీర్పులో అయినా లోపాలు చూపారా?

బెజవాడ బార్‌ అసోసియేషన్‌ నిలదీత


విజయవాడ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. వారికి రాజ్యాంగ రక్షణ ఉంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రభావంతో హైకోర్టు న్యాయమూర్తులు తీర్పులు వెలువరిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. దీనిని న్యాయవ్యవస్థపై పాలనా వ్యవస్థ చేస్తున్న దాడిగానే చూడాలి’’ అని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. బార్‌ అసోసియేషన్‌ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యు డు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం లో న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ మధ్య ఘర్షణ వాతావరణం ఉందని మేధావులు భావిస్తున్నారని, ఇది ఘర్షణ కాదని, న్యాయవ్యవస్థపై పాలనా వ్యవస్థ చేస్తున్న దాడి అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రభావంతో హైకోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చెప్పిన ప్రభుత్వం ఒక్క తీర్పులోనైనా లోపాలను ఎత్తి చూపిందా? అని నిలదీశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టింగ్‌లు పెడితే 4 గంటల్లోనే అరెస్టు చేస్తున్న పోలీసులు.. న్యాయవ్యవస్థపై అలాంటి పోస్టింగ్‌లు పెడితే ఎందుకు అరెస్టు చేయడం లేదని, ‘రూల్‌ ఆఫ్‌ లా’ అంటే ఇదేనా? అని దుయ్యబట్టారు. 


40 ఏళ్ల సర్వీసులో వెయ్యి గజాలు కొంటే అవినీతా?

బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై చేసిన ఫిర్యాదులో ఏ ఒక్క ఆధారా న్నీ ప్రభుత్వం చూపలేదన్నారు. ‘గ్యాగ్‌’ ఆర్డర్‌ ఇవ్వ డం ఇదే ప్రథమం కాదన్నారు. సహారా కేసులో సుప్రీం కోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ను ఇచ్చిందని చెప్పారు. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ ఇదే ఆర్డర్‌ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా దాదాపు 40 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ 1000 గజాల స్థలం కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏముందని ప్రశ్నించారు. జగన్‌పై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ మొదలైందని, అందులో శిక్ష పడితే దాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణపై నెట్టడానికే ఈ ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రశాంతంగా నడవడానికి న్యాయవ్యవస్థే కారణమని బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు సుంకర కృష్ణమూర్తి అన్నారు. సమావేశంలో చేకూరి శ్రీపతిరావు, కె.భవన్నారాయణ, కె.సత్యనారాయణ, జేఏసీ సభ్యుడు మట్టా జయకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-18T08:48:12+05:30 IST