విడతల వారీగా చెల్లిస్తాం

ABN , First Publish Date - 2020-04-09T09:26:51+05:30 IST

విడతల వారీగా చెల్లిస్తాం

విడతల వారీగా చెల్లిస్తాం

పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలు ఐదేళ్లలో 4,800కోట్లు 

గత ప్రభుత్వంలా గాలిమాటలు  వద్దు

కొత్త పాలసీలో వాస్తవాలే చెప్పండి

కాలుష్యరహిత పరిశ్రమలు రావాలి: సీఎం

నూతన పారిశ్రామిక విధానంపై సమీక్ష


అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలకు చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు రూ.4,800 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. వీటిని విడతల వారీగా చెల్లించడంపై దృష్టిపెట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు. ప్రోత్సాహకాలు చెల్లించకుండా గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం.. ఇది చేస్తాం అని గాలి మాటలు చెప్పడం కాకుండా.. కొత్త పారిశ్రామిక విధానంలో చేసేదే చెప్పాలని, పారిశ్రామికవేత్తలకు నమ్మకం కల్పించాలని నిర్దేశించారు. నూతన పారిశ్రామిక విధానంపై ఆయన బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు రజత్‌ భార్గవ, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. మోసం చేసే రీతిలో హామీలు ఇచ్చి చివరకు ఏదీ ఇవ్వకూడని విధంగా నూతన విధానం ఉండకూడదన్నారు. మనం చెప్పే మాటలపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఉండాలని చెప్పారు.


ప్రోత్సాహకాల చెల్లింపును దశల వారీగా చేపట్టాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన చేస్తున్న పరిశ్రమలకు తొలుత చెల్లించాలని పేర్కొన్నారు. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ ఇద్దామని, వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దామన్నారు. భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంతమందో వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధినిస్తున్న సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు తోడ్పాటు అందించే దిశగా ముందుకెళ్లాలన్నారు. పరిశ్రమలపై కోవిడ్‌-19 ప్రభావంపైనా చర్చించారు. మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పుల కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్ధికి తోడ్పడే వివిధ రంగాల పరిశ్రమలపైనా కసరత్తు చేయాలని సూచించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావాన్ని కేంద్రం కూడా అంచనా వేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కాలుష్యనియంత్రణపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున ఆ అంశంపై ముందుకెళ్లాలని చెప్పారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్‌-నిర్మాణ్‌’ పోర్టల్‌ను జగన్‌ ఆవిష్కరించారు. దీని ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ గృహ నిర్మాణం, వివిధ శాఖల పరిధిలోని పనులకు అవసరమయ్యే సిమెంటుకు ఇండెంట్‌ పెట్టుకోవాలి. దీని ప్రకారం కంపెనీలు సిమెంటు సరఫరా చేస్తాయి. ఈ పోర్టల్‌ను సీఎ్‌ఫఎంఎ్‌సకు అనుసంధానం చేయడం వల్ల నిధులు నేరుగా కంపెనీలకే వెళ్లిపోతాయి. ‘ఏపీ ఇండస్ట్రీస్‌ కోవిడ్‌-19 రెస్పాన్స్‌’ పోర్టల్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. 

Updated Date - 2020-04-09T09:26:51+05:30 IST