Abn logo
Oct 22 2021 @ 02:21AM

అక్కసుతో దూషణలు

  • ముఖ్యమంత్రినే ‘‘... కొడుకు’’ అని తిట్టించారు
  • విగ్రహాల ధ్వంసం నుంచి కోర్టు కేసుల వరకూ కుట్రే
  • డ్రగ్స్‌తో రాష్ట్రానికి సంబంధం లేకున్నా దుష్ప్రచారం 
  • 21 నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు 
  • పోలీస్‌ ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌ 
  • పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం 


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాలేమన్న అక్కసుతో రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని సీఎం జగన్‌ అన్నారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి తల్లిని సైతం బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్‌తో రాష్ట్రానికి సంబంధం లేదని పదేపదే చెబుతున్నా గోబెల్స్‌ ప్రచారంతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో గురువారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేదిక నుంచి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం దక్కలేదని, ఇకపై అధికారంలోకి రాలేమన్న అక్కసుతోనే చీకట్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడులు, రథాలు దగ్ధం చేశారని ఎదురుదాడికి దిగారు.


కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు సంకోచించడం లేదని, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయించారని ధ్వజమెత్తారు. పదవి దక్కదన్న అక్కసుతో ముఖ్యమంత్రిని ‘బోష్‌డీకే’ అని తిట్టిస్తున్నారని, దానికి ‘లం.. కొడుకు’ అని అర్థమంటూ జగన్‌ వివరించారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన అభిమానులు గొడవలు చేస్తే శాంతి భద్రతలు అదుపు తప్పి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్ర ఉందన్నారు. వీళ్లు టార్గెట్‌ చేస్తున్నది సీఎంనో, ప్రభుత్వాన్నో మాత్రమే కాదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపైనా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారం క్రిమినల్‌ బ్రెయిన్‌తో రాష్ట్రం పరువు తీసేందుకు డ్రగ్స్‌పై ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో గీత దాటితే తన, మన భేదం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. కొవిడ్‌ కారణంగా ఆగిపోయిన వీక్లీ ఆఫ్‌లను ఈ నెల 21 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...