Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు: జగన్

అమరావతి: శాసనసభలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆ సమయంలో తాను సభలో లేనని, సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యమన్నారు. మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయిందని, మండలిలో వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగిందన్నారు. 


కౌన్సిల్‌ ఛైర్మన్‌గా వైయస్సార్‌సీపీకి చెందిన దళితుడు రాబోతున్నారని, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని, ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదని జగన్ అన్నారు. సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు. సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షం నుంచి మాట్లాడతారని వివరించారు. చంద్రబాబు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికార పక్షం నుంచి మాట్లాడలేదన్నారు. టీడీపీ ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా ఆనాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపై కూడా చర్చ జరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారన్నారు. చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈ మాటలన్నారని జగన్ పేర్కొన్నారు. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదన్నారు. కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూ మాట్లాడలేదన్నారు. మా చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారన్నారు. అధికారపక్షం నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నారు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుందన్నారు. వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారని, ఇవన్నీ మన కళ్లముందే చూశామన్నారు. అన్నీ దేవుడు చూస్తాడని జగన్ వ్యాఖ్యానించారు.


Advertisement
Advertisement