Abn logo
Sep 22 2021 @ 23:38PM

సీఎం జగన్ నిర్ణయంతో.. వైసీపీలో ప్రకంపనలు!

పరిషత్‌ పదవులపై జగన్‌ సరికొత్త ఫార్ములా! 

జడ్‌పీటీసీ, ఎంపీపీలలో ఒకటే ఓసీలకు 

రెండు పదవులు అన్‌ రిజర్వ్‌డ్‌లో ఉన్నా ఎంపీపీని బీసీ లేక ఎస్సీలకు ఇవ్వాలని ఆదేశం 

కోట్లు కుమ్మరించిన అగ్రవర్ణాల నాయకుల గగ్గోలు 

వీడని సస్పెన్స్‌.. కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు 

జడ్పీ వైస్‌ చైర్మన్లలో ఒకటి గిద్దలూరు, మరొకటి పర్చూరుకు?


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): పరిషత్‌ పదవుల పంపకంలో సీఎం నిర్ణయంచిన సరికొత్త విధానం వైసీపీలో కాకపుట్టిస్తోంది. ఒక మండలానికి సంబంధించి జడ్పీటీసీ, ఎంపీపీ అన్‌ రిజర్వ్‌డ్‌లో ఉంటే విధిగా ఎంపీపీ పదవికి ఎస్సీ లేక బీసీలను ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో అన్ని రిజర్వేషన్లు పోను అగ్రవర్ణాలకు దక్కిన కొద్దిపాటి ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు కుస్తీ పడుతున్న వైసీపీలోని పలువురు నాయకులకు చుక్కెదురైంది. ఫలితంగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు కొన్ని మండలాల్లో ఆరంభమైన క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీలోని వైరి వర్గాల వారు ఢీ అంటే ఢీ అంటున్నారు. 


జిల్లాలో అన్‌ రిజర్వ్‌డ్‌ కింద ఉన్న స్థానాల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపజేశారు. తదనుగుణంగా అగ్రవర్ణాలకు చెందిన వారు పోటీచేసి గెలుపొందారు. కొన్నిచోట్ల అన్‌రిజర్వ్‌డ్‌ జనరల్‌ కేటగిరిలో కొందరు వైసీపీ నాయకులు వారి స్థానే భార్యలను లేక ఇతర కుటుంబంలోని మహిళలను పోటీకి నిలిపి గెలిపించుకున్నారు. అదేపంథాలో ఎంపీపీ పదవుల కోసం భారీసంఖ్యలో ముందుకొచ్చారు. వారందరిలో కొందరిని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు గుర్తించి వారికి పదవిపై హామీ ఇచ్చి ఎంపీటీసీల ఎన్నికలకు వారితో డబ్బుని ఖర్చుపెట్టించారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే వారి నుంచి పెద్దమొత్తంలోనే డబ్బులు కూడా తీసుకుని కొంత జేబులో వేసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్‌ ఇచ్చిన ఆదేశాలతో కథ తారుమారవుతోంది.


ఇప్పటికే జడ్పీటీసీ పదవి అన్‌రిజర్వ్‌డ్‌లో ఉండి అగ్రవర్ణాల వారు గెలిచి ఉంటే అదే మండల ఎంపీపీ పదవి అన్‌ రిజర్వ్‌డ్‌లో ఉంటే ఎంపీపీగా అగ్రవర్ణాల వారికి అవకాశం ఇవ్వవద్దని స్పష్టమై న ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అలాంటి మండలాల్లో ఎంపీపీలుగా దళితులు లేక బలహీన వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఈ విషయంలో మరో ఆలోచన చేయొద్దంటూ రాష్ట్ర పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు గట్టిగా చెప్పారు. ఆ ప్రకారం చూస్తే 14 నుంచి 15 మండలాల్లో ఇప్పటికే నిర్ణయించి లేక ఒకరిద్దరు పోటీపడుతున్న ఎంపీటీసీలను పక్కనపెట్టి దళిత లేక బీసీ వర్గానికి చెందిన ఎంపీటీసీని ఎంపీపీగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు మార్కాపురం, తర్లుపాడు, చివరికి ఒంగోలు రూరల్‌, కందుకూరు, లింగసముద్రం లాంటి అనేక మండలాలున్నాయి.


ఇలాంటి మండలాల్లో అత్యధికచోట్ల ఎంపీపీ పదవికి అగ్రవర్ణాలకు చెందిన వారిని ఎంపిక చేసి వారిచేత ఎన్నికల్లో ఖర్చుపెట్టించారు. ఇప్పుడు అలాంటి వారిని పక్కనబెట్టాల్సి రావటంతో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఒత్తిడికి గురవుతున్నారు. పశ్చిమ ప్రాంతంలోని రెండు మండలాల్లో సదరు ఎమ్మెల్యేకి ముందుగానే డబ్బులిచ్చిన ఎంపీపీ అభ్యర్థులు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తున్నట్లు తెలిసింది. కొన్ని మండలాల్లో వైసీపీలోని అగ్రవర్ణాల నాయకుల మధ్య ఏర్పడిన పోటీ నుంచి ఈ తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలు సులువుగా బయట పడుతున్నారు. ఏది ఏమైనా జగన్‌ నిర్ణయం వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది.


న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం

ఎంపీపీ పదవుల విషయంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గవిబేధాలు ఇంతవరకు ఎక్కడా చల్లారలేదు. ఆరంభమైన క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముండ్లమూరు వ్యవహారంపైన అధిష్ఠానం నుంచి స్పష్టత లభించలేదు. ఆ మండలంలో ఎమ్మెల్యే ప్రతిపాదనను వ్యతిరేకించే బూచేపల్లి అభిమాన నేతలు బుధవారం మరోసారి మంత్రి బాలినేనిని కలిసి మా వైపు ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందే, లేదంటే తాడోపేడో తేల్చుకుంటామన్నట్లు మాట్లాడినట్లు తెలిసింది. అంతకుముందు ఎమ్మెల్యే మద్దిశెట్టి బలపరిచిన ఎంపీపీ అభ్యర్థిని భర్త బ్రహ్మానందరెడ్డి కూడా ఆరంభం నుంచి పార్టీలో ఉన్న తాను కోట్లు ఖర్చుపెట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటం దారుణమని, పార్టీ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చిచెప్పినట్లు తెలిసింది. యద్దనపూడి వ్యవహారం అలానే కొనసాగుతోంది. అక్కడ అదృశ్యమైన ఎంపీటీసీ బుధవారం సాయంత్రానికి కూడా బయటకు రాలేదు. అయితే ఒకరిద్దరికి నేను క్షేమం, ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ వీడియో సందేశం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. కొండపి మండలానికి సంబంధించిన క్యాంపులూ కొనసాగుతున్నాయి. ఇతరత్రా అనేక మండలాల నుంచి వచ్చిన సమస్యలపై అధ్యయనం చేస్తున్న మంత్రి బాలినేని తాజాగా పార్టీ నిర్ణయించిన రిజర్వేషన్ల నిర్ణయానికి అనుగుణంగా చేర్పులు మార్పులు చేసుకుని అయినా సమస్యలు ఉన్న మండలాలపై గురువారం స్పష్టతనిస్తే ఆ రాత్రికే సమస్యను పరిష్కరిస్తాం, ఆ రాత్రికే పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తాం లేదంటే షీల్డ్‌ కవర్‌లో ఎంపీపీ, అలాగే వైస్‌ ఎంపీపీ అభ్యర్థుల పేర్లని పంపిస్తామని చెప్పినట్లు తెలిసింది. 


వైస్‌ చైర్‌పర్సన్లపై తర్జనభర్జన 

జడ్పీ వైస్‌చైర్మన్‌ల ఎంపికపై మంత్రి బాలినేనికి ఆయా నియోజకవర్గాల నుంచి పలు సిఫార్సులు అందాయి. అద్దంకి నియోజకవర్గానికి చెందిన బీసీకి అవకాశం ఇవ్వాలని శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య మంత్రిని కలిసి కోరారు. అలాగే ఇతర పలు నియోజకవర్గాల నుంచి మంత్రికి విజ్ఞాపనలు అందాయి. అందిన సమాచారం మేరకు.. పశ్చిమప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ఒక యాదవ సామాజికవర్గం జడ్పీటీసీని, పర్చూరు నియోజకవర్గానికి చెందిన మాదిగ సామాజికవర్గం జడ్పీటీసీని వైస్‌ చైర్‌పర్సన్‌లుగా ఎంపిక చేసే అంశం అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. జడ్పీ చైర్‌పర్సన్‌గా వెంకాయమ్మ పేరుని మంగళవారం కూడా మరోసారి సీఎం జగన్‌ వెల్లడించిన నేపథ్యంలో బూచేపల్లి కుటుంబసభ్యులు ఆమె ఎంపికకు కావాల్సిన కసరత్తుని ప్రారంభించారు. దీంతో చీమకుర్తిలోని బూచేపల్లి నివాసం వద్ద సందడి వాతావరణ ం నెలకొంది.


అద్దంకిలో సరికొత్త వ్యూహం 

ముఖ్యమంత్రి జగన్‌ విధానానికి అనుగుణంగా ఎక్కువమందికి పదవుల్లో అవకాశం కల్పించే లక్ష్యంతో ప్రతి ఎంపీపీ పదవీకాలం పూర్తయ్యేలోపు ఆ మండలంలో ఇద్దరు ఆ పదవిని అధిరోహించే విధమైన నిర్ణయాన్ని కృష్ణచైతన్య ప్రకటించటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎంపికయ్యే ఎంపీపీలు రెండున్నరేళ్లకు రాజీనామా చేయాలని తదనంతరం మరొకరికి అవకాశం ఇవ్వటం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. గత్యంతరం లేక నాలుగు మండలాల ఎంపీపీ అభ్యర్థులు అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సంతమాగులూరు వ్యవహారంపై వివాదం కొనసాగుతుండటంతో మంత్రి బాలినేని వద్ద ఆయన పంచాయతీ పెట్టగా ఆయన కూడా చైతన్య నిర్ణయాన్ని ఆమోదిస్తూ తొలి రెండున్నరేళ్లు చిన వెంకటరెడ్డి ఆ తర్వాత ఏల్చూరుకి చెందిన కోటిరెడ్డికి ఆ పదవిని ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ముందుగానే ప్రస్తుతం ఎంపీపీలు అయ్యేవారి నుంచి రాజీనామా లేఖలు తీసుకోవటం, దానిని ఆమోదిస్తున్నట్లు ఎంపీటీసీల నుంచి కూడా ఆమోదముద్ర వేయించుకుంటున్నట్లు తెలిసింది.