పోలవరం అంచనా 55,656 కోట్లకు ఆమోదించండి

ABN , First Publish Date - 2021-06-11T08:23:34+05:30 IST

పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు

పోలవరం అంచనా 55,656 కోట్లకు ఆమోదించండి

సీమ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వండి

కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ వినతి

గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు

చేసిన ఖర్చు తక్షణమే రీయింబర్స్‌ చేయండి

పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించండి


న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన ఆయన.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను, పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను, అనంతరం నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ను కలిశారు. షెకావత్‌తో ఇరవై నిమిషాలపాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలని జగన్‌ కోరినట్లు ఇక్కడ ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. 2017-18 నాటి ధరల సూచీ ప్రకారం పెరిగిన ఈ అంచనా వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం, జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి(టీఏసీ) కూడా ఆమోదించాయని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను తక్షణమే రీయింబర్స్‌ చేయాలని కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందువల్ల పెరిగిన అంచనా వ్యయాన్ని ఆమోదించి, సహకరించాలని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస పనులకు నిధులివ్వాలని కోరారు. 


హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏపీ సచివాలయ కార్యకలాపాలు జరగనందువల్ల, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం పీపీఏ కార్యాలయ అధికారుల రాకపోకలకు ఇబ్బందవుతోందని, అందుచేత పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో పెండింగ్‌లో ఉన్న కొన్ని చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని జావడేకర్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరినట్లు తెలిసింది. అనంతరం నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ను సీఎం కలిశారు. ఇటీవల జాతీయ సుస్థిరాభివృద్ధి అంశంలో రాష్ట్రానికి 4వ, స్థానం దక్కిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పురోగతితో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించినట్లు సమాచారం.


ముఖ్యమంత్రి వెంట..

రెండ్రోజుల పర్యటన కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గురుమూర్తి స్వాగతం పలికారు. ఆయన వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రులతో సీఎం భేటీ ఆయినప్పుడు ఎంపీలంతా ఆయనతో వెళ్లారు.

Updated Date - 2021-06-11T08:23:34+05:30 IST